ఐదారు నెలల కిందట యాదృచ్ఛికంగానో, మనసులో మాటో, అధిష్ఠానం కోయిల కూసిందో.. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తనతో సమానంగా సీఎం అయ్యే అర్హతలున్నాయని, ఆయన నిజమైన పోరాట యోధుడని రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఆ మర్నాడే మరో మంత్రి ఉత్తమ్‌కు కూడా ఇలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రి వ్యాఖ్యల అర్థం ఏదైనా కావొచ్చు. ‘రీడ్ బిట్వీన్ ద లైన్స్’ విధానంలో విశ్లేషిస్తే పార్టీ-ప్రభుత్వ స్టీరింగ్ మీద చేతులు మారే అవకాశాలున్నాయేమోనన్న అభిప్రాయం కలగడం సహజం. ఐదారు నెల ల కిందట జరిగిన ఈ సంగతి ఆ తర్వాత పూ వు పూసి, కాయ కాసి, ఇప్పుడు దోరపండు స్థాయికి చేరుకున్నది. ఎప్పుడైనా పూర్తిగా పక్వానికి రావొచ్చు. ఇటీవలి కొన్ని పరిణామాలను, వాటి పర్యవసానాలను నిశితంగా విశ్లేషిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథ సారథ్యం సంక్షోభంలో కూరుకుపోతున్నదా? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నది. నాయకుడి అదుపులోంచి పరిస్థితి శీఘ్రంగా జారిపోతున్నదనే భావన విశ్లేషకుల్లో కనిపిస్తున్నది. ఊపిరాడనివ్వకుండా అస్మదీయ, తస్మదీయ ఎమ్మెల్యేల వేరుకుంపటి సెగలు-పొగలు, పార్టీ మారివచ్చిన ఎమ్మెల్యేలలో అపోహలు, అసహనం, ఏ మంత్రి పదవికి ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన, కొందరు మంత్రుల మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిని బాహాటంగా ప్రకటిస్తున్న సందర్భాలు, ఆ క్రమంలో తొలి అడుగుగా కలకలం రేపిన పదిమంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త, వీటన్నిటినీ తలదన్నే, కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్ నిర్వహించిన సర్వేలో దాదాపు 70-80 శాతం మంది కాంగ్రెస్ పాలన వ్యతిరేకించడం వంటివి దేనికి దారితీయనున్నవో?
కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే, అధినాయకత్వం మీద భయంతో కూడుకున్న అపార విశ్వాసం, గౌరవం, విచిత్రమైన క్రమశిక్షణ జగద్విదితం. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా, తుమ్మితే ఊడే ముక్కులాగా నాయకత్వ మార్పు అలవోకగా ఏ క్షణంలోనైనా జరగవచ్చు. అధిష్ఠానాన్ని పార్లమెంటరీ బోర్డ్ అనీ, హైకమాండ్ అనీ సమయం, సందర్భాన్ని బట్టి పాజిటివ్, లేదా నెగెటివ్ అర్థం వచ్చేటట్టు ముద్దుముద్దుగా పిలుచుకుంటారు కాంగ్రెస్ పార్టీలోని చోటా, బడా నాయకులు. ఎన్టీఆర్ సీఎం కావడానికి పూర్వం రాష్ట్ర రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిర్గత, సమ్మతి, అసమ్మతి, రాజకీయాలే. నిస్వార్థంగా, గౌరవప్రదంగా, విద్వేషరహితంగా రాజకీయాలలో రాణించిన మహనీయులెందరో నడయాడిన తెలుగురాష్ర్టాలలో వర్తమాన రాజకీయాలు జుగుప్స, అసహనం, అసహ్యం, నిస్సహాయత, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా, వేగంగా మారుతున్న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల నేపథ్యంలో నాయకత్వ మార్పు ఉండవచ్చా? లేదా? అని చూసుకుంటే, గత ఏడు దశాబ్దాల అనుభవాలను చర్విత చరణం చేసుకుంటే ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సామెత గుర్తుకు వస్తుంది.
ముఖ్యమంత్రి కావడానికి ముందు సీఎల్పీ నాయకుడి ఎంపిక ఆసక్తికరంగా వుండేది. 1956లో సంజీవరెడ్డి ఎన్నికైనప్పుడు రాజకీయం చేయకుండా ఐక్యతకు, క్రమశిక్షణకు అధిష్ఠానం ప్రాధాన్యం ఇచ్చింది. 1957 సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా, చెన్నారెడ్డి అభ్యంతరాన్ని కాదని, నీలం సంజీవరెడ్డినే సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు. 1962 ఎన్నికల అనంతరం, నీలం, దామోదరం పోటీలో నిలిచినప్పటికీ, సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అధిష్ఠానం ఆదేశించింది. నీలం సీఎం అయ్యారు.
1964లో సీఎం పదవికి రాజీనామా చేసిన సంజీవరెడ్డి, సీఎల్పీ నాయకుడిగా కొనసాగుతూనే, బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా నామినేట్ చేయించగలిగారు. 1967 సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో గెలిచి సీఎల్పీ నాయకుడిగా బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1972 ఎన్నికల తర్వాత పీవీ ఏకగ్రీవంగా సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన ఆందోళన నేపథ్యంలో పీవీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, సీఎల్పీ నాయకుడిగా మాత్రం కొనసాగారు. ఆ తర్వాత పీవీని ఆ పదవికి రాజీనామా చేయమని అధిష్ఠానం ఆదేశించింది. 1973 అక్టోబర్ చివరలో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం తదుపరి సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను ఇందిరాగాంధీకే వదిలేసింది. 1983లో ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం, ఎన్టీ రామారావు అఖండ విజయం సాధించి సీఎంగా మొదటిసారి కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటు కావడం, సమకాలీన రాజకీయ చరిత్ర. ఆ సమకాలీన చరిత్రలోనే విఫలమైన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఒక దురదృష్టకర అధ్యాయం. 1989 శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీ పెద్దల అండతో, సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు.
2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, డీ శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ అధిష్ఠానం(సోనియాగాంధీ) ఆశీస్సులు వైఎస్సార్‌కు లభించడంతో ఆయన సీఎం అయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరోమారు విజయం సాధించింది. రెండోసారి కూడా వైఎస్‌కే అవకాశం దక్కింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) రెండు పర్యాయాలు (2014, 2018 ఎన్నికలలో) అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. ఎన్టీ రామారావుకు, చంద్రబాబునాయుడుకు, చంద్రశేఖర్‌రావుకు వారికి వారే అధిష్ఠానం.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సారథ్యంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆయనే పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నికవుతారని అందరూ భావించినా అలవాటు, ఆచారం, సంప్రదాయం ప్రకారం అధిష్ఠానం నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ప్రకటన రాలేదు. సీఎంలు అయినవారెవరినీ కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తికాలం పదవిలో ఉండనీయలేదు. దీనికి భిన్నంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో కొనసాగగలరా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి, అసహనం, అసమ్మతి సహజం. దీనికి అతీతులెవరూ లేరు. శివుడి ఆజ్ఞ అంటే అధిష్ఠానం ఆజ్ఞ. ఎమ్మెల్యేల వేరుకుంపట్లు, రహస్య భేటీలు కాంగ్రెస్ పార్టీకి చెందినంతవరకు అధిష్ఠానం ఆశీస్సులు లేకుండా జరగవు! ఇంతకీ అధిష్ఠానం పనుపున చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరనేది ప్రశ్న?