కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధికారం మాటకు వచ్చేసరికి ఆయన ఇంత కపటంగా వ్యవహరిస్తారని గతంలో మనకు తెలియదు. ఊహించనైనా ఊహించలేదు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను తమ బడ్జెట్ల శక్తికి మించి ఇవ్వరాదని ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన, అప్పటినుంచి నిండా వారం రోజులైనా ముగియకుండా ఆరవ తేదీ నాడు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏకంగా ఏడు గ్యారెంటీల మ్యానిఫెస్టో ప్రకటించారు. దీన్నిబట్టి తన నీతి గురించి ఏమనాలో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు.
ప్రస్తుతం ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కూడా భాగస్వామిగా కల మహా గఠ్బంధన్ కూటమి. అక్కడ బడ్జెట్ పరిస్థితి ఏ విధంగా ఉందని వెతికితే, వారి ఆర్థికమంత్రి రామేశ్వర్ ఒరాన్ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2024-25 సంవత్సరపు బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు జీఎస్డీపీలో 2.7 శాతం ఉండనున్నది. దానిని బట్టి చూసినప్పుడు, రుణాల తిరిగి చెల్లింపును మినహాయించి చూపుతున్న మొత్తం వ్యయం రూ.1,20,400 కోట్లలో వారు ఎన్నికల వ్యయభారాన్ని ఎంతమేర మోయగలరు? ఇప్పుడు ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కలిసి విడుదల చేసిన హామీల పత్రాన్ని ఒకసారి చూద్దాం.
ఆ ఏడు గ్యారెంటీలు ఈ విధంగా ఉన్నాయి. పేదలకు రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఉచిత రేషన్‌ను నెలకు 5 కిలోల నుంచి 7కు పెంచటం, రూ.450కి వంటగ్యాస్ సిలిండర్, వరికి మద్దతు ధర క్వింటాలుకు ప్రస్తుత రూ.2,400 నుంచి రూ.3,200కు హెచ్చింపు, అటవీ ఉత్పత్తుల సేకరణ ధర 50 శాతం పెంచటం, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం ప్రస్తుత రూ.1,000 నుంచి రూ.2,500కు హెచ్చించటం. ఇవి నేరుగా నగదు ఖర్చుతో కూడుకున్నవి.
ఇవి గాక భారీగా ఖర్చు కాగలవి యువతకు 10 లక్షల ఉద్యోగాలు, అన్ని జిల్లా కేంద్రాలలో ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల ఏర్పాటుతో పాటు 500 ఎకరాలలో పారిశ్రామిక పార్కుల స్థాపన. ఏ ఖర్చూ ఉండని, లేదా స్వల్పంగా మాత్రమే ఉండగల పరిపాలనాపరమైన హామీలు కొన్నున్నాయి గాని వాటిని పక్కన ఉంచుదాం.
ఈ గ్యారెంటీలన్నిటికి కలిపి సంవత్సరానికి కాగల ఖర్చెంత? ఆ భారాన్ని బడ్జెట్ మోయకోగలదా అనే లెక్కలు మహా గఠ్బంధన్ నాయకులు చెప్పలేదు. ఇతరత్రా ఎవరైనా అంచనాలు వేశారో లేదా తెలియదు గాని అది మనకు ప్రస్తుతానికి తెలియదు. యథాతథంగా గ్యారెంటీల వివరాలను చూసినప్పుడు మాత్రం, అదేవిధంగా పైన పేర్కొన్న బడ్జెట్ అంకెలు కొన్నింటితో పోల్చినప్పుడు, ఈ భారం చాలా పెద్దదేనని ఎవరైనా గ్రహించగలరు. అటువంటప్పుడు నవంబర్ 1న ఆ విధంగా హెచ్చరించి జాగ్రత్తలు చెప్పిన ఖర్గే, నవంబర్ 6న ఇటువంటి గ్యారెంటీలు ఏ విధంగా ప్రకటించారన్నది మనలను వేధించే ప్రశ్న. ప్రకటించినప్పుడు తను, సోరేన్‌తో పాటు కూటమిలోని ఆర్జేడీ, సీపీఐ (మార్క్సిస్టు- లెనినిస్ట్) లిబరేషన్ నేతలు కూడా వేదికపై ఆసీనులై ఉన్నారు. ప్రకటనకు ముందు ఆయా అంశాలను వారంతా చర్చించే ఉంటారు. నవంబర్ 1 నాటి ఖర్గే వ్యాఖ్యలు కూడా అందరూ విని ఉంటారు.
అయినప్పటికీ ఇటువంటి అలవికాని హామీలను ఎందుకోసం ప్రకటించనట్లు? హామీలు కర్ణాటకలో 5, తెలంగాణలో 6, మహారాష్ట్రలో 5 కాగా, ఝార్ఖండ్‌లో 7కు పెరిగాయి. మహారాష్ట్ర ఎన్నికలు ఇంకా జరగలవలసి ఉండగా హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తెలంగాణ హామీలతో అక్కడి ప్రభుత్వాలకు ఊపిరి సలపకుండా ఉన్నది. ఖర్గే ఆ విధంగా మాట్లాడటం అందువల్లనే గదా. అయినప్పటికీ ఝార్ఖండ్‌లో అట్లా ఎందుకు ప్రకటించినట్లంటే అందుకు సమాధానం ఎవరైనా చెప్పగలరు. చెప్పేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇబ్బంది పడవచ్చు గానీ, అది అందరికీ తెలిసిన రహస్యమే. ఒక్క మాటలో – అధికారం. 28 రాష్ర్టాలు గల దేశంలో, 140 ఏండ్లు గల ఒక పార్టీ, కేవలం మూడింట పాలిస్తుండటం ఎంత అవమానకరం. ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీకి జూనియర్‌గా మాత్రమే. కనుక మహారాష్ట్రలో గెలవటం, ఝార్ఖండ్‌లో అధికారం నిలబెట్టుకోవటం జీవన్మరణ సమస్య వంటిదైంది. హర్యానాలో అన్నీ అనుకూలంగా ఉండి గ్యారెంటీలు ఇచ్చినా ఓడటంతో ఒత్తిడి బాగా పెరిగిపోయింది.
అందువల్ల ఒకవిధంగా ఆలోచిస్తే మల్లికార్జున ఖర్గేను అర్థం చేసుకొని సానుభూతి చూపగలం తప్ప, విమర్శించాలంటే మనసు రావటం లేదు. ప్రస్తుత ఝార్ఖండ్‌లో పాలించటమైతే చేస్తున్నారు గాని గఠ్బంధన్ ఆధిక్యత బొటాబొటియే. మొత్తం అసెంబ్లీ సీట్లు 81లో వారికి 45. మెజారిటీ కేవలం 8. యాంటీ ఇన్‌కంబెన్సీ ఎప్పుడైనా కొంత ఉండటం వల్ల ఈ స్వల్ప ఆధిక్యత తేలికగా మారవచ్చు కూడా. కనుక అన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఒకవేళ ప్రస్తుతం చేతిలో లేని మహారాష్ట్ర అటు ఇటు అయినా, ఝార్ఖండ్‌లో ఉన్న అధికారాన్ని కోల్పోతే తలదించుకోవలసి వస్తుంది. ఈ పరిస్థితులలో, కూటమి భాగస్వాముల కన్న కాంగ్రెస్ భయం చాలా ఎక్కువ. ఏవో కొన్ని క్లిష్ట సమయాలలో అబద్ధం చెప్పవచ్చునని, అందువల్ల పాపం అంటదని పెద్దలు స్పష్టం చేశారు. ఆ జాబితాలో అధికారం లేదు గాని, దాన్ని ఇప్పుడు చేర్చుకోవటంలో పాపం ఉండదని ఖర్గే బహిరంగంగా ప్రకటించినా తప్పు పట్టలేం మనం.
వాస్తవానికి మహారాష్ట్ర, ఝార్ఖండ్ రెండూ సంపన్న రాష్ర్టాలు. మహారాష్ట్ర గురించి తెలిసిందే గనుక ప్రస్తుతం ఇక్కడ చర్చిస్తున్న ఝార్ఖండ్ విషయానికి వస్తే, ఆఫ్రికా ఏ విధంగానైతే మొత్తం ప్రపంచంలోనే సహజసిద్ధ వనరుల రీత్యా అత్యంత సంపన్నమైనదో, అదే కారణాల వల్ల భారతదేశంలో ఝార్ఖండ్ కూడా అటువంటిదే. అయినప్పటికీ రెండుచోట్లా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అందుకు కారణాలు బయటివారి దోపిడీ, స్థానిక ప్రభుత్వాలు, నాయకుల అసమర్థత, వారు సైతం దోపిడీలో భాగస్వాములు కావటమన్నది ఆర్థిక నిపుణుల ఏకాభిప్రాయం.
ఆ మాట అందరూ అనుకునేదే కూడా. ఝార్ఖండ్‌లోని గిరిజనులకు, ప్రజలకు బ్రిటిష్ వలస పాలనకాలం నుంచి తిరుగుబాట్ల చరిత్ర ఉంది. అక్కడ బొగ్గు, యురేనియంపై రైట్ , అభ్రకం, రాగి తదితర విలువైన నిక్షపాలతో పాటు అటవీ సంపద పుష్కలంగా ఉండి కూడా, ఈ రోజున నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 42 శాతం మంది ప్రజలు పేదలే. సుమారు 33 శాతం మంది నిరక్షరాస్యులు. ఝార్ఖండ్ బీహార్‌లో భాగంగా ఉండినప్పుడు గాని, 2000లో వేరు పడినప్పటి నుంచి గాని అధిక సమయం కాంగ్రెస్ పార్టీ స్వయంగానో, ఇతరులతో పొత్తు కలిపో అక్కడ పాలించింది. అయినప్పటికీ ప్రజల దుస్థితి ఇదంటే, ఖర్గే గ్యారెంటీలకు ఎటువంటి విలువ ఇవ్వాలో ఆలోచించేందుకు కూడా మనమే సిగ్గుపడాలి. ఆయన పార్టీ మాత్రం ఎటువంటి సిగ్గులేకుం డా, అలవికాని హామీలతో ప్రజలను దగా చేసేందుకు మరొకసారి సిద్ధమవుతున్నది. అది కూడా అటువంటి మితిమీరిన గ్యారెంటీలు తగదని ఖర్గే మహాశయులు నీతులు చెప్పిన 5 రోజులకే. ఇతర రాష్ర్టాలలోని గ్యారెంటీలకు అదనంగా మరొక 2 వడ్డించి మరీ. ఏమి కపటనీతి చతురత ఇది!
ఈ సందర్భంలో మరొకటి విచారించాలి. అభివృద్ధి ద్వారా ప్రజలను బాగు చేయాలి తప్ప అసలు సబ్సిడీలు, ఉచితాలు వద్దనే చర్చ ఆర్థిక సంస్కరణల కాలం నుంచి ఉండటం తెలిసిందే. రాయితీలు పేదలకు, అర్హులైన బడుగు వర్గాలకు మాత్రమే పరిమితం చేయాలనే మరొక వాదన కూడా ముందుకొచ్చింది. రాయితీల దురుపయోగంపైనా చర్చలున్నాయి. విషయానికి ఇది ఒక పార్శం కాగా, తమ అసమర్థ పాలన, అవినీతి కారణంగా సక్రమమైన అభివృద్ధి ద్వారా ప్రజలకు మేలు చేయకుండా, అధికారం కోసం మాత్రం ప్రజలకు పార్టీలు ఎన్నికల సమయంలో పోటాపోటీగా అలవికాని హామీలు ఇవ్వటంతో ఆర్థికస్థితి గందరగోళంగా మారటం ఇటీవల ఎక్కువవుతున్నది.
ఉచితాలు తగదనే పార్టీలు సైతం గెలవటం కోసం అదే పని చేస్తున్నాయి. గెలుపు మీద నమ్మకం తగ్గే కొద్దీ హామీలు పెరుగుతున్నాయి. దీనంతటిలోని కపట క్రీడను గ్రహిస్తున్నప్పుడు ప్రజలు స్వయంగానే ఇదంతా వద్దనే కొత్త ధోరణి ఇప్పుడు మొదలవుతున్నది. కనుక ఇది అందరూ సీరియస్‌గా చర్చించవలసిన విషయం. పార్టీలన్నీ ఉమ్మడిగా సమావేశమై, ఇకనుంచి ఉచితాలు ఉండవనే తీర్మానం చేయగలిగితే ప్రజలకు, దేశానికి ఎంతో మేలు కలుగుతుంది.