తెల్లారకముందే సూర్యుడ్ని
నీ కళ్లల్లో వెలిగించుకొని నిద్ర లేస్తావ్!
నువ్వలా పక్కమీది నుంచి లేచి కూర్చొని రాత్రి తలకింద మెత్తలేక చేతినే మెత్తగా పెట్టుకొని పడుకున్నందుకు పాయలుగా విడిపోయిన జుట్టును ముడేసుకొని కొప్పు పెట్టుకుంటుంటే మన ఊరి చెరువులో బుంగపడి నీళ్లు సుడులు తిరుగుతున్నట్టు ఎంత సక్కగుంటదోనే నిన్నట్ల సూస్తే!
ఇగ సిన్నగా నువ్వు పైటకొంగును సర్దుకొని పొరక్కట్ట చేతుల పట్టుకుంటే ప్రపంచాన్ని శుద్ధిజేసే పారిశుద్ధ్య కార్మికురాల్లెక్కనే నా కండ్లల్ల నువ్వు తిరుగుతవమ్మా!!
ఇగ నువ్వు రోజు పోసే బియ్యపు నీళ్లకు బదులుగా దాసరిద్దమ్మమ్మోల్ల బర్ల కొట్టం నుండి నీ రెండు చేతులతో పెండను తీసుకొచ్చి నీళ్లల్లో కలిపి నువ్వు అలుకేస్తావుంటే ఆయుర్వేదాన్నీ నీ చేతుల్లోని లోటతో ఈ ప్రపంచం ముందు సల్లి గత్తర రాకుండా చేసే డాక్టర్ లెక్కనే కనిపిస్తవమ్మా!!
నువ్వు అలుకేసినంక వాకిలి మొత్తం చిలుకల గుంపు కూసున్నట్టే ఉంటదే అమ్మా! ఆ అలుకేసిన పెండ భూమిని కౌగిలించుకున్న ఘడియేందో తెల్వదు కానీ ఒక కమ్మని వాసన మన గుమ్మం దగ్గర్నుండీ గూడెమంత వస్తది!!
ఇగ అలుకేసినంక అందంగా సుద్దతో పెట్టే ముగ్గంటే నాకు చాలా నచ్చుతదమ్మా! నువ్వు చేతితో సుద్దపట్టి ముగ్గేస్తా వుంటే మట్టిపలక మీద పెద బాలశిక్షలో అఆలను దిద్దుతున్న పసిపాప లెక్కనే నాకగుపిస్తవమ్మా!
మన పందిరి పక్కన ఉన్న పులిసేరు చెట్ల పొదల్లో
నుంచి ఊరపిచ్చుకలు వాటి ఊపిరితో సప్పుళ్లను
చేస్తూ సూర్యుడికి రమ్మని ఆహ్వానం పంపుతాయి!
ఇగ నువ్వు పొయ్యి దగ్గరికి పోయి రాత్రి కాలిన కట్టెలకొచ్చిన బూడిదిని తీసి మన పెంటగడ్డల పారబోసొచ్చి ఈ రోజు బువ్వకూరలొండుదానికి మన మట్టిపొయ్యిని ఎంతో అందంగా ముస్తాబు చేస్తావ్!
నువ్వా మట్టిపొయ్యిని ఎర్రమన్నుతో గుడ్డపెట్టి
అలుకుతావుంటే పురాతన కట్టడాలకు రంగులద్దుతున్న పెయింటర్ లెక్కనే అగుపిస్తవమ్మ నాకు!
ఇగ నువ్వు పాలచెంబు పట్టుకొని కత్తులెంకమ్మింటికి పోయి పది రూపాల పాలు పట్టుకొచ్చి చాయ్ చేసి చిన్నగ్లాసుల నిండా చాయ్ పెద్ద గ్లాసుల నిండా నీళ్లు పట్టుకొచ్చి ప్రేమతో నాకిచ్చి నువ్వొక గ్లాసుల చాయ్ తెచ్చుకొని మన గనవ దగ్గర మెట్ల మీద నువ్వు నేనూ కూసోని చాయ్ తాగుతూ నువ్వు నాకు చెప్పే నీ ముచ్చట్లు నువ్వు పెట్టిచ్చిన చాయ్ లెక్కనే ఎంతో కమ్మగుంటయమ్మా!!
ఇప్పుడు నా దగ్గర నువ్వు లేవు
ఇప్పుడు నీ దగ్గర నేనూ లేను!
నా దగ్గర నువ్వుంటే నీ కడుపు మీద చెయ్యేసుకొని నీ మీద కాళ్లేసుకొని పడుకునేటోడ్నమ్మ!!