నా సిన్నప్పుడు ఓ పెద్ద ‘గై’ పట్టుకొని
ఈతపండ్లను రాలగొట్టి
ఏరుకున్నది యాదికస్తే…
సిన్న పంతులు బడిల
చూచిరాత కాపీల పడ్డ
‘గుడ్’లను లెక్కపెట్టుకున్నది యాదికస్తే…
బల్లెకెల్లి రాంగనే పుస్తకాలు
అరుగు మీద ఇసిరేసి
జారుడుబండ మీద
ఆడుకుంటున్నప్పుడు
సినిగిన నిక్కరు యాదికస్తే…
బడి ముంగట సింతసెట్టు కింద అమ్మేటి
అయిస్క్రేట్ డబ్బా మూలకెల్లి కారేదాన్ని
అరిసేతుల పట్టి తాగింది యాదికస్తే…
సలికాలం అచ్చిందంటే
మబ్బుల్నే లేసి మనిషికింత
సొప్ప ఏరుకచ్చి
సలిమంట కాగింది యాదికస్తే…
పోరగాండ్లందరం సెంబట్క పోయి
సేన్లల్ల రాలిన ఆయిందాలను ఏరి సెంబు నింపుకచ్చి కోమటి బుచ్చయ్యకు
ఆఠాణాకు అమ్మింది యాదికస్తే…
దసరా పండుగ ముంగట
సిన్నపంతులు తోటి
బాణాలు పట్టుకొని
‘పంతులుకు కట్నాలు-మాకు
పుట్నాలు’ అని
పాడింది యాదికస్తే…
హోళీ పండుగ సీజన్ల
కోలలు ఎయ్యపోయి
జమజేసిన మక్కల్ని
పోటువెట్టిచ్చి
మక్కగుడాలు పోసుకున్నది యాదికస్తే.,,
గౌండ్లోల్ల మామ
‘రాకె’ కట్టుకొని ఇంటికి తెచ్చిన
ముంజలకెల్లి ఎల్లిన నీల్లు తాగింది
యాదికస్తే…
ఏనుగుల గుట్టకు పోయి
సితవల్కాయలు తెంపుకచ్చి
మక్కబూరుల మక్కేసుకున్నది యాదికస్తే…
గడ్డమోల్ల నూతిల
కరెంటు ఇల్లు మీదికెల్లిసిర్రిగొట్టి
గంటల కొద్దీ నీల్లల్లనే ఉండి
ఈతగొట్టింది యాదికస్తే…
భూమిల ఎర్రల్ని దవ్వుకొని
గాలాల్ని పట్టుకొని నూతుల పొంట తిర్గి
పట్టిన చాపలను అవ్వ తిడ్తదని
వేరోళ్లకు ఇచ్చింది యాదికస్తే…
కచీరు కాడ బాగోతం ఆడితే
సాప వట్టుకొని పోయి
రాజు వేషం రాకముందే
నిద్ర పోయింది యాదికస్తె…
గిట్లనే ఇంకా ఎన్నెన్నో యాదికత్తున్నయ్…
గిసొంటియి యాదికస్తే మల్లా
ఒకసారి సిన్నపిల్లగాన్ని కావాలనిపిత్తది…
అయితనా?
-అల్లాడి శ్రీనివాస్
83416 63982