నీళ్ళు లేక
నిధులు లేక
ఊరు తల్లడిల్లింది
ఆకలికి ఏడ్చి ఏడ్చి
గుట్టకొకడూ పుట్టకొకడూ ఎళ్ళిపోతే
గుండెల్లో పాలు ఇంకిన ఊరుతల్లి
ఏకాకి అయ్యింది
సినిమా రీళ్ళు తిరిగినట్టు
కాలచక్రం గిర్రున తిరిగి
తాచుపాములా పగబట్టిన కరువుకాలం
తోక ముడుచుకున్నది
బొంబాయి, దుబాయి పనులకు
రెక్కలు కట్టుకొని ఎగిరిపోయిన అన్న
అరణ్యవాసం పూర్తయ్యి
అయోధ్యకు వచ్చిన శ్రీరాముడు
ఇన్నాళ్ళూ తాళంకప్ప కాపుగాసిన ఊరు
కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి
మామిడి తోరణాలతో స్వాగతం పలుకుతున్న
నిత్య పండుగ
చుట్టం చూపుగా వచ్చిన బిడ్డ
గూడు కట్టుకున్న ఆడపులి
కరువు దెయ్యం ముందు తలవంచి
జీతం గాడిద కాళ్ళు పట్టుకున్న రైతు
రోహిణీ ఎండలు వానలు అయినట్టు
తలపాగా ధరించి
నాగలి ఎత్తిన రారాజు
కప్పల పెండ్లీలు లేవు
బండ మీది భోజనాలు లేవు
దూరపు కొండల వైపు పరుగు లేదు
ఎండమావుల అడియాస లేదు
గూట్లో దీపం వెలుగుతున్నది
కూడు పెట్టని ఇదేమి ఊరు అని
తిట్టిన నోరు
క్షమాపణ కోరుతున్నది
ఊరు నిండా ఫీనిక్స్ పక్షులే
ఊరంతా
చెరువు నిండి
అలుగుదునుకు పద్యమే
తెప్పలు తెప్పలుగా
కుప్పలు కుప్పలుగా
బంధుగణము చేరుతున్నది
కన్నీటి వాగు
పన్నీరయ్యి పారుతున్నది
బోరు బావులకు ప్రాణమొచ్చి
పాతాళ గంగ
పిలిస్తే పలుకుతున్నది
పాడు ఇల్లని తలచే
బూజువట్టిన మట్టిగోడలు
జాజుపూత పూసిన అద్దాల మేడలు
నగరంలోని
బట్టలూ, నగల దుకాణాల ముందు
వేకెన్సీ పలకలు వేల్లాడుతున్నయి
ఇప్పుడిక్కడ
పల్లేరు మాటే లేదు
చేపలు ఎదురెక్కుతున్నయి
జీవితం
అర్థవంతంగా
భావం కుదిరిన
మహా కావ్యమయితున్నది.
గజ్జెల రామకృష్ణ: 89774 12795