‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీయై పోయిందో ’ అని ఒకనాడు వలపోసినం. జాతి యావత్తు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లెలా పోరుజేసినం. చావునోట్లో తలవెట్టి రాష్ట్రం సాధించుకున్నం. ఇప్పుడు ‘కాళేశ్వర గోదావరి పయనించిన ప్రతిచోటా పల్లెలన్నీ మల్లెలాయెరా..’ అంటూ పాడుకుంటున్నం. మనిషి పుట్టింది మొదలు చావుదాకా అరుసుకునేందుకు మన సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశవెట్టిండు. వయసు, కులమతాలతో సంబంధం లేకుండా తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వ పథకం అందని గడప లేదు. అందుకే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన పథకాలు దేశానికే ఆదర్శమంటూ ప్రముఖ మహిళా కవయిత్రులు తమ కవన శంఖాలను పూరించారు.
ఊరి చేతులు ఒక్కటై
ప్రభుత్వానిది పెద్ద చెయ్యై
బడిని ధ్వజస్తంభం చేసిండ్రు
బాలదేవోభవ కదా!
రేపటి దేశాన్ని నిర్మించే
చిన్న సమాజం
పౌర సంపదను
పటిష్ఠపరిచే బడి బాగుంటే
ఊరు బాగుంటది
ఊరంటే దేశమే!
ఇప్పుడు బడి అంటే
పెచ్చులూడిన గోడలు
అరకొర వసతులు కాదు
వినూత్న హంగుల కలల ప్రపంచం
రంగుల బొమ్మల కోకో మిలన్
ఆటపాటల చుచు టీవీ
ఇక్కడ పిల్లలు తమ కలలను
విప్పార్చుకుంటారు
తమ జ్ఞానాన్ని ఔపోసన పడుతారు
ప్రయోగాల పసను ఆస్వాదిస్తూ
కథల పుస్తకాలలో పదాల పదనిసలు వెతుకుతూ
తమ కౌశలాలకు పదును పెట్టుకుంటారు
ఆటంకం లేని చదువుకు
అన్ని వసతులను వడ్డిస్తూ బడిబాట
బాల్యానికి బంగారుబాట
చిన్ని రెక్కలు సంపాదనకు
బలి కాకుండా
బాల కార్మిక వ్యవస్థ అటకెక్కింది
ప్రతి చిన్నారికి భద్రత
బడిలోనే
డిజిటల్ పాఠశాల
బాల్యం పురివిప్పడానికి
పథకాల్లో మణిపూస.
డా.శారదా హన్మాండ్లు: 99122 75801
ఒక్క తలపుతో మొదలై,
ఒక్క తెగింపుతో నెరవేరింది కాదు
వేల మిణుగురులు ఏకమైతే
చీకటి చీలి ప్రసరించిన కాంతిది
వేల కొవ్వత్తులు కరుగుతూ
జాతికి ప్రసాదించిన వెలుగిది
అవమానాలను తొక్కిపట్టి ఆత్మగౌరవం
ఊపిరిగా సాగిన ప్రయాణం ఒక్కో నిప్పురవ్వ కూడి
ఆత్మగౌరవ నినాదం బడబాగ్నిలా మారి
దావానలమై వ్యాపించిన అగ్నికీలల ఆవేశంలో
దహనమైన నిరంకుశత్వానికి నిలువెత్తు సాక్ష్యమిది…
అసైదులా పీర్ల దరువు సప్పుడు,
అమ్మవారి జాతరలో సందడి,
ఇదే నా భిన్నత్వపు ఏకత్వానికి తొలి చిరునామా
రాలిన నెత్తుటి సింధూరమా..
ఎండిన ఎర్రటి చారల పొడిచిన
పొద్దు పొడుపుతో వికసించిన మందారమా…
తంగేడుపూల సొబగులతో
తీరొక్కపూల బతుకమ్మ దీవెనలతో
నాలుగు కోట్ల నాలుకలు ఎలుగెత్తి చాటిన
జై తెలంగాణమా…
అసువులు బాసిన ఎన్నో యువ కెరటాలు
ఉద్యమబాట పట్టిన యోధులు,
ఉప్పెనలా ఎగసిన ఉద్యమానికి ఊపిరిలూదిన,
నా సోదర సోదరీమణుల శక్తికి
నిలువెత్తు దర్పణమా… దశాబ్దాల కల సాకారమై,
పది వసంతాలల్లోకి అడుగిడుతున్న సందర్భంగా,
ఆత్మార్పణమర్పించిన నా సోదరుల
కలల సాకారానికి కంకణ బద్ధులమై
అమరజ్యోతి అఖండజ్యోతిలా
వెలుగులు పంచాలని ఆశిస్తూ…
ఎన్. లహరి: 98855 35506
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్నవారే
రమ్మన్నా రాను ప్రైవేటు ఆసుపత్రికి అంటున్నారు
అమ్మమ్మ గారింట్లో పుట్టామని చెప్పేతరం పోయి
సర్కారు దవాఖానాలో పుట్టామని చెప్పేరోజులివి
నొప్పి గోలి జ్వరం గోలి ఇచ్చి పంపే సర్కారు దవాఖానాలో
సిజేరియన్లు, డయాలసిస్‌లు, మోకాలు మార్పిళ్ళు చేసే
పానం మీదకు వచ్చిందంటే హైదరాబాదు పరిగెత్తేది లేదు
వెంటిలేటర్లు సైతం ఊరి దవాఖానాలో ప్రత్యక్షమయ్యే
అమ్మమ్మ తాతల స్థానంలో ముఖ్యమంత్రి పేరురాసే
నొప్పులొచ్చినయంటే 102 ఆగమాగంగా దూసుకొచ్చే
తెల్లకోటు తొడుక్కున్న ధరణిలో దేవతలా ఎదురొచ్చే
శస్త్రచికిత్సకు సకల సౌకర్యాలూ ఆసుపత్రిలో సమకూర్చే
అమ్మఒడితో గర్భిణీ స్త్రీని కంటికి రెప్పోలే కాపాడుతూ
డెలివరీకి తల్లిగారింటికి పోయినట్టు ఆసుపత్రికి పోయి
ఒడిలో బిడ్డతో చల్లంగా 102 వాహనంలో ఇంటికి చేరే
చేతిలో డబ్బుతో ఫ్రీ డెలివరీతో మొహం వెలుగుతో
అత్తారింటికి పంపుతూ చీరసారెలు పెట్టే పుట్టింటోళ్ళు
బట్టల సబ్బులు, దోమతెరలు పౌడర్లిచ్చే కేసీయార్ కిట్టు
సారె పెట్టి సాగనంపెను ఆడబిడ్డ పాలిట తండ్రి లెక్క
పురుడు పోసి క్షేమంగా చేర్చెను తల్లి గారింటిలెక్క…
డాక్టర్ కందేపి రాణీప్రసాద్: 98661 60378
దళితులంటే…
పాకీలుగా పారిశుధ్య పరిరక్షకులుగా
పాలేర్లుగా పని పిల్లలుగా
కర్మ సిద్ధాంతపు కోరల్లో చిక్కుకొని
మనువాదపు మకిలిని మోస్తూ
కట్టు బానిసలుగా కాలాన్ని వెళ్లదిస్తూ
కలలు ఛిద్రమై బతుకు భారమై
అవమానాల అగ్నిగుండంలో
హాహాకారాలు చేస్తున్న
కడగొట్టు బిడ్డల కష్టాలు తీర్చగా
దళితబంధు తోటి బతుకుబాటను చూపి
ప్రగతిపథానికై పది లక్షలందించి
అర్హులైన వారి అభిరుచులను బట్టి
వెలివాడలందున వెలియంగా పరిశ్రమలు
వెట్టిచాకిరి మాని యజమానిగా మారి
ఆర్థిక స్వావలంబనతో ముందడుగులేస్తూ
తమ అభివృద్ధిని తామే అమితానందంగా
నిర్వచించుకునే దిశగా చైతన్యమై సాగిపోతూ
ఉత్పత్తిలో భాగస్వాములై ఉరకలు వేస్తూ
సాధికారతను సాధిస్తూ సంఘటితమై
తరతరాల అంధకార బంధనాలను తెంచుకొని
విద్యాదీపులై ప్రజ్వలిస్తూ
ఆత్మగౌరవ పతాకలై
అవరోధాలను దాటుతున్నారంటే
నేటి తెలంగాణ పాలికల పథకాల ఫలితం
కాదని ఎలా చెప్పగలం..!!
తాళ్లపల్లి యాకమ్మ: 97042 26681
నిత్యం చెమట చుక్కలను నేలపై చిందిస్తూ
రాత్రి చుక్కలు పొడిచేదాకా పొలంలోనే ఉంటా!
మట్టినే పరమాత్మునిగా నమ్మి
ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ
కొండంత ఆశతో కండలు పిండిచేసి
ఆశతో ఆశయాల విత్తనాలను నేలలో చల్లి
ఆకలి దోసిళ్ళతో వానదేవుని ప్రార్థిస్తా!
వరాల వానలను ఆ దేవుడు అవనిపై చల్లుతుంటే
పుడమి నవ్వులన్నీ పక్షుల కిలకిలలై
పచ్చని వలువలతో పులకరించెను!
పిల్ల కాలువలన్నీ వసుధకు వడ్డాణమైతే
ఆ మట్టి పరిమళాల ఆనందాన్ని ఆస్వాదిస్తూ
మనసంతా నవ్వుకునే హాలికుడను !
హలం పట్టి పొలాలు దున్నిన
జనక, బలరామ, శ్రీనాథ సార్వభౌములకు
సాక్షాత్తూ స్వయానా వారసుడ నేను!
అకాల వర్షాలు, అపార నష్టాలు ఎదురైనా
సహనంతో ఎదురొడ్డి నిలిచే ధీశాలి నేను!
ధరణి కరుణించి ధాన్యపురాసులు పండినా
దళారుల చేతుల్లో మోసపోతూ కూడా
ఆకలి తీర్చడానికి అవనిపై నడయాడే అన్నదాతను!
ఏం చేయను.. మట్టిపరిమళం తప్ప
ఏమీ తెలియని మొరటోన్ని నేను!
రైతును నేను!!
రైతుబంధు పథకంతో అవనిపై
ప్రాణంతో నిలబడిన మనిషిని నేను..!
బి.సీష్మ: 93903 85974
కండ్ల మస్కల తోటి చేట్ల బియ్యం
ఏరుకునే కష్టమైన దేవక్కలు..
మబ్బు వట్టిన కండ్ల తోటి టకటక సూదిమొన ఆడక
ఆగిన యాదమ్మల బతుకు చక్రాలు..
కండ్లల్ల నీటికాసులతోటి దేశం బోయిన బిడ్డ కోసమై
దర్వాజల ఎదురుతెన్నుల లోలకాలై
వేలాడే ఎల్లవ్వ తల్లులు..
కంట్లపువ్వాపరేషన్కు పైసల్లేక తల్లడం మల్లడమయ్యే
తలపాగా మల్లయ్యలు ..
రేచీకట్ల తోటి గుడ్డి బతుకును
ఎల్లదీసుకునే కొమురయ్యలు..
కిడ్నీలవడ్డ రాళ్ళతోటి కండ్లల్ల పాకిన
ఎర్రజీర నొప్పులు..
కేర్ మన్న లేత కంటిపాపల మసకచూపులు..
ముట్లుడిగిన పెద్దవ్వల పొడి బారిన
గాజుకండ్ల దురదలు..
సెప్పుకొంటే ఇసిత్రం గానీ గిన్ని కండ్ల కష్టాలు..
ఒక్క కంటివెలుగు పథకంతో తీరిపాయే..!!
తొలివిడత మలివిడతలు గిన్నీస్లకెక్కె..
సమ్యక్ సమానత్వ భావనతో ప్రభుత్వం
ప్రజల ముంగిలికే పంపిన డాక్టర్ల రథం..
ఏ విటమిన్.. డీ విటమిన్ గోలీలు..
సుక్కల డ్రాప్స్.. ఆయింట్‌మెంట్లతో
సవరించబడిన దూరదృష్టి.. దగ్గరి దృష్టితో ..
చూపు మందగించిన బడుగుజీవుల పాలిట వరదాయిని..
కంటివెలుగుతో ఇంటింటా విరజిమ్మే
ఉజ్వల నేత్రకాంతి..
మా కంటిపాపలో నిల్చిపోవా మా బాపు
నీకేమిచ్చి రుణం తీర్చుకోనూ అంటూ
తెలంగాణ మొత్తం వేనోళ్ల కీర్తిస్తున్న
కంటివెలుగు పథకం
నివారించదగ్గ అంధత్వాన్ని తుడిచిపెట్టేస్తూ..
దేశమంతా అభినందించగా..
చీకటి బతుకుల ఎల్గును నింపుతూ..
ఆగమై కండ్లల్ల వెట్టుకున్న పానం
మల్లా తిరిగొచ్చేనంటూ మురిసి ..
కన్నీటిబాష్పాలు కావివి..
ఆనందబాష్పాలు అంటున్న పల్లె
వాకిట కంటివెలుగు..!!
విశ్వమంత వెలుగై విరాజిల్లు..!!
బి.కళాగోపాల్: 94416 31029
ఒక పిలుపుతో పసిచేతులు దోసిళ్లతో
పచ్చని మొక్కగా తమ రేపటిని నాటుకున్నారు
పండు ముదుసలి
లోకానికి చెట్టునే చిట్టచివరి కానుక చేశాడు
నడిచే దారులు సింగిడి కొమ్మలు
బంజరు నేలలు.. బతుకమ్మ కొలువులు
పొలం గట్లు, ఇంటి పట్లు
వాగూ వాకిలి అంతటా చెట్టడుగు పెట్టింది
ఊరికొక్క మొక్కల కొలువు
తీరుకొక్క కాత, పూత
వేసారిన అడవికి మాటిచ్చి పంపిన పిలకలు
కావి రంగుకు తమ కొమ్మల కుంచెలతో
నీలాకు పచ్చను అద్దాయి
కోట్లాది పచ్చటి చినుకుల్ని
రాల్చి వటవృక్షాల్ని చేసుకున్న
సంకల్పం దేశ పటం మీద
పచ్చబొట్టయి నిలబడ్డది
ఈ నేలన నిలిచిపోనున్న నిత్య వసంతం
నోరులేని జీవాలకు
బోనాన్ని వండి వార్చిన సంబురం
మట్టి, చెట్టూ, పిట్టా,
జలం, జీవం, జీవనం.. సతతం.. హరితం
మా హరితహారం
ధరిత్రి సిగలో మన చేతులు నాటిన
ఆకుపచ్చ మందారం..!
దేవనపల్లి వీణావాణి: 99513 31122
తెల్వందేముంది ప్రజలకు
భూమి పుట్టినప్పట్నుంచీ
నాయకులు వేల సంఖ్యల్లో
ఒస్తున్నరు పోతున్నరు
ఏ కొందరో అందరి గుండెగూటిలో
ఇల్లు కట్టుకుని ఉన్నరు.
కాదనగలమా..?
కాదన్నా నిజం, అబద్ధమైపోతదా
పిచ్చిగాకపోతే.. సూర్యున్ని
చేయి అడ్డంపెట్టి ఆపగలమా..?
చేస్తున్నట్టు వినిపించడానికి
చేసి చూపి కనిపించడానికి
అరటి బెండులోని సన్నని
పోగుదారమంతనే ఫరక్ ఉంటది
అయితేనేమి ఫరక్, ఫరకే కదా..?
దేశమెట్ల బాగుపడుతది?
యువత బాగుంటేనే జనతా కదా
కేసీఆర్ పెద్ద బుర్రున్న సారు
అందుకే విద్య, అందరిదీ అనీ
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి
పెండ్లి తంతు నుంచే కల్యాణలక్ష్మితో
మొదలుపెట్టి….
తల్లి కాబోతున్న రాష్ట్రంలోని
ప్రతి ఆడబిడ్డకు ఆరోగ్యలక్ష్మితో
ఆశీస్సులిచ్చి పుట్టిల్లు తానై
కేసీఆర్ కిట్టుతో పురుడు పోసినాడు
సదువుకుంటేనే సంస్కారమనీ
సదువు ప్రతి బిడ్డకూ హక్కు అనీ
అంగన్వాడీల బాలామృతం ఒంపి
బడికెళ్లిన ప్రతి బిడ్డకూ
మంచి బువ్వ పెట్టీ, గుడ్డలిచ్చి బుక్కులిచ్చి
ఇంగ్లీషు సదువు కూడా చెప్పించే
కాలేజీలకు తోలి, పిల్లల
రీయింబర్సు ఫీజులు కట్టే..!
తెలంగాణ బిడ్డా…! తెలివి సూపుమని
అంబేద్కరు, జ్యోతిబా సాక్షిగా
విదేశాల కంపి పెద్ద సదువుల చెప్పించే
కులము, మతము, పేదరికము
ఏది నీకు అడ్డు కాదు బిడ్డా..
దొడ్డ మనసున్న మన అయ్య
సదువు విలువ తెలిసిన మన కేసీయారయ్య
జాతి సంపద పిల్లలని తెలిసి సాకుతున్న
కన్నతల్లి మనసున్న మన అయ్య
నీ అమ్మ నాన్నల లగ్గం నుంచి
నీ బతుకు భవిష్యత్తుకు బాటవేసిన
పేద ప్రజల హృదయ విహారి
జాతి సంపద పిల్లలని సదువే మార్గమని
ఎరిగిన మన బాటసారి..!!
సదువుల తల్లిగా మారి పేద బిడ్డలకు
అక్షర సమర్పణం చేసిన
హయగ్రీవుడాయే మరి..!!
రమాదేవి కులకర్ణి: 89856 13123
అప్పుడెప్పుడో చెప్పారు
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కారిడార్
అరుల్ మిగు రామనాథస్వామి కారిడార్ అని..!
మొన్నెప్పుడో అన్నారు
భూమిపై పెద్ద పర్యాటక క్షేత్రం
జపాన్ వసాకా కారిడార్ అని..!
ఇంకా వెతికితే దొరికింది
ఈ వేద భూమిపై ప్రముఖ ఆధ్యాత్మిక వసారా
చొక్కటాన్ మండప కారిడార్ అని..!
పోరాటాల పురిటిగడ్డ మాత్రం
తక్కువ కాదు కదా
సకల రంగాలలో సర్వశ్రేష్ఠంగా
నిలుస్తోంది కదా
ఈ నేల మనకూ ఒక కారిడార్‌ను
రూపొందించింది
చూడటానికీ, చెప్పటానికీ, తలెత్తుకొని
నిలబడటానికీ
ఓ నవ్య ఆత్మగౌరవ కారిడార్..
హైదరాబాద్ నగరమే శిరస్సు
హుస్సేన్‌సాగరే జడపాయ
నెక్లస్ రోడ్డే కంఠాభరణం
ట్యాంక్‌బండే చీర కొంగు
ఇప్పటిదాకా ఇది ముత్యాల నగరం
ఇకనుంచి మూడు నిర్మాణాల
ముచ్చటైన మాగాణం
సుపరిపాలన, సమత, సుచరితల
అచ్చమైన ప్రాకారం…
ఇక్కడ
సామాజిక న్యాయం దిశగా
దారిచూపుతున్న చూపుడు వేలు
125 అడుగుల ఎత్తులో నిలబడింది
సమన్యాయం దిశగా
అడుగులు వేస్తున్న పాలన
రెక్కలు కట్టుకొని ప్రజల
ముంగిట్లో వాలింది
అరవై ఏండ్ల స్వప్నాన్ని
సాకారం చేయటానికి
ఆయువులను అర్పణం చేసిన
ప్రాణజ్యోతి
సరికొత్త దారి దీపమై వెలిగింది
నవ రాష్ట్రంలో వెలిసిన నవ్య కారిడార్ ఇది..!
ఇవి కేవలం కాంక్రీట్, కంచు, లోహ
నిర్మాణాలు మాత్రమే కాదు
సోషల్ జస్టిస్, సర్వీస్ టు ది పీపుల్,
సెల్ఫ్ రెస్పెక్ట్లకు నేటి స్వరాలు అద్దిన యుగ గీతికలు!
అంబేద్కర్- సచివాలయం- అమరజ్యోతి
ఈ యుద్ధభూమికి సరికొత్త పతాకలు..!
తెలంగాణ నవ వర్ష పురోగతికి
నిలువెత్తు ప్రతీకలు..!!
ఐనంపూడి శ్రీలక్ష్మి: 99899 28562
అదిగదిగో ఇప్పుడక్కడ
గంగ పొంగుతోంది
నల్లాలో నీరు ఉత్తుంగ
తరంగమై ఎగిసిపడుతోంది
ఆ ముఖాలన్నీ తడితుంపరల
సాక్షిగా విప్పారుతున్నాయి
ఒకప్పుడు ఆ ప్రదేశం నీటిచుక్కకై
నిలువునా ఎదురుచూసేది
మైళ్ళ దూరానున్న చెమ్మ కోసం
ఎడారి బీటలపై నడక సాగించేది
దొరికింది కలుషిత నీరైనా
కరువు పీడుతులకదే కానుకయ్యేది
పంటచేలు పొడి నాలుకలతో
వానచుక్కకై ఎదురుచూసేవి
మరి ఇప్పుడు..
దశాబ్దాల పోరాటంతో
ఏర్పరచుకున్న రాష్ట్రంలో
కనులారా కురుస్తుంది
కలలుగన్న జలసిరి
అధికారమందుకున్నదే తడవుగా
ముఖ్యమంత్రి చంద్రశేఖరుడు
కార్య నిర్వహణాదీక్షుడై
అపరభగీరథుడై
గోదావరి కృష్ణా జలాలను
ఎడారి భూమికి చూపాడు
చెరువులను, కుంటలను
జలసిరితో నింపాడు
ప్రకృతికి పచ్చదనపు రంగులద్దాడు
తాగునీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా
కరువు పీడితుల గాథలకు
కలుషిత జల వనరులకు
ఫ్లోరైడ్ రాకాసి కోరలకు
విముక్తి గీతం పాడాడు
అందుకే…
ఇప్పుడిక్కడ చేలు
పచ్చదనపు రాగాలు తీస్తున్నాయి
ఇంటి నల్లాలు
స్వేచ్ఛాగానాలు పాడుతున్నాయి…
వి విశ్వైక: 95501 83143
ఎన్నో త్యాగాలు చేసి
ఒక సామూహిక కలను
సాకారం చేసుకున్న
దశాబ్దాలుగా పొక్కిలైన నేల మీద
హరిత స్వప్నాన్ని నిజం చేశా..!
ఒక్క వాన చినుకు కోసం
తడారిన గొంతుతో
తల్లడిల్లిన మట్టి దాహం తీర్చి
దేశానికిప్పుడు ధాన్యాగారాన్ని రాసిచ్చా..!
గుడ్డి దీపకాంతిని చేతబూని
ఈ తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని
మిరిమిట్లు గొలిపే నక్షత్రశాలను చేశా..!
నా ఈ వెలుగులు
దేశ సరిహద్దులు దాటి ప్రసరిస్తుంటే
సహించలేని దిష్టికండ్లు కొన్ని
నేను జారిపడితే నవ్వాలని
నిత్యం ఎదురుచూస్తున్నాయి
ఏమరుపాటుతో అడుగేస్తానేమోనని
దారెంట అరటితొక్కలు విసిరేస్తున్నాయి
కాళ్ళనడుమ కట్టెల మండీలు మొలిపిస్తున్నాయి..!
పోరుబాటలో ఎన్ని ఎత్తుపల్లాలు చూడలేదు?
నిప్పుల మీద నడిచిన చరిత్ర నాది
చావునోట్లో తలపెట్టిన తెగువ నాది
నాకు బాగా తెలుసు
ఎదగడం నల్లేరు మీద నడక కాదు
అట్లని బెదరడం నా రక్తంలో లేదు..!
ఆకలి తెలిసినదాన్ని
దాహం ఎరిగినదాన్ని
నేను మాత్రమే కాదు
సమస్త భారతాన్ని
స్వర్గతుల్యం చేయాలని కలగంటున్న..!
నదులు సముద్రాలు
గిరులు అనంతసిరులు
తరగని అపారమైన మానవ వనరులు
అంది పుచ్చుకోనంత కాలం
దేశ ప్రగతి
ఒక అడుగు ముందుకు
రెండడుగులు వెనక్కు!
దిష్టికండ్లకు కూల్చడమే తెలుసు
నాకు నిర్మించడం ఎరుక
నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం
బూజు దులపందే
అంతా కలిసి బతికి ఎదగందే
నవ్యభారతం
హిమాలయంలా తలెత్తుక నిలబడదు!
నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్న
ఎప్పటిలా పిడికెడు విశ్వాసాన్నివ్వండి
కొండల్ని పిండి చేస్తా!
విశ్వవేదిక మీదా జాతి వెలగునై నిలబడతా..!!
కోట్ల వనజాత: 94402 33261
భద్రాద్రి రామయ్య దీవెనల ఫలితమేమో,
కొండగట్టు అంజన్న అండదండలేమో,
కాళేశ్వరుని కృపారసామృత వీక్షణేమో,
కోటిచేతులొక్కటై బూనిన సంకల్ప బలముతోడ,
హరితకోక గట్టిన నా తెలంగాణను జూడ,
మదిమది ముదముతో ఆనందభరితమాయే…
గడప గడపకు పచ్చ తోరణమై,
రైతన్నకు బంధు సాయమై,
కళ్యాణ ఘడియల్లో లక్ష్మీరూపమై,
అలైబలైలంటూ
గంగాజమున సంస్కృతుల సంగమమై,
ఆడపడుచులందరికీ బతుకమ్మ కోకై,
లక్షలెకరాలు తడిపేటి కాళేశ్వరమై
చంద్రన్న బూనిన సంకల్ప బలముతోడ
ఫలించిన భగీరథ ప్రయత్నమై,
కాకతీ మాత కరణులూరిన చెరువులై,
సాంకేతిక సొబుగులద్దుకున్న సుందరనగరాలై,
పల్లె-పల్లె పచ్చని వనాలై,
వలస వెతలు తీరి కళకళలాడి
గులాబీ పంటై పరిమళించునట్టి..
హరితకోక గట్టిన నా తెలంగాణను జూడ
కంటివెలుగై వేల కన్నుల్లో కాంతిరేఖలై మెరియ
మదిమది ముదముతో ఆనందభరితమాయే…
శ్రీ సుధ కొలచన: 94404 70674
ఇష్టమే గానీ
ఎందుకీ జన్మన్నట్టు
ఆడపిల్ల కలుగుడే
బాధల చెమ్మయినట్టు
కలవరింతలు ఎవరికీ పట్టి?
ఆడుకొను పోతానంటే
వాకిట్ల తట్టు తాకేనా!
చదువపోతుంటే
కిరాతకం కన్ను పడినా !
ర్యాగింగ్ నుంచి ర్యాగింగ్
అవమానం మీద అవమానం
చెరవట్టిన చేదు యాదులన్నీ
వెనకకిడ్చి వెక్కిరీయబట్టే
గీత దాటనీయని ఆ అంక్షల నుంచి
విద్యనీయని పెత్తనాల నించి
అడుగు తీసి అడుగేస్తే
పుట్టెడనుమానాల నుంచీ
పల్లేరుల నడిచిన గుర్తులవి
ఇంకెన్నాళ్లీ కష్టాలని
నూరు తప్పులు లెక్కించి ప్రభుత్వ వరం
పాశుపతాన్నిచ్చింది ఆపరేషన్ జురిడిక్షన్
ఎల్లలంతా కండ్లు చేసుకొని
తోలు తీస్తున్నది ఖబడ్దార్!
‘ఎల్లప్పుడు మీతో
ఎల్లప్పుడూ మీ కోసం’
గాలిస్తున్నది చూసుకో…
ఏఎం తాయారు: 9550 123718