ఎక్కడి నుంచో చల్లని ఊసులను
మోసుకొస్తున్న గాలి
ఊర్లను నగరాలను చుట్టేస్తూ
ఒడ్డున కూర్చున్న వాళ్ళని పలకరిస్తూ
పయనమవుతున్నది
పడవ పడవకో కథ
అలలకూ సుడులకూ అనాది బంధం
తెడ్లను కదిలించే చేతలకు జవసత్వాలను ఇస్తానని అలలతో స్వాగతిస్తుంటుంది నది
పిండార పోసిన వెన్నెలైనా
ఎండకు మెరిసిపోయే దిన రూపమైనా
నది నవ్వుల పసి పాపే అవుతుంది
కలతల భాషతో కలల భాష
భాష్పమో భావమో గుండె పండు కాదు
కన్నీళ్ళ సుడులేనా కలకాలం
నా నీళ్ళ సుడులు చూడమనేది నది
నలుపును తెలుపును నీలమయం చేసి
ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది
తన నొరుసుకుని నిలుచున్న చెట్ల వేళ్లను ముద్దాడుతూ అమిత ప్రేమ కురిపిస్తుంది
పుట్టుక అర్థం అదే కదా!
కొండకు అద్దానికి అరతెర తీసిన అర్థమై
ఈ కాలుష్యాలకు హెచ్చరిస్తూ
కన్నతల్లి అవుతుంది నది!
దాహం తీర్చిన అలల చేతులూ నదివే
తనను దాటుతూ నడిచే నడకకు
తన నీటి చర్మం ఎండిందంటే బాటా తానే!
ఆవిరిగొనే గ్రీష్మం ఆర్తి దీర్చే వర్షం
భరింపుల వెనుక తను ఓ ఉదాహరణ
అవుతానంటుంది నది!
జలచరాలూ భూ చరాలూ
పొగసూరని మనసుతో విచ్చుకొనే
పచ్చి బాలింతల తానేనంటున్నది నది!
కలుషితం కానంతవరకు
తన నీరు చనుబాల తీరేనంటున్నది!
నదితో కాసేపు ఉంటే కాలం
చిరుజల్లులు కురిపిస్తుంది
పరమాణువు పరిణామం
పరమార్థపు పరిమాణం
ప్రశ్నలతో పసిగట్టమంటున్నది నది!
పొలం రెండు చేతుల కోసం చూసినట్టు కలకాలం చూస్తానంటున్నది విచిత్రంగా నది!
డాక్టర్ కొండపల్లి నీహారిణి: 98663 60082