సూర్యుని కోపాగ్నితో నేల
ఎరుపు నలుపులుగా నోళ్ళు విప్పుకుని
ఒంటరైపోతుంది !
ఎండిపోయి నాలుకలు నాలుకలుగా పరుచుకుని
ఆకాశం వైపు ఆర్తిగా చూస్తుంది నేల !
పచ్చదనాన్ని కాజేసిన ఆకులూ వేర్లతో మొక్కలు
ఆవిరినంతా లాగేసుకున్న మేఘాలు
ఆకాశవీధిలో విహరిస్తూ నేలను ఆటపట్టిస్తుంటాయి !
మౌన రోదనతో నెర్రెలీనుతున్న నేలను
ఆప్యాయంగా అక్కున చేర్చుకుని
నాగలితో కలిపి గింజలను అంకితమిస్తాడు రైతు !
రైతన్న నేలకు దత్తపుత్రుడు
తన స్వేదాన్ని మేఘాలకు అర్జీ పెట్టుకుంటాడు !
ఒక మెరుపు ఒక ఉరుముతో
మబ్బులు సమాధానాలు రాస్తాయి!
సలసలా కాగుతున్న మట్టి కోసం
తొలకరితో లేఖ పంపుతుంది!
నేలను తాకిన స్వాతి చినుకులతో
శ్వాస మొదలవుతుంది!
మట్టి శ్వాస వదులుతున్నప్పుడు
వాసన తనువంతా నింపేస్తుంటే
ప్రాణం అనిర్వచనీయమైన అనుభూతి !
ఊపిరి నింపుకున్న మట్టిలోంచి
పచ్చదనం తొంగి చూస్తూ మేఘాలను సత్కరిస్తాయి!
ఇప్పుడు ప్రపంచమంతా
పచ్చని చొక్కా తొడుక్కుని దర్జాగా నిలబడి
పల్లె తనాన్ని పంచుతుంది!
జయంతి వాసరచెట్ల: 99855 25355