మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కుట్ర బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. అర్థ బలంతో బీజేపీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నది. అక్రమ నిధులతో ప్రజా ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీ అరాచకాలకు దేశ ప్రజలే ముగింపు పలకాలి. ఇందుకు మునుగోడు తీర్పే మనకు స్ఫూర్తి.
ఈ దేశంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు మాత్రమే పెరిగాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం బలహీనంగా ఉండ టం, పక్షపాత రాజకీయాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల్లో దేశానికి పనికొచ్చే చెప్పుకోదగ్గ సంస్కరణలేవీ లేవు. మరోవైపు రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై పరిమితి ఎత్తేయడం, విరాళాలపై ఆడిటింగ్ చేయకపోవడం, ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టడం లాంటి చర్యలు అధికార పార్టీ ఖజానాను నింపుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక ప్రయోజనం పొందిన రాజకీయ పార్టీ బీజేపీ. దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ కూడా అదే. ఆ పార్టీ ఇతర రాజకీయ పార్టీల కంటే 70 శాతం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నది. ధన బలం ఉండటం, దేశమంతా విస్తరించాలనే బలమైన కోరిక ఉండటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో చూస్తే, మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటన పెద్ద ఆశ్చర్యం కలిగించదు.
తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొని ఎలాగైనా గెలవాలని చూసింది. తద్వారా సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంపై టీఆర్ఎస్ పట్టు కోల్పోతున్నదనే భ్రమను కల్పించాలని ప్రయత్నించింది. బీజేపీ వేధింపు రాజకీయాలకు ఇది అసలైన ఉదాహరణ. ఈ విలక్షణమైన కుయుక్తిలో భాగంగా రాజగోపాల్‌రెడ్డితో కాం గ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి తమ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయించింది. ఈ పన్నాగం కోసం బీజేపీ రూ.18 వేల కోట్ల విలువైన జార్ఖండ్‌లోని చంద్రగుప్త బొగ్గు గని తవ్వకం కాంట్రాక్టును ఉపయోగించుకున్నది.
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నిర్వహించే చంద్రగుప్త ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని అంతర్జాతీయ టెండర్లలో 2020 డిసెంబర్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు అప్పగించారు. కానీ మొదటి టెండరు రద్దుచేసి ఫిబ్రవరి 2021లో రెండోసారి జాతీయస్థాయి టెండర్లను ప్రభుత్వం ఎందుకు పిలిచిందో దేశమంతటికీ తెలుసు. రెండోసారి కూడా అదానీ వేలంలో పాల్గొన్నారు. కానీ రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా కేవలం రూ.18,264 కోట్లకే టెండర్ దక్కించుకున్నది. ప్రమాణాలను అతిక్రమించి ఈ వేలానికి సుశీ ఇన్ఫ్రా అర్హత పొందేలా నిబంధనలను మార్చారు. ఈ కంపెనీకి నిర్మాణాలు, రోడ్డు పనులు, వాటర్ వర్క్స్ మొదలైనవాటిలో అనుభవం ఉన్నది. గనుల తవ్వకంలో ఈ కంపెనీకి ఉన్న అనుభవం 0.08 శాతం మాత్రమే.
రాజగోపాల్‌రెడ్డి సొంత లాభానికి ఉపయోగపడుతున్న ఈ కాంట్రాక్టు అచ్చంగా నాకిది-నీకది తరహాలో ఉన్నట్లు కనిపిస్తున్నది. 2జీ స్ప్రెక్టం కేసు వల్ల ఎన్నికల్లో ఎక్కువ లబ్ధి పొందిన పార్టీ బీజేపీయే. ఆ కుంభకోణం వల్ల దేశానికి భారీగా నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఊహాత్మకమైన ఆరోపణలు చేశాయి. కానీ ఇప్పుడు ఈ క్విడ్‌ప్రో కోలో వాస్తవంగానే దేశానికి రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లింది. తనకు లభించిన కాంట్రాక్టులకు, తాను బీజేపీ అభ్యర్థి కావడానికి గల సంబంధాన్ని రాజగోపాల్‌రెడ్డే బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బీజేపీ వేధింపు రాజకీయాలను, అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టే చర్యలను తేలిగ్గా తీసుకోకూడదు. బీజేపీ చేస్తున్న కబళింపు రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నది. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఎన్నికల తప్పులను నిర్దందంగా తిరస్కరించింది. తెలంగాణ దేశానికి దారి చూపించింది!
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
జనార్దన్‌రెడ్డి జనుంపల్లి