చదరంగమైనా, యుద్ధరంగమైనా ప్రత్యర్థిని మించిన ముందుచూపుతో పావులు కదపాలి. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి ఎదురుదాడికి దిగాలి. నేటి రాజకీయ చదరంగంలోనూ అంతే. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేయడం ద్వారా రాజనీతి దురంధరుడైన కేసీఆర్ తన వ్యూహ చతురతను మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణకు మాత్రమే పరిమితమై పోతే ఇబ్బందికరమని, జాతీయస్థాయిలో దూసుకుపోయినప్పుడే, రాష్ట్ర ప్రయోజనాలతోపాటు దేశ సంక్షేమం సాధించవచ్చునని కేసీఆర్ ముందుగానే గ్రహించారు. తదనుగుణంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ హస్తిన వైపు దృష్టిసారించారు. మరోవైపు కేసీఆర్‌ను రాష్ర్టానికే కట్టడి చేయడానికి, సర్కారును కుల్చేయాలనే కుతంత్రానికి మోదీ పరివారం ఒడిగట్టింది. కానీ ఇటువంటి మాయోపాయాలు కేసీఆ ర్ దగ్గర పారవని గ్రహించలేకపోయింది.
తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా- ‘కమల్ ఫైల్స్’ కుట్రను తవ్వేకొద్దీ అనేక ‘అస్థి పంజరాలు’ బయటపడుతూనే ఉన్నాయి! కుట్ర ఎంత లోతుగా సాగిందో, పైస్థాయిలోని ఎందరు పెద్దలు భాగస్వాములో తెలిసే కొద్దీ ఆశ్చ ర్యం కలుగుతున్నది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఈ దేశం లో ప్రజాస్వామ్యానికి ముప్పు రాదనే భరోసా కలుగుతున్నదని ప్రశంసించారు. కేసీఆర్ పూరించిన శంఖారావం హస్తినను వణికించింది. ఏదో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయడ మే కేసీఆర్ లక్ష్యం కాదు. తెలంగాణ మాడల్‌ను చూపించడమే కాకుండా, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం, కొత్త అభివృద్ధి ఎజెండాతో కేసీఆర్ ముందుకురావడం మోదీ పరివారానికి మింగుడు పడలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, ఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయవచ్చునని భావించింది. ఏరి ఏరి కొట్టినట్టు, విభజించి పాలించినట్టు ప్రాంతీయ చిన్న పార్టీలను లక్ష్యంగా చేసుకొని బెదిరించి, భయపెట్టి బీజేపీ తన ఆట ఆడుతున్నది.
తెలంగాణను తల్లికోడిలా కాపాడుతున్న కేసీఆర్ కేంద్రంతో రాజ్యాంగబద్ధ సంబంధాలను కొనసాగిస్తూనే, మోదీ పోకడ ప్రమాదకరంగా ఉందని చాలా ముందుగానే తన సహజాతంతో పసిగట్టారు. గత ఎన్నికలకు ముందే అప్రమత్తమైన కేసీఆర్ ఇందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. బీజేపీ పాలకులు ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతున్న తీరు, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న విధానం కేసీఆర్ అంచనాలు నిజమేనని ధ్రువపరుస్తున్నాయి. అసహాయ శూరుడైన కేసీఆర్ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు అప్రతిహత పోరాటాన్ని కొనసాగిస్తారు. బీఆర్ఎస్ను ఆరంభంలోనే దెబ్బతీయాలనే ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు కేసీఆర్ వెరవరు. హైదరాబాద్‌లో మొదలైన యుద్ధానికి ముగింపు హస్తినలోనే!