దేశవ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ ఉపఎన్నికలు ముగిశాయి. ఇంతలోనే హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల ప్రచార హోరులో దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. ముఖ్యంగా గుజరాత్లో జరిగిన మోర్బి తీగల వంతెన ప్రమాదం ఒకటి. సంఘటన జరిగిన రోజు, ఆ మరునాడు మాత్రమే చర్చ సాగింది. ఆ తర్వాత టీవీలు, పత్రికలు ఈ విషయాన్నే మర్చిపోయాయి. కాదు, దాని ప్రాముఖ్యం మరుగునపడింది.
మోర్బి ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లిన ప్రధాని మోదీ తిరిగి ఇటీవల మళ్లీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడారు. గుజరాత్ మాడల్ గురించి జబ్బలు చరుచుకున్నారు. ‘గుజరాత్‌ను నేను తయారుచేశాను’ (గుజరాత్ మాయ్ బన్వాయూ ఛే) అని ప్రకటించుకున్నారు. గత 20 ఏండ్లుగా గుజరాత్లో జరిగిన అభివృద్ధిని గిట్టనివారు (ప్రతిపక్షాలు) అపఖ్యాతి పాలు చేస్తున్నారు. ప్రతి గుజరాతీకి ఈ గుజరాత్‌ను నేనే అభివృద్ధి చేశానన్న భావన రావాలని, గుజరాతీలను సెంటుమెంట్తో ఆకర్షించేందుకు కొత్త రాగాన్ని అందుకున్నారు. కానీ మోర్బి తీగల వంతెన కూలిన ఘటనతో గుజరాత్ మాడల్ అన్న నినాదం కేవలం ప్రచారం కోసమేనని రుజువైంది. అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పస లేనిదని దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మోర్బి సంఘటనను పరిశీలిస్తే చాలు.. గుజరాత్ ప్రభుత్వ పనితీరు ఇంత బాధ్యతారహితంగా ఉంటుందా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. ఈ దుర్ఘటన తర్వాత దవాఖానలో మౌలిక వసతులు లేకపోవడం, బాధితులను చేర్పించిన తర్వాత ఆదరాబాదరాగా ఏర్పాట్లుచేయడం అక్కడి వ్యవస్థను సిగ్గుపడేలా చేసింది. అధికారులూ దుర్ఘటనలో గాయపడిన బాధితులకు అవసరమైన వైద్య సహాయం, ఇతర సౌకర్యాలు అందజేయకుండా, తప్పు తమది కాదంటే.. తమది కాదంటూ.. చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. ఇదేనా గుజరాత్ మాడల్?
మోర్బి దుర్ఘటనలో సరదా కోసం వెళ్లిన 135 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పిల్లలు, మహిళలే ఎక్కువున్నారు. అయితే దుర్ఘటనకు దేవుడే కారణమంటూ అధికారులు చేతులు దులుపుకోవడం విడ్డూరం. ప్రకృతి విపత్తు అని చెప్పినా పోనీ లే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి అలా ప్రకటించడం సిగ్గుపడాల్సిన విషయం. అసలు తీగల వంతెనకు మరమ్మతులు చేసిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెటే జారీ కాలేదు. దుర్ఘటన జరిగిన తర్వాత కిందిస్థాయి ఉద్యోగులపై కేసు బుక్ చేసి, మరమ్మతులు చేసిన సబ్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇక టెండర్ లేకుండానే ‘ఓరేవా’ అనే కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం అటుంచితే, కనీసం ఎఫ్ఐఆర్లో ఆ కంపెనీ పేరుగానీ, యజమాని పేరుగానీ లేకపోవడం విడ్డూరం.
134 ఏండ్ల పురాతన వంతెన అది. దానికి మరమ్మతులు చేయడానికి కాంట్రాక్టు పొందిన వ్యక్తి అర్హతలేమిటి. అసలాయనకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకున్న కారణాలేమిటో ఇప్పటికీ తెలియరాలేదు. ఆయనకు ఓ గడియారం కంపెనీ ఉందట. అదలా ఉంచితే.. దుర్ఘటన జరగటానికి కొద్ది రోజులముందే కాంట్రాక్టు పొందిన వ్యక్తి ఎంతో ఆర్భాటంగా తీగల వంతెనను పునః ప్రారంభించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభానికి ముందు దాన్ని పరీక్షించాల్సిన అధికారులు ఆ పనిచేయలేదు.
ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నతాధికారులు కుక్కిన పేనుల్లా ఉన్నారు. అంతేకాదు, మరో అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి సంఘటన జరిగితే పరిణామాలు వేరేలా ఉండేవి. ముఖ్యమంత్రి తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చేది. కానీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ జాడ ఎక్కడా కనిపించలేదు. రెండు రోజుల తర్వాత తీరిగ్గా వచ్చిన ప్రధాని మోదీ పర్యటనలో మాత్రం కనిపించారు. ప్రధాని వచ్చారు, వెళ్లారు. దవాఖానలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. కానీ, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులతో మాట్లాడలేదు. అంతా సవ్యంగానే ఉందనుకున్నారేమో. గుజరాత్ మాడల్‌ను ఆదర్శంగా తీసుకున్నారు కదా. మోర్బి దుర్ఘటనలో కుటుంబసభ్యులను కోల్పోయిన వారి ఆక్రందనలు వినిపించుకునే తీరిక, సమయమూ మోదీకెక్కడిది? అసలే ఎన్నికల హడావుడి. టైమెక్కడిది? మన ఏలిక వారికి. కానీ ఓ బాధితురాలు టీవీవాళ్లతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారని మీరు అడుగుతున్నారు.. నా ఏడేండ్ల కొడుకు, తొమ్మిదేండ్ల కూతురు చనిపోయారు. నా భర్త చనిపోయాడు. నేను ఒంటరిదాన్నయ్యాను. ఈ ప్రభుత్వం నాకు ఏ రకంగా సహాయం చేయగలదు. ప్రధాని వచ్చాడు, పోయాడు. కానీ ఎవరినీ మాట్లాడనీయలేదు. దవాఖానలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడితే, వారేం చెప్తారు?’ అని ప్రశ్నించింది.
ఈ ప్రమాదం మిగిల్చిన ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు? అసలు వీటిని ప్రధాని దృష్టికి ఎవరు తీసుకుపోతారు. అసలు ఆ వంతెనపైకి అంతమందిని అనుమతించిన అధికారి ఎవరు? అసలు ఆ రోజు డ్యూటీలో ఉన్న ఉన్నతాధికారి ఎవరు? అసలు తీగల వంతెనపైకి వెళ్లడానికి పర్యాటకులకు టిక్కెట్లు అమ్ముతున్న సంగతి అధికారులకు తెలియదా? అది నిజమేనా? అసలు అలా జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే బీజేపీ ప్రభుత్వం ‘జాతీయ వాది’ కాదని ముద్రవేసినా వేస్తుంది. సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత బీజేపీ సోషల్ మీడియా సైనికులు, నేతలు ఇది అర్బన్ నక్సలైట్ల పనే అని ట్వీట్ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో తమకు కంట్లో నలుసులాగ తయారైన ఆప్ నాయకులను దోషులుగా నిల్చోబెట్టాలని ఓ ప్రయత్నమూ చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులు బోరుమని ఏడుస్తుంటే ‘శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు’ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటే అందుకూ నిస్సిగ్గుగా ‘అందులో తప్పేముంది? ’ అంటూ ఎదురు ప్రశ్నించారంటే వారెంతగా దిగజారిపోయారో అర్థమవుతున్నది.
గత 24 ఏండ్లుగా గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని ఢంకా బజాయించి చెప్తామంటున్నారు. అందుకే దేశవ్యాప్తంగా గుజరాత్ మాడల్ పాలన కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల ద్వయం ‘గుజరాత్ మాడల్’ అంటూ గొంతు చించుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ‘నవ భారత్’ నిర్మాణమంటారు. మరి ‘గుజరాత్ మాడల్’ దేశానికే ఆదర్శమైతే మోర్బి తీగెల వంతెన ప్రమాదం మిగిల్చిన ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? మోదీ షా జీ.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
గుజరాత్ మాడల్ అన్న నినాదం కేవలం ప్రచారం కోసమేనని రుజువైంది. అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పస లేనిదని దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మోర్బి సంఘటనను పరిశీలిస్తే చాలు.. గుజరాత్ ప్రభుత్వ పనితీరు ఇంత బాధ్యతారహితంగా ఉంటుందా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది.
ఎం.నాగశేష కుమార్