ఇటీవలి కాలంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అనేక అంశాలపై పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి తెలుగుజాతి వారసత్వం, భాషా సమూహం, చైతన్యం పేరిట తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలు విస్మరణకు, వక్రీకరణకు గురైనాయి. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమకాలంలో ప్రాంతీయ చైతన్యం, ప్రత్యేక సంస్కృతి, ఆత్మగౌరవం కేంద్ర బిందువులుగా పునర్నిర్మాణం జరుగాలనే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే దక్కన్/ తెలంగాణ సంస్కృతిని విశ్లేషణాత్మకంగా పరిశోధించి తెలంగాణ ప్రత్యేకతను వివరించాలి.
అయితే ఈ మధ్య కాలంలో సాంస్కృతిక జాతీయవాద శక్తులు హిందూ దేశాన్ని సాధించాలని తమ హిందుత్వ భావజాలాన్ని తెలంగాణ సమాజంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. సంకుచిత దృక్పథంతో మత సమూహాల మధ్య విభేదాలను, వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది. తరతరాలుగా తెలంగాణ సమాజంలో నెలకొన్న పరమత సహనం, ప్రజల మధ్య ఐక్యత, అన్యోన్యత భావాలకు భిన్నంగా మతతత్వాన్ని చొప్పించడానికి సంఘ్‌పరివార్ శక్తులు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలను స్వీయకోణంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.
దక్కన్ పీఠభూమిలో అంతర్భాగమైన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చారిత్రక, భౌగోళిక, పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులున్నాయి. ఈ ప్రాంతం ప్రధానంగా ఆదివాసీలు, దళిత బహుజనులు, ఉత్పత్తి కులాల నిలయం. తెలంగాణ సామాజిక చిత్రపటంలో గిరిజనులు, దళితులు, వ్యవసాయాధారిత వృత్తికులాలైన కాపు, ముత్రాసి, తెలగ, యాదవ, గౌడ, కమ్మరి, కుమ్మరి, సాలె, కంసాలి, పద్మశాలి మొదలైన ఉత్పత్తి సమూహాలు ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి.
భౌగోళిక, వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మల్చుకొని బావులు, కుంటలు, చెరువుల కింద సాగు చేసి ఆహార ధాన్యాలను, పప్పు దినుసులను పండించి ప్రజల అవసరాల్ని తీర్చిన ఉత్పత్తి కులాలు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర వహించాయి. సామూహిక ప్రయోజనాలు, మానవ విలువల పరిరక్షణ, సహజ జీవనశైలి, అన్యోన్యత, సోదర భావాలకు నిలువెత్తు సాక్ష్యం తెలంగాణ ప్రాంతం. జైనం, బౌద్ధం, ఇస్లాం, సూఫీయిజం ప్రభావం వల్ల తెలంగాణలో వైదిక ధర్మం, బ్రాహ్మణ భావజాలం సన్నగిల్లింది. ఈ నేపథ్యంలోనే అన్యాయాలకు, అణచివేతకు వ్యతిరేకంగా ధిక్కారస్వరాన్ని వినిపించి, పోరాడే లక్షణం ఈ ప్రాంత విశిష్ట అస్తిత్వంగా రూపుదాల్చింది. ముఖ్యంగా అణగారిన, నిమ్నకులాల, జాతుల, సమూహాల సామూహిక సాంస్కృతిక, ప్రతిఘటనా చైతన్యానికి తెలంగాణను ప్రతిరూపంగా చెప్పవచ్చు.
ప్రాచీన కాలంలోనే బ్రాహ్మణ ధర్మానికి ప్రత్యామ్నాయంగా జైనాన్ని, బౌద్ధాన్ని ఆదరించడం జరిగింది. ప్రసిద్ధ జైన, బౌద్ధ మత కేంద్రాలైన కొలనుపాక, కోటి లింగాల, కొండాపూర్, నేలకొండపల్లి, ఫణిగిరి తెలంగాణ మత, సాంస్కృతిక వికాసంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. అందువల్లనే తెలంగాణలో ప్రాచీన యుగం నుంచి బ్రాహ్మణీయ హైందవ మతం ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు భిన్నంగా మిశ్రమ సంస్కృతి కొనసాగుతూ వచ్చింది. ఇది ఇక్కడి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. సనాతన హిందూ ధర్మానికి, ప్రస్తుత హిందుత్వ భావజాలానికి, మత సంస్కృతికి విరుద్ధంగా ఇస్లాం, సూఫీ భక్తి ఉద్యమకారులు తెలంగాణ బహుజన సమాజంలో సౌభ్రాతృత్వం, పరమత సహనం, ప్రజా సమూహాల మధ్య అన్యోన్యతా భావాలను ప్రచారం చేశారు. తత్ఫలితంగానే హిందూ ఇస్లాం మతాల మధ్య సఖ్యత, సహజీవనం సాధ్యమైంది. ప్రధానంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇస్లాం, సూఫీ, భక్తి ఉద్యమం బోధనలు అట్టడుగు వర్గాలను ఆకర్షించాయి. ఈ విధంగా ఇక్కడ బహుళ, సహజీవన, మతాతీత సంస్కృతి విశాల ప్రాతిపదికపై వ్యాప్తి చెందింది. తెలంగాణలో దళిత, బహుజన సమూహాలు జరుపుకొనే బోనాలు, బతుకమ్మ, పీర్ల పండగలు, జాతరలు, ఉర్సు ఉత్సవాలు మొదలైనవి ప్రాంతీయ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని చాటి చెప్పాయనేది చారిత్రక సత్యం.
అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని, అణచివేతను, అక్రమాలను సహించకపోవడం అనే తత్వం తెలంగాణ ప్రాంతీయ సంస్కృతిలో తరతరాలుగా అంతర్భాగమైంది. నిరంకుశ భూస్వామ్య, రాచరిక వ్యవస్థలను ధిక్కరించిన సమ్మక్క-సారలమ్మలు, సర్వాయి పాపన్న, రాంజీ గోండ్, కొమురం భీం, బందగీ, దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మల వీరోచిత వారసత్వం నేటికీ తెలంగాణ సమాజంలో సజీవంగా ఉంది. రైతాంగ సాయుధ పోరాటం ప్రభావం తెలంగాణ మీద అనన్య సామాన్యమైనది. దాదాపు ఐదు శతాబ్దాలపాటు ముస్లిం పాలకులైన కుతుబ్ షాహీ, అసఫ్ జాహీల పాలన తెలంగాణలో కొనసాగింది. ఫలితంగా హిందూ-ఇస్లాం మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. మత వైషమ్యాలు, ఘర్షణలు లేని సామాజిక పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలలో ఇది ప్రతిఫలించింది.
సంప్రదాయ హిందుత్వవాదులు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని వక్రీకరించి హిందూ-ముస్లింలు రెండు పరస్పర విరుద్ధ సమూహాలు, వాటి మధ్య నిరంతర సంఘర్షణ అనివార్యం అని ప్రచారం చేస్తున్నారు. కానీ, దీంట్లో ఎంతమాత్రం సత్యం లేదు. సంకుచిత రాజకీయ లబ్ధి కోసం కులాలు, మతాలు, ప్రజా సమూహాల మధ్య వైషమ్యాలను పెంచి పోషించడం హిందుత్వ శక్తులకు సర్వసాధారణం అయిపోయింది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణలో చారిత్రకంగా బహుళ, సహజీవన, మిశ్రమ సంస్కృతి వెలసిల్లిన క్రమం, తీరుతెన్నుల్ని విశ్లేషించి మతసామరస్యాన్ని, సహజీవనాన్ని కాపాడుకోవాలి. తద్వారా నవ తెలంగాణ పునర్నిర్మాణంలో భిన్న భాష, మత సమూహాల మధ్య సఖ్యతను పెంపొందించుకోవాలి.
ఈ మధ్య తెలంగాణలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను, ఇటీవలి ఉప ఎన్నికను దృష్టిలో
పెట్టుకొని ప్రగతిశీల, వామపక్ష, సెక్యులర్, ప్రజాతంత్ర శక్తులను ఐక్యపరచాలి. మతతత్వ భావజాలానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం సమైక్యంగా పోరాడాల్సిన అవశ్యకత ఉన్నది.
(వ్యాసకర్త: విశ్రాంత ఆచార్యుడు, ఉస్మానియా యూనివర్సిటీ)
ప్రొఫెసర్: అడపా సత్యనారాయణ