పెను వాతావరణ విపత్తులకు, పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులకు.. మానవాళి స్వార్థం, శీఘ్రగతిన అభివృద్ధి పేరుతో సహజ వనరులను కొల్లగొట్టడమే కారణం. వడగాలులు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, దుర్భర శీతల పవనాలు, కరువు కాటకాల వంటి పర్యావరణ సంక్షోభాలతో భూగోళం భవిష్యత్తుకు, మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉన్నది.
ప్రతికూల వాతావరణ మార్పులను నివారించేందుకు ప్రపంచంలోని పేద, ధనిక దేశాలు తక్షణమే ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఏ యేటికాయేడు నొక్కిచెప్తున్నది. అయినప్పటికీ ఉదాసీనత కొనసాగించడం భావ్యమా! కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా ధనిక, పేద దేశాల మధ్య సరికొత్త ఒప్పం దం అవసరం ఎంతైనా ఉన్నది. పర్యావరణ పరిరక్షణ కోసం ‘కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్’ (కాప్) సదస్సును ఐరాస 1995 నుంచి నిర్వహిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏడేండ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్ల భూగోళం భవిష్యత్తు బీటలు వారుతున్న వేళ.. ఈ నెల 6-18 తేదీల మధ్య ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్ పట్టణ వేదికగా కాప్-27 సదస్సు జరుగుతున్నది. దీంట్లో జరిగే చర్చలు, తీర్మానాలు అత్యధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సదస్సు వేదికగా గత ఒప్పందాల వైఫల్యాలను సమీక్షించుకొని, తక్షణ కర్తవ్యాలను నిర్దేశించుకోవాలని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. భూ తాపం నియంత్రణలో చిత్తశుద్ధితో కూడిన రాజకీయ సంకల్పాన్ని ఈ వేదిక నుంచి ప్రపంచ దేశాలు ప్రకటించాలని, దీంట్లో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలదే ప్రధాన ప్రాత అని పేర్కొంటున్నారు.
2050 నాటికి భూ తాపం పెరుగుదలను సగటున 2 డిగ్రీల సెల్షియస్‌కు మించకుండా అరికడతామని 196 దేశాలు ప్యారిస్‌లో జరిగిన సదస్సులో సంతకాలు చేశాయి. 2030 నాటికి 50 శాతానికి, 2050 నాటికి సమూలంగా కర్బన ఉద్గారాలను నియంత్రిస్తామని, ఈ మేరకు పర్యావరణహిత కార్యక్రమాలను అమలుచేస్తామని పేర్కొన్నాయి. పర్యావరణ మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోతున్న పేద దేశాలకు సహకారాన్ని అందిస్తామని సంపన్న దేశాలు హామీలిచ్చాయి. కానీ ఈ మాటలు, చర్చలు వేదికలకే పరిమితమైపోయాయి. ఇప్పటికైనా ఈ ధోరణి మారాలి. ప్రపంచ దేశాలు పెను ప్రమాదంలో ఉన్నవేళ జరుగుతున్న కాప్-27 సదస్సు మానవాళి మనుగడకు భరోసా ఇవ్వాలి. పర్యావరణాన్ని కాపాడే చర్యలు ప్రణాళికబద్ధంగా అమలు జరగా లి. లేదంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరికివేసుకున్నట్లవుతుంది. ఆ తర్వాత అగ్ర, సంపన్న దేశాలు శవాల దిబ్బగా మారిన భూగోళాన్ని ఏలుతా యా? ఆధునిక ప్రపంచం ప్రవచిస్తున్న శీఘ్రగతి అభివృద్ధి, పారిశ్రామికీకరణ ఎవరి కోసం? ఎందుకోసం? మానవాళితోపాటు సమస్త జీవకోటి మనుగడ కోసం కాదా?
అగ్ర, సంపన్నదేశాలు ఈ సదస్సును చివరి అవకాశంగా భావించాలి. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత, కర్బన ఉద్గారాల కట్టడిలో వేదికలపై చెప్తు న్న నీతి వాక్యాలతోనే సమయం గడపొద్దు. ఆ ఆదర్శాలను ఆచరణలోకి మళ్లించాలి. భూ తాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలు ధనిక దేశాల నుంచే అత్యధికంగా విడుదలవుతున్నాయని ఐరా స పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. 2020లో ప్రపంచ సగటు కర్బన ఉద్గారాలు 6.3 టన్నులు కాగా భారత్ సగటు 2.4 టన్నులు మాత్రమేనని వెల్లడించింది. వివిధ దేశాల తలసరి కర్బన ఉద్గారాలు ఇలా ఉన్నాయి.. అమెరికా 14 టన్నులు, రష్యా 13 టన్నులు, చైనా 9.7 టన్నులు, బ్రెజిల్ 7.5 టన్నులు, ఇండోనేషియా 7.5 టన్నులు, యురోపియన్ యూనియన్ 7.2 టన్నులు. కర్భన ఉద్గారాల కట్టడిలో భారత్ బేషు గ్గా వ్యవహరిస్తున్నట్లు ఐరాస తెలిపింది.
కాప్-27ను పురస్కరించుకొని ‘ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్-2022 క్లోజింగ్ విండో’ పేరుతో ఓ నివేదిక ఈ మధ్యనే విడుదలైంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత సదస్సులో ప్రపం చ దేశాలు చర్చలు జరపాలి. సంపన్న, మధ్య ఆదా య, పేద దేశాలు విశ్వ మానవాళికి భద్రమైన భరోసాతో కూడిన భవిత కోసం భూతాప నియంత్రణకు ఆచరణాత్మక వ్యూహాలు, విధానాలను అమ లుచేయాలి. ఇది మానవజాతి మనుగడ కోసమేనని విస్మరించరాదు. ఈ మేరకు పాలకులు చిత్తశుద్ధితో ప్రతినబూనాలి.
ప్రపంచ మానవాళి సమస్తం సంఘటితంగా ప్రకృతికి, భూగోళానికి హాని తలపెట్టకుండా జీవనం సాగించాలి. అగ్ర, సంపన్న దేశాల పాలకులు పంచభూతాలైన నేల, నింగి, గాలి, అగ్ని, నీరుల కాలుష్యాన్ని, విధ్వంసాన్ని విడనాడాలి. అభివృద్ధి, ప్రగతి పేరుతో పారిశ్రామికీకరణ మాటున ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని విషతుల్యం చేయరాదు. అధునాతన శాస్త్రజ్ఞులమైనా, అగ్రరాజ్యాలైనా ఎంత ధనం వెచ్చించినా సహజ వనరులను సృష్టించడం మన వల్ల కాదనే వాస్తవాన్ని గమనించి వాటిని కాపాడుకోవాలి. లేకపోతే, ప్రస్తుత విధ్వంసక మార్గంలోనే పయనిస్తే ప్రకృతి మహోగ్ర రూపం దాల్చి, కనీవినీ ఎరుగనంతటి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇప్పటికే మనపై విరుచుకుపడిన విపత్తుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇందుకు ప్రస్తుత కాప్-27 సదస్సు మంచి ఆరంభం కావాలి.
ప్రపంచ దేశాలు పెను ప్రమాదంలో ఉన్న వేళ జరుగుతున్న కాప్-27 సదస్సు మానవాళి మనుగడకు భరోసా ఇవ్వాలి. పర్యావరణాన్ని కాపాడే చర్యలు ప్రణాళికబద్ధంగా అమలు జరగాలి. లేదంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరికివేసుకున్నట్లు అవుతుంది. ఆ తర్వాత అగ్ర, సంపన్న దేశాలు శవాల దిబ్బగా మారిన భూగోళాన్ని ఏలుతాయా? ఆధునిక ప్రపంచం ప్రవచిస్తున్న శీఘ్రగత అభివృద్ధి, పారిశ్రామికీకరణ ఎవరి కోసం? ఎందుకోసం?
మేకిరి దామోదర్: 95736 66650