ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. ఈసారి ఏమిస్తారో తెలియదు. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పరు. తెలంగాణకు న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే మాట్లాడరు. అలాంటి ప్రధానికి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు.
విభజన చట్టంలోని హామీలను తుంగలో తొక్కిన నరేంద్ర మోదీ ఏం మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు? ఆయనకు తెలంగాణలో ప్రవేశం లేదు!
తెలంగాణ మణిహారమైన సింగరేణిని ప్రైవేట్‌పరం చేసి దాని అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటున్న మోదీ… మీరు కార్మిక క్షేత్రం రామగుండంలో అడుగుపెట్టొద్దు. ఏడాది కిందటే ఉత్పత్తి ప్రారంభించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఆర్ఎఫ్సీఎల్) ఫ్యాక్టరీని ఇప్పుడు జాతికి అంకితం ఇవ్వడమా? ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ర్టానికి అడుగడుగునా అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్రంలో పర్యటించడం సిగ్గుచేటు. ఆర్ఎఫ్సీఎల్కు మీరు ఎలాం టి నిధులు ఇవ్వకుండా ప్రారంభిస్తున్నారంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రొటోకాల్ ప్రకా రం తగిన రీతిలో ఆహ్వానించకపోవడం అవమానించడమే.
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసి న మోదీకి పవిత్రమైన తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కులేదు. గిరిజన విశ్వవిద్యాల యం, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, తొమ్మి ది, పది షెడ్యూల్ సంస్థల విభజన హామీలు వంటివాటిని ఆయన పూర్తిగా పక్కకు నెట్టేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విభజన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఆయన తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలి. న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటిని కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వలేదు. తెలంగాణకు కొత్తగా ఒక కొత్త వైద్యశాల కూడా మంజూరు చేయలేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసింది. ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక కేంద్ర విద్యాసంస్థల్లో ఒక్కటి కూడా రాష్ర్టానికి మంజూరు చేయలేదు. హైదరాబాద్‌కు వరద సాయంపై ఉలుకూ పలుకు లేదు. తెలంగాణకు ఇవ్వాల్సిన డిఫెన్స్ కారిడార్‌ను కేంద్రం పక్కన పెట్టింది.
తెలంగాణకు రావాల్సిన సంస్థలను, ప్రాజెక్టులను వేరే రాష్ర్టాలకు తరలించి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం కూడా మోపారు. చేనేత కార్మికులు తయారుచేసే ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తున్నారు. చేనేత దుస్తుల తయారీకి వాడే ముడిసరకులపై 5 శాతం గా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్న యువతను మోసంచేశారు. మోదీ మాటల్లో తెలంగాణపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికి వట్టి చేతులే చూపిస్తారు. ఆయన ప్రేమంతా అంబానీ, అదానీలపైనే. వాళ్ల అభివృద్ధి కోసం దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టడానికి సైతం కేంద్ర ప్రభుత్వం వెనుకాడదు. వాళ్ల ఆస్తులను పెంచడమే ప్రధాని మోదీ ఉద్దేశం. అందుకే ప్రభు త్వరంగ సంస్థలను కారుచౌకగా అంబానీ, అదానీలకు కట్టబెడుతుంటారు. మోదీ ప్రభుత్వం ఇలాగే చేస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాగ్రహం చవి చూడక తప్పదు.
ఆలేటి రమేష్: 99487 98982