తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు సాగిన ఉద్యమాలు అన్ని కూడా అన్యాయాలు, అసమానతలు రూపుమాపడానికి జరిగినవే. ఈ ఉద్యమాలు నినాదప్రాయంగా కాకుండా అనేక త్యాగాలతో నడిచాయి. నైజాంతో కొట్లాడినా, భారత సైన్యంతో కొట్లాడినా, ఆంధ్ర ప్రభుత్వంతో కొట్లాడినా భూమి మీద, వనరుల మీద, పరిపాలన మీద తమ హక్కులు తమకే కావాలని కొట్లాడినవే. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కుల, మత భేదాలతో సంబంధం లేకుండా సమన్యాయం జరగాలని ఉద్యమించిన సమాజం ఇది.
ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణలో విద్వేషాలకు తావు లేదు. ఇక్కడి ప్రజల సుహృద్భావ జీవనానికి మారు పేరే గంగా జమునీ తెహజీబ్. ఇంత గొప్ప చారిత్రక సాంస్కృతిక అనుబంధం ఉన్న ప్రజల మధ్య వైరుధ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడడం గర్హనీయం.
రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే ప్రజాసమూహంలోకి వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకోవాలి. వాటికి తమదైన రీతిలో పరిష్కారాలు చూపగలిగే దార్శనికత ఉండాలి. ప్రజల కనీస అవసరాలను గాలికి వదిలేసి ఉద్వేగాలతో రాజకీయాలను నడపాలనుకుంటే ప్రజలు ఆదరించరు, హర్షించరు. ఇలాంటి ప్రయోగాలకు చైతన్యవంతమైన తెలంగాణ సమాజం తడబడదు, తావివ్వదు. గత మూడు తరాలను పరిశీలిస్తే ఈ నేల మీద ప్రతి కుటుంబంలో ఒక త్యాగధనుడు కనిపిస్తాడు. ఏ గ్రామం, ఏ ప్రాంతానికి వెళ్లిన అమరవీరుల త్యాగాలు కనిపిస్తాయి. వారు చూపిన ప్రగతిశీల భావ ధారలు కనిపిస్తాయి. ఇంతటి చైతన్యాన్ని తప్పుడు ప్రచారాలతో, అబద్ధాలతో రూపుమాపుదామనుకుంటే ఈ ప్రాంత ప్రజల ముందు అది ఒక అపహాస్యమై, పరిహాసమై తేలిపోతుంది.
2018 సాధారణ ఎన్నికల తర్వాత హుజూర్నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, తాజాగా మునుగోడులో వివిధ కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిలో టీఆర్ఎస్, రెండు చోట్ల బీజేపీ గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో అభ్యర్థుల వ్యక్తిగత ఆర్థిక బలమే తప్ప బీజేపీ బలం ఏమీ లేదు. మునుగోడు సంగతి చెప్పనక్కర్లేదు. కోట్లు ఖర్చు చేయగల, బలమైన సామాజిక వర్గ నేతలను ఎన్నికలలోకి దించి బీజేపీ తెలంగాణపై బల ప్రదర్శన చేయాలని భావించింది. ఆనాటి నాజీల వలె దురాక్రమణ చేయడానికి తెలంగాణపై దండయాత్ర చేయాలనుకున్న బీజేపీ ఎత్తుగడలను ప్రజలు పసిగట్టారు. ఉమ్మడి ఏపీ పాలకులు తెలంగాణను వలసప్రాంతంగా మలుచుకొనే ప్రయత్నాన్ని ఇక్కడి ప్రజలు నిరసించారు. పోరాడారు. సుదీర్ఘ కాలం శాంతియుత పోరాటం చేసి విజయం సాధించారు. అలాంటి ఈ నేలపై ఉత్తరాది నుంచి, ఈశాన్య రాష్ర్టాల నుంచి నేతలను దించి దండయాత్ర చేయాలని చూస్తే ప్రజలు అర్థం చేసుకోరా?
ఒక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంటే.. ప్రజలు ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి అవకాశం ఇస్తారు. అంతేగానీ ఒకటి రెండు ఉప ఎన్నికల ఫలితాలతోనే తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటే.. ప్రచారం వరకే పరిమితమవుతారు. ఆ మాటకొస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే తెలంగాణలో కొంత బలం ఎక్కువ. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే విద్వేష రాజకీయాలు చేస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని ఒక రాజకీయ ప్రయోగశాలగా చేయాలని భావించిన కాషాయ పార్టీకి తెలంగాణ ప్రజలు సరియైన పద్ధతిలో సమాధానం ఇస్తూ వచ్చారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం సమాఖ్య స్ఫూర్తికి, కేంద్ర రాష్ర్టాల మధ్య సంబంధాలకు విరుద్ధమైన చర్య. వివిధ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కొనుగోలుచేసి మరో పార్టీలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పార్టీలు మారవచ్చు. కానీ మన రాష్ట్రంలో చేరికల కోసమే ఒక కమిటీని ఏర్పాటు చేసి బాహాటంగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమానికి తెర లేపడం హేయమైన చర్య. బీజేపీ ఒకప్పుడు గవర్నర్ల వ్యవస్థను, గవర్నర్ల కర్ర పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వచ్చాక అదే గవర్నర్లతోని రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే పనులు చేస్తున్నది. పరిపాలన వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ ప్రకటనలు చేయించడం, రాజకీయ ప్రక్రియలో బాహాటంగా పాల్గొనడం మొదలైన చర్యలను గవర్నర్లతో చేయించడం రాజ్యాంగ విరుద్ధం. ఇది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు గొడ్డలి పెట్టు లాంటిది.
రాష్ట్రప్రభుత్వాలపై, ప్రజల స్వతంత్ర రాజకీయ వ్యక్తీకరణపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తే సమైక్య స్ఫూర్తి దెబ్బతిని కేంద్రంపై రాష్ర్టాలు తిరుగబడే అవకాశం ఉన్నది. రాష్ర్టాలపై మితిమీరిన అధికారాలు ప్రదర్శిస్తే భవిష్యత్తులో వివిధ రాష్ర్టాల ప్రజలు కేంద్రంపై తిరుగుబాటుకు సిద్ధపడతారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
దేశ ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన కేంద్ర హోంమంత్రి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతామని ఆయా రాష్ర్టాలలో రాజకీయ అస్థిరతను సృష్టిస్తామని బెదిరించే పరిస్థితి నేడు చూస్తున్నాం. ప్రజలు ఓటేసి ఎన్నుకున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడమంటే ఆయా రాష్ట్ర ప్రజల రాజకీయ నిర్ణయాన్ని కాలరాయడమే.
ఎర్రోజు శ్రీనివాస్