అయినవాళ్ళకు ఆకుల్లో కానివాళ్ళకి కంచాల్లో అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో స్థానికులకు మొం డిచేయి చూపిస్తూ స్థానికేతరులను అందలమెక్కిస్తుందనడానికి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మంచి ఉదాహరణ. కేంద్రం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ఈ ఫ్యాక్టరీలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. నిబంధనలను విస్మరిస్తూ స్థానిక నిరుద్యోగుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నది. తెలంగాణ వ్యవసాయ రంగానికి కల్పతరువుగా ఉంటుందన్న భావనతో 1970 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్ధాపన చేసింది.
1980 నవంబర్ 1 నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరిట యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు.అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు నిర్వహణ లోపాలతో ఫ్యాక్టరీకి నష్టాలు వచ్చాయంటూ 1999 మార్చి 31న నాటి ప్రధాని వాజపేయ్ ప్రభుత్వం మూసివేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తిరిగి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్గా కొత్తరూపు సంతరించుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించి 2015 ఫిబ్రవరి 17న పునరుద్ధ్దరణ పనులు ప్రారంభం కాగా, 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు.
ఈ ఫ్యాక్టరీ పునరుద్ధ్దరణతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని ఆశించిన స్థ్ధానిక నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఫ్యాక్టరీ పునరుద్ధ్దరణకు, ఎంతగానో కృషి చేశారు. పరిశ్రమ నిర్మాణానికి భాగస్వాములు ఎవరూ రాని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటా తీసుకుని చెల్లింపులు జరిపింది. కేంద్రం నిబంధనల ప్రకారం 95 శాతం మంది స్థానికులు ఉండాలి. కానీ మొత్తం 426 ఉద్యోగాలలో కేవలం 43 మాత్రమే తెలంగాణ వారికి లభించాయి. అందులోనూ జీఎం స్థాయి పోస్టు ల్లో తెలంగాణవారు ఒక్కరూ లేకపోవడం కేం ద్రం చిన్న చూపుకు నిదర్శనం. ఇవే కాకుండా 1085 కాంట్రాక్టు ఉద్యోగాలలో తెలంగాణకు చెందిన వారు 20 మంది మాత్రమే. గుజరాత్, బీహార్ రాష్ర్టాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పించి స్థానికుల నోట్లో మన్ను కొట్టారు.
శాశ్వత ఉద్యోగాలతోపాటు కాంట్రాక్టు నియామకాల్లోనూ స్థానికులకే అవకాశం ఇస్తామని కేంద్ర ఎరువులు శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. అలాగే మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా స్థానికులకే ఉద్యోగాలిస్తామని ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా వ్యవహరించి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికైనా కేంద్రం వివక్షను విడనాడి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి. అలాకాని పక్షంలో తెలంగాణ ప్రజలు మరో సమరానికి సన్నద్ధం కావడం తథ్యం. ఈ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఉద్యోగాల కల్పన అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉన్నది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్)
కోలేటి దామోదర్