మనసు పూచింది పూలే
అవి తోటలో బతుకు దివ్వెలైనవి
అక్షరాలు పరవశించే
స్నేహ సౌందర్య సౌగంధమై
మనలో ఉన్నది
గొప్ప సావాసమే తరగని గనిలా
సృజన జనించింది సాహితీ సీమలో
ఒక సుందర కవితగానో కథగానో
మట్టి చిత్తం స్థిరమైంది విత్తనమై
ఓ కన్ను కలమైంది
బతుకులో అంటుకట్టింది తీగలై
ఆ కలమే అందాల చూపులై మార్చె రాత
కావ్యాలు కురిసే కురుల పూలై
మనసు విరిసింది విరుల తోట
పదం మెచ్చింది జన పథమై
స్వేచ్ఛ వీచిన గాలి నడకే
తోట అంటుకట్టిన కొమ్మలైంది
తోటంటే అదో అపూర్వ జీవితం
మాయని స్నేహాలూ తీయని బంధాలు
భూమీ ఆకాశం ఊగే గాలిలో స్వేచ్ఛగా
మధుర మంజుల మనోజ్ఞ సీమల తేలే బతుకు
బహుశా ఇది కొత్త అనుభవం కావొచ్చు
మనిషిని గౌరవించే జీవితం కనడం
వృక్ష లతలన్నీ పూచేను అవనిపై
లలిత కవితలే విరజల్లే సుమ గంధాలై
నిజమే మట్టి సాళ్ళలోనే వేళ్ళు
ఊపిరి పీల్చింది వాకిలిలో గాలి
కువకువల పక్షులు చేరే పచ్చని చెట్టుపై
మనిషి మాటే జీవ గుణమై
మానవతే తీయని మందారాలు విరిసింది
-డా.టి.రాధా కృష్ణమాచార్యులు , 98493 05871