నన్ను చూసి
అందరూ అదోలా నవ్వుతరు
నేను నవ్వితే అదోలా చూస్తరు!
నవ్విన నాప చేను
ఎప్పటికైనా పండక పోదాని
నే నవ్వుతనే ఉంటా…
నవ్వు..
నవ్వు నాలుగు తీర్ల చేటైనా
నలభై తీర్ల మంచైనా
నువ్వు నవ్వకున్నా
నే నవ్వుతనే ఉంటా…
ఇతరులు నవ్వడానికైనా
కోపం తాపం తీర్చడానికైనా
నేను నవ్వుల పాలైనా
నే నవ్వుతనే ఉంటా…
నేనెంత దుఃఖాన్ని
తమాయించుకుని నవ్వుతున్నా
నవ్వెటోని ముందర జారిపడుతున్నా
నువ్వు గింజ నానేదాకా
నే నవ్వుతనే ఉంటా…
పసిపాప నవ్వులా, పండు వెన్నెల్లా
పల్లూడిన అవ్వలా, విరబూసిన పువ్వులా
ఎగిరే గువ్వలా, ఆడే మువ్వలా
జలపాతపు హోరులా, హోరు గాలిలా
నే నవ్వుతనే ఉంటా…
నువ్వు ప్రేమగా నవ్వే దాకా
అందర్నీ నవ్వించే దాకా
దుఃఖం నదిలో
నవ్వు నీరు పారేదాకా
నే నవ్వుతనే ఉంటా…
-గంగాపురం శ్రీనివాస్ , 96763 05949