అంతర్నేత్రం రెక్కలు విప్పితే
రాతిలో శిల్పాన్ని ఊహించే ఉలి
కాగితంపై శాసనంలా కదిలే వాక్యం
కాలు జారని నడక
భవిష్యత్తు ఊహించే చిత్రం
ప్రాణవాయువు పంచే వాకిట్లో చెట్టు
బడి గంట, గుడి గంట కాదు
సజావుగా కొట్టుకునే గుండె గంట
మనిషికి నిలువెల్లా కళ్ళున్నా
అంతర్నేత్రం పెద్దర్వాజలా తెరుచుకోవాలి తరచూ
బుజ్జగించే వెన్నెలలు, మత్తు చీకటి కౌగిళ్ళు వదిలి
ఆరోగ్యం పంచే సూర్యకిరణాలు కావాలి
నాలుక తప్పుల మడతలేయకుండా
అంతర్నేత్రం కావాలి శ్వాసతో పాటు వెలిగే దీపం
ఉడుకు నెత్తురు ఉరకలు
దోషంలేని ఉచ్చారణల స్వరం
అంతర్నేత్రమంటే
సంకలో ఎత్తుకొని ప్రయాణం చేసే అమ్మ
భుజాలపై మోస్తూ దారిచూపే నాన్న
మనసు నల్లబల్లపై అక్షరాల చాక్ పీస్ గురువు
చేతులు కలిపి కదిలే స్నేహహస్తం
-కొమురవెల్లి అంజయ్య , 98480 05676