దేశ దేశాలకు భౌగోళికంగా
వాస్తవాధీన రేఖలున్నట్లు
దేహ దేహాలకు మానసికంగా
వాస్తవాస్తవ రేఖలుంటాయి
తనోళ్ళ తప్పొప్పులను
గుప్పిట చాటున దాచినట్టు
నిజానిజాల నిష్ఠూరాలను
ప్రతికూల పరిస్థితుల్లో
నిప్పురవ్వల కొలిమిలో
జాగ్రత్తగా జారవిడుస్తుంటారు
పోగొట్టుకున్న పొగగొట్టం కోసం
వాకిలి పొక్కిలయ్యేలా
చీకట్లో వెతుకుతుంటరు
చాటుమాటుగా చూసేవారు
పొట్టచెక్కలయ్యేలా
లోలోన నవ్వుతుంటరు
తారు రోడ్డు మీద
సుతారంగా నడవలేనోళ్ళు
కంకర రోడ్డు మీద
వంకర టింకర పోకడలు
ఉన్నదానికి, ఊహించినదానికి
పుట్టిందానికి, పుట్టించిందానికి
నడుమ వాస్తవ రేఖలెన్నో?
నిజాన్ని నిక్కచ్చిగా కొలిచే
నిజమైన కొలమానం లేకున్నా
మనసు స్టెతస్కోప్‌తో వింటే
వాస్తవం ఇట్టే అవగతమవుతుంది.
-గంగశ్రీ , 96763 05949