ప్రకృతి తక్కెడలో
తూకమంతా సమానమే
కొక్కెము ప్రక్కకు నొక్కిపట్టి
తృణప్రాయంగా
దిగువ స్థానానికి దిగజార్చేది మానవుడే
ఆకాశ హర్మ్యాలు
కర్మాగారాల నిర్మాణాలు
అధునాతన ఆర్భాటాలు కోకొల్లలు
అట్టడుగు జనంపై
అవలోకన దృష్టాంతమేది!
కోట్ల కట్టల
చాటుమాటు కోటార్ల పటుత్వ మెక్కువున్నా
నిస్రావము త్రాగి
నీల్గి నీరసించే వారెందరో!
దేశమంతా పంటల ప్రాదుర్భావమే
దండుకునే మిడతల దండులనేకం
ఎటుచూసినా, చేను మేసే కంచెలే
చరిత్ర పుటల్లో
నిరంతరం నిలిచిన
పాత తరం కీర్తి కిరీటాలెన్నో,
పరోపకార పరాయణత్వం
గురుతెరుగని
ఆధునిక అధికార శక్తుల గణితం
పట్టుకెళ్లేది కేవలం ప్రతిభనుకుంటే
నిస్వార్థ సేవలో నిమగ్నమైతే,
ప్రక్కకు తిరిగిచూడు
తాటికమ్మల గొడుగుల కింద
ఎన్నో మిణుగురు పురుగుల
తరుగు వెలుగులున్నాయి
టపటప చినుకుల తడికి
తడిసి ఆరిపోతున్నాయి
తక్కెడ తూకం సవరించు
వత్తివేసే వాటిని వెలిగించు
నిరతం ధ్రువతారవై
నింగిలో నిలబడు…
వూట్ల భద్రయ్య , 95502 56840