సన్న దూదిని పేనగా వన్నెలొలికి
స్నేహసారమ్ము లూపిరౌ చిత్రరూపి
సెమ్మె యంచున వేలాడు చిద్విలాసి
కాల్చుచీకటి కొరకంచు వ్రేల్చుదివ్వె..
దేశ రక్ష కొరకు దేహమ్ము నర్పించు
ధీరసైనికులకు దీటుగాను
తన్ను తానెకాల్చి తరుమును చీకట్లు
దీప మెన్న చాగ రూప మగును…
క్రమ్ముకొనివచ్చు నిబిడాంధకారమందు
జగము మాయగా భ్రమియించు క్షణములోన
తిమిర రాక్షసి నెదిరించి సమరమందు
ఉన్నదేదియో లేనిదేదో తెలియగ
మాయ తొలగించి సత్యమే శ్రేయమనుచు
చిన్న దీపమ్ము రూపించు చిత్సుధలను…
తరణిమాయమైపోయిన తరుణమందు
తిమిర మెంతటి జగజెట్టి తీవురముగ
దాచగాజూచు మసిబూసి దోచ జగతి
చిన్న దీపమ్ము ఛేదించి చింతదీర్చు…
స్నేహమధువుఁ బీల్చి సెమ్మెవేదిక పైన
తామసిక యవనిక తా మసియవగ
ప్రభగ వెలుగులీను బ్రతుకంత కరుగగా
దివ్యనర్తకియగు దీపలేమ….
-మరుమాముల దత్తాత్రేయశర్మ ,94410 39146