హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్ల కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి విశిష్ట సేవలకు డిమాండ్ ఉండటంతో వీటిని ఎలక్ట్రానిక్ డిప్ (ఈ-డిప్) పద్ధతిలో కేటాయించినట్టు పేర్కొన్నది. భక్తులు ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు వెల్లడించింది. లకీడిప్లో టికెట్లు పొందిన భక్తులకు మొబైల్ ద్వారా మెసేజ్ సందేశం అందుతుందని, వారు 23 మధ్యాహ్నం 12గంటలలోపు నిర్ణీత రుసుము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలని సూచించింది. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి వర్చువల్, ప్రత్యక్ష సేవ టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది. అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను 23 ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap. gov.in లేదా ‘TTDevasthanams’ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొన్నది.