ఎన్నో యాతనలు… మరెన్నో ప్రళయాలు
ప్రసవ వేదనపడి
ఈ ఆకృతి దాల్చింది విశ్వం
నీవు ఈ భూమ్మీద పుట్టకముందే
నీకు పేరు పెట్టకముందే
జగతి రూపం దాల్చింది
మనుగడ కోసం నీవు చేసే పోరాటం
అస్తిత్వం కోసం నీవు చేసే ఆరాటం
లోటలో రాల్లేసి ఊపినంతే…
నువ్విక్కడ కాలు మోపకముందే
సూర్యుడు వెలుగునిచ్చాడు
చంద్రుడు నేలను ముద్దాడాడు
పర్వతాలు గుట్టలు విస్తరించాయి
నదులు నాట్యమాడాయి
అడవులు అవతరించాయి
జీవవైవిధ్యం తేజోవంతమైంది
ఓ నరుడా.. నీ రాకతోనే ఇదేదో మొదలైనట్టు
సృష్టికి ప్రతిసృష్టి నీకే సాధ్యమైనట్టు
ఎందుకు నీకీ మిడిసిపాటు
శతాబ్దాల చరిత్రను
సృష్టించాలనే నీ తపన
కొండను తొల్చి ఎలుకను పట్టినంతే….
రుతువులు సృష్టించావా, సముద్రాలు తొవ్వించావా
పర్వతాలు నిర్మించావా, గాలిని నీటిని పుట్టించావా
ఇదంతా సృష్టి ధర్మమని
ఇంకెప్పుడు తెలుసుకుంటావ్…?
కులమతాల పాకుడు రాళ్లపై
ఇంకెంతకాలం జారుతుంటావ్…
అంతా తెలుసుకునేలోపే మాయమైపోతావ్…
అసమానతల గీతలు ఇంకెన్నాళ్లు గీసుకుంటావ్…
జీవితం మూన్నాళ్ళ ముచ్చటని
క్షణాల్లో ఆగిపోయే బొంగురమని
ఎన్నడు, మరెన్నడు తెలుసుకుంటవ్
కుప్పకూలితే కుళ్లిపోయే
నీ తనువుకెందుకింత అహంకారం
నీటిబుడగ లాంటి జీవితం పక్కున పగలకముందే
నీవైన ఆనవాళ్లు కొన్నైనా ఈ నెలపై ఉండనీ
మట్టిలో కలిసినంక కూడా మనిషివై మిగులుతావు
తస్మాత్ జాగ్రత్త..!
-కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
9441561655