అప్పుడప్పుడు మాటలు కూడా బరువెక్కుతాయి
మనసు మూలన మోయలేనన్ని
రాళ్ళతో గోడలు కడుతాయి
మమకారపు పూత లేని
తీగల్లా మనిషిని బంధించి
బాధించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
అవును ఇప్పుడిప్పుడే
అది నాకు తెలుస్తున్నది
మన అనుకున్నవాళ్లే
సూటిపోటి గుండు సూదులతో
గుచ్చిగుచ్చి వెకిలి నవ్వులు నవ్వుతుంటారని
మాటలు తూలి తూలి
మాలిన్యాన్ని అలుకుతుంటారని.
వాడో వీడో
ఎవడో ఒకడు
మాట మీద పెట్టినప్పుడల్లా
గుండె బరువెక్కి
అలుగువారుతున్న బాయవుతుంది
మాటలు ఎల్లప్పుడూ విలువైన
వజ్రాలని భ్రమ పడకండి
అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి
తేలిపోయే రంగురాళ్లవి
అబద్ధం బండ మీద
జీవితాన్ని అరగదీస్తూ
స్వార్థపు పరిమళాన్ని పూసుకుంటున్న
భ్రమరాల రెక్కలకు
బరువెలా తెలుస్తుంది, విలువెలా తెలుస్తుంది
మోయలేక రెక్కలు తెగి విలవిలలాడుతున్న
తూనీగలను ఒక్కసారి పలకరిస్తే
అవగతమవుతుంది
మత్తడి దూకే కన్నీళ్లకు పర్యవసానం.
-శ్రీతరం , 78936 13015