ఏడాది కిందటి మాట. ఈ వ్యాస రచయితతో ఓ ప్రముఖ దినపత్రిక సంపాదకుని ముచ్చటలో ‘ఆ నాయకుడు’ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, పొట్టివాళ్లు తెలుగు రాష్ర్టాలకు అచ్చిరారు అన్నారాయన. ఆ మాటకు నవ్వి ఊరుకున్న. కానీ ఆ సంపాదకుడు చెప్పిన మరొక అంశాన్ని మాత్రం నేను సీరియస్‌గా తీసుకున్న. అదేమంటే.. ‘కేసీఆర్‌లోనూ, టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమనాయకులలోనూ ఉన్న నికార్సైన తెలంగాణ ఆత్మ కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి ఉంది, ఒక్క పేరు చెప్పండి’ అని! అట్లని ఆ సంపాదకుడు టీఆర్ఎస్ సానుభూతిపరుడు కాదు. తెలంగాణ వాది.
నిజమే, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అచ్చ తెలంగాణ ఆత్మ ఉన్నవాళ్లు ఈ రెండు పార్టీల్లో ఎవరూ లేరు. ఉండివుంటే స్వరాష్ట్రం కోసం ఇన్ని బలిదానాలు జరిగి ఉండేవి కావు. పార్లమెంట్ సాక్షిగా మోదీ తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసిండు అంటేనే బీజేపీకి తెలంగాణ పట్ల నిలువెల్లా ద్వేషం ఉందన్నది తేటతెల్లం. ఇక ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు వాగాడంబరమే భూషణం.
అందుకే ఇప్పుడు 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి కించిత్ సం తోషం కలగడం లేదు ఆ రెండు పార్టీలకు. ఎందుకంటే.. ఎక్కడ తమ పుట్టి మునుగుతుందోననే భయం. కాంగ్రెస్ గురించి రాస్తే న్యూస్ ప్రిం ట్ దండగనే రోజులు ఒచ్చేసినై. ఇక బీజేపీ నాలుగు రాష్ర్టాల విజయా న్ని చూసి మురిసి, తమకు తిరుగేలేదని భ్రమసి, తగ్గుతున్న ఓటింగ్ శాతాన్ని మరచి, అహంకారం తలకెక్కితే వారి ఖర్మ. పంజాబ్ రైతులు కర్రు కాల్చి పెట్టిన వాతలకు యూపీ గెలుపు లేపనం ఏమీ పనిచేయదు.
మన రాష్టంలోని ఆ రెండు పక్షాలు ఎంత భావదారిద్య్రంలో ఉన్నాయో తెలిపేందుకు ఈ రెండు ఉదాహరణలు చాలు. ఒకటి: ఈ ప్రకటన నమ్మం. మా వల్లే ఉద్యోగాలు అంటూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రెండు: మొన్న టీవీ షోలో బీజేపీ నాయకురాలు ఒకరు అలవాటుగా.. ‘ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నయో చెప్తేనే మేం నమ్ముతం, శ్వేతపత్రం విడుదల చేయాలి’ అన్నరు!. ‘ఆ లిస్ట్ అసెంబ్లీలో ఇచ్చిన్రు కదా’ అని సీఎం పేపర్లు చూపు తూ టీవీ హోస్ట్ అంటే.. ఆమె మొహాన నెత్తుటి చుక్క లేదు. మరీ విచిత్రం ఏమంటే.. ఉద్యోగాలు ఎవడిక్కావాలె, నిరుద్యోగ భృతి ఇవ్వండి అంటున్నట్టున్నది ప్రతిపక్షాల తీరు!
సరే, ఈ దివాళాకోరుతనంపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని చిక్కడపల్లి లైబ్రరీకి పోయి పరీక్షలకు ప్రిపేర్ అయితున్న విద్యార్థులను కలిసిన. అందరూ ఎంతో ఆశాభావంతో మాట్లాడిన్రు. వయో పరిమితి పెంచడంపై వాళ్ల హర్షాతిరేకాలు మామూలుగా లేవు. ఒక యువతి అన్నది కదా.. ‘ఏముంది సార్, ఇది నోటిఫికేషన్ వర్సెస్ నోటి దూలఫికేషన్’ అని.
ఇదే సమయంలో తెలంగాణ యువతకు ఒక సూచన. ఉద్యోగమొచ్చినంక ప్రభుత్వంలో చిత్తశుద్ధితో భాగస్వాములు కండి. రాష్ట్ర నిర్మాణంలో పాత్ర పోషించండి. క్షతగాత్ర రాజకీయుల ఏడుపులూ పెడబొబ్బలే దీవెనలు.. మీకూ, మాకూ! ఈ మాట ఎందుకంటే.. ఆ సంపాదకుడు చెప్పినట్టు కేసీఆర్‌లో ఉన్న తెలంగాణ ఆత్మ మనందరిలోనూ ఉన్నది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నది. ఇప్పుడు మీలోని తెలంగాణ ఆత్మను తట్టి లేపాలి. వాట్సాప్ యూనివర్సిటీల, బీజేపీ క్షుద్రవిద్యల బారిన పడకుండా ఉండాలి.
ఘనమైన యువ మానవసంపద మన దేశం సొత్తు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రసంకల్పం కలిగిన యువతే దేశాన్ని మార్చగలదు’ అని కదా స్వామి వివేకానంద ఉద్భోధ. పనిచేసే ప్రభుత్వాలు ఈ యువ సంపదను దేశ అభివృద్ధికి వనరుగా ఉపయోగిస్తాయి. అమెరికా, యూరప్ సహా ఏషియన్ టైగర్స్ అయిన జపాన్, సింగపూర్ లాంటి దేశాల ప్రభుత్వాల దారి ఇదే. ఎన్నెన్నో దేశాలు కళ్ళు తెరవని నాడు విజ్ఞాన కుసుమాలు వికసించిన మన దేశానికి పూర్వ వైభవం తేవాలి. అందుకు మీరే దారి. వేమన తేటతెనుగు ఆటవెలదులను సిపి బ్రౌన్ వెలికి తెచ్చినట్టు, గోదావరి జలాలను ఆంధ్రుల పొలాలకు ఆర్థర్ కాటన్ అందించినట్టు, పాల్ బ్రంటన్ అనే విదేశీయుడు భారతదేశ నిగూఢ సంపదను తన ‘రహస్య భారతం’లో (A Search In Secret India) ఆవిష్కరిస్తాడు. చదవండి యువతా!
మచ్చుకు అందులోంచి కొన్ని.. ‘రుషులు యోగులకంటే పైమెట్టు మీద ఉంటారు. అలాంటి ఇంకా మిగిలివున్న ఇద్దరు ముగ్గురిలో ఒకరిని నేను కలిశాను. ఆయన తన ఆత్మశోధన, పరిశోధన ఎంత మేళవించారంటే, ఈ క్షణం గంభీరమైన వేదాంతం చర్చిస్తూనే మరుక్షణం భౌతిక విషయాలు అంత గంభీరంగానూ, తీవ్రంగానూ చేపట్టగలరు. అందుకే ఆయన సాంగత్యం అంటే నాకు ఆనందం. ఆయన తన ఆంతరంగిక స్నేహంలోకి నన్ను అనుమతించారు. ఒక్కొక్కసారి పనీ, పాటా కలిసి మేం గంటల తరబడి గడుపుతాం. ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపు విన్నా విసుగనిపించదు. ఎన్ని విషయాల మీద ఆయన అనర్గళంగా మాట్లాడగలరో విని సమ్మోహితుడినైపోతాను. ఆయనకు తెలిసినదంతా ఆ బుర్రలో ఇమిడిందంటే నాకు ఆశ్చర్యం.’ (పేజీ 24-25, రహస్య భారతం). ఈ వర్ణన మన కేసీఆర్ గురించి చెపుతున్నట్టు ఉన్నదని నేనంటే అతిశయోక్తి అనిపిస్తుందని కించిత్ సందేహం నన్ను పీడిస్తున్నప్పటికీ.. తప్పక అంటాను. అందుకు తార్కాణాలు కూడా చెప్తాను. గాదె ఇన్నయ్య, కోదండరాం లాంటివారు కేసీఆర్ గురించి ఇలాంటి మాటలే గతంలో నాకు చెప్పిన్రు. స్వామిగౌడ్, ఈటల రాజేందర్ లాంటివాళ్లు నేడు ఎంత వాచాలత ప్రదర్శిస్తూ ఉన్నా అంతరాంతరాల్లో ఇది నిజం అని వాళ్ళ తొక్కిపట్టిన ఆత్మ అరుస్తనే ఉంటది!
నిత్యం రాముని పేరు స్మరించే బీజేపీ వారికి రాముడు సహా ఏ పురాణ పురుషుడూ అర్థం కాలేదు. భారతదేశ ఆత్మను వారు పట్టలేరు. వారికా పట్టింపు లేదు. స్వార్థ మతరాజకీయాలు తప్ప! ‘భారతీయులు వాస్తవాన్ని, వదంతిని ముందువెనుకలు ఆలోచించకుండా కలగాపులగం చేస్తారు’ అంటూ చురకలు వేస్తాడు పాల్ బ్రంటన్. ఈ బీజేపీ వారు ఇందులో అందెవేసిన చెయ్యి. వారు ఎంత దిగజారా రంటే.. కేసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి పోతే అశుద్దపు మాటలు రాసిన్రు. ఆ అల్పుల తిట్లు, అపరిశుద్ధ, అమానవీయ వాచాలత దూదిపింజె. కేసీఆర్ సాధించాల్సినవి ఎన్నో ఉన్నై. ఈ వ్యాస రచయితతో కేసీఆర్ పలుమార్లు అన్నరు-‘long way to go ’ అని. అది నిజం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హెల్తీ – ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ, సర్!
Lets go that long way, Telangana!
ఒక నల్సార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఫోన్లో ‘దేశాన్ని సవ్యమార్గమూ, నవ్యమార్గమూ పట్టించగల నేత కేసీఆర్’ అని అంటున్నరు. అయితే అందుకు తెలంగాణ సమాజం, ముఖ్యంగా యువశక్తి దన్ను ఎంతైనా అవసరం. అందుకే నా యువమిత్రులారా..హోంగే కామియాబ్.. హమ్ హోంగే కామియాబ్. మన్ మే హై విశ్వాస్.. పూరా హై విశ్వాస్.హమ్ హోంగే కామియాబ్.. క్యోంకీ.. హమారే పాస్ కేసీఆర్ హై !!
-శ్రీశైల్ రెడ్డి పంజుగుల , 90309 97371