మలకుబోయిన మాయమ్మ
ఎండిన కట్టెల్ని ఇర్సుకొని
ఈతాకు మెలతో మోపుగట్టి
నడ్మ యాడ దించకుండగా తెచ్చిన
కట్టెలే మా పొయ్యిల
ఆకలికి కాలిపోతుంటయి.
పురిటి పండుగ నాడే మాయమ్మ
గోసి బోసుకొని తెల్లజొన్నకంకులు కోయబోతే
సేను పెద్దమనిషి కనికరించి
ఇంటికి పంపిన సుద్ది ఇప్పటికీ యాదిజేస్తుంటది.
పొద్దు పొడుపుకు ముందర్నే లేసి
సద్దిది బొద్దిది పాతబట్టల కట్టుకొని
వరి మునం కోయబోతనే
మా మట్టి పొయ్యి మీద గంజికి పొంగొస్తది
పరిగ కంకులేరుకొచ్చి
బండ మీద కొట్టి వడ్లగింజలు రాల్చుకొని
రోళ్లు అరిగేదాకా దంచుకొని
గింత కలితో కల్పుకొని
ఎసుట్ల బియ్యం కుత కుత ఉడుకబెడ్తేనే
ఆ పొద్దును బువ్వ తిన్న దినంగా గొత్తుపెట్టుకుంటాం
పాలుమర్వని నాకు
పయిటాలకే పాలివ్వడానికి వచ్చి
సగం కడుపుకే తిని
బిడ్డ కడుపు నిండగా పాలిచ్చే
పెద్దరాశి పెద్ద గుణం మాయమ్మది
రాత్రి మిగిలిన బువ్వ పాసిపోయి
వాసనొస్తుంటే
సుట్టాలు చూసి నవ్వుకుంటారనీ
కొంగు గప్పి మా ఇంటి పేదరికాన్ని
దాసి పెట్టేది మాయమ్మ
అద్దమ్మరాత్రి సలిజరం వచ్చి
వణుకుతుంటే
తడిబట్టతో పెయ్యంత నిమిరి
పొద్దుపొడిసేదాకా కునికిపాట్లతో నాకు జాగారం
చేసే మాయమ్మ నీలగిరి వనం నీడపాటు
గెట్టు పంచాతీకాడ సరీకులతో కొట్లాటైతే
నడుములు ఇరిగిపోయేటట్లు తన్నులు తిని
రెండు ఎకరాల పొలాన్ని కాపాడి
మా ఇంటి పర్వును నిలబెట్టిన
దేవదారు వృక్షం మా అమ్మ…
-అవనిశ్రీ ,99854 19424