మోదీ సర్కార్ పథకాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే తీరున ఉంటాయి. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా.. ఇవన్నీ అటువంటివే. ఈ జాబితాలో కొత్తగా తీసుకొచ్చిన మరో పాత పథకం నదుల అనుసంధానం. వాజపేయి హయాం నుంచీ ఈ అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తున్నది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లోనూ ఆర్థికమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. దీంతో దీనిపై మరోసారి చర్చ మొదలైంది. బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టిన రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ అంశాల వారీగా దునుమాడిన విషయం తెలిసిందే. నదుల అనుసంధానాన్ని జోక్ ఆఫ్ ది మిలీనియంగా అభివర్ణించారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధినొందిన రాజేంద్రసింగ్ కూడా.. ‘రాష్ర్టాల మధ్య ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక సంక్షోభానికి నదుల అనుసంధానం కారణమవుతుంది. కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభం కలిగించే ఈ చర్య వల్ల జలవనరులు ప్రైవేటుపరం అవుతాయి’ అని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే చెప్పినట్టు – దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే, 35 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్న పరిస్థితి. మిగిలిన 30 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. బంగారు పంటలను పండించే నేలలున్నా, కేంద్రప్రభుత్వ అసమర్థతను వెక్కిరిస్తూ ఇంతటి జలనిధి వృథా అవుతున్నది. ఆ జలరాశిని సమర్థంగా ఎలా ఉపయోగించాలి అన్నదానిపై మోదీ సర్కార్‌కు స్పష్టమైన, ఆమోదనీయమైన ప్రణాళిక ఉన్నట్టు కనిపించడం లేదు. నదుల అనుసంధానం అంటూ ఓ పడికట్టు పదాన్ని మాత్రం వల్లె వేస్తున్నది. దేశంలోని నదులను అనుసంధానించటం చిన్న విషయమా? అంతటి భారీ ప్రాజెక్టును చేపట్టాలంటే సంబంధిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో, జలవనరుల నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపాల్సి ఉంటుంది. విస్తృత చర్చ లేకుండా ఇంత యథాలాపంగా బడ్జెట్లో ప్రతిపాదించడం సబబు కాదు.
నదుల అనుసంధానం విషయమై మొదట్లో వచ్చిన ప్రతిపాదన లక్ష్యం వేరు. ఉత్తరాదిన గంగా బ్రహ్మ పుత్ర నదీ ప్రాంతాలు తరచు వరదలకు గురవుతున్నాయి. ఇక్కడి అదనపు జలాలు ఉన్నాయి. మరోవైపు దేశ పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలు నీటికొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాది నదులలోని అదనపు జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే అక్కడ వరదల బాధ ఉండదు, ఇక్కడ కరువు కాటకాలు ఉండవు అనేది ఆలోచన. కానీ ఇప్పుడు ఎక్కడి నదులను అక్కడ ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ స్థానిక అవసరాలను పట్టించుకోవడం లేదు. పైగా నదీజలాలపై కేంద్ర పెత్తనం నెలకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతటి కీలకమైన అంశంపై కేంద్రం తొందరపాటు ప్రదర్శించకుండా సంబంధిత రాష్ర్టాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రజాస్వామికంగా వ్యవహరించాలి.