వ్యవసాయం ఉత్పాదకరంగం కాదన్న ఆర్థికవేత్తల అంచనాలను తారుమారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశారు. గోదావరి మీద ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తిచేసి దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత లేకుండా చేశారు.
కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 70 శాతం పనులు పూర్తిచేశారు. కోర్టు కేసుల చిక్కులు లేకుంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి వచ్చి సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సాగునీటి రాకతో తెలంగాణ పల్లెల దశ, దిశ మారిపోయింది. 2021 వానకాలం, యాసంగి కాలాల్లో రాష్ట్రంలో ఇతర పంటలు కాకుండానే దాదాపు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. దీంతో తెలంగాణ జీడీపీ అనూహ్యంగా పెరిగింది. దేశంలో రూ.9.78 లక్షల కోట్లతో తెలంగాణ పదో స్థానంలో ఉండగా, రూ.2,50,691 తలసరి ఆదాయంతో దేశంలో ఏడో స్థానంలో ఉన్నది.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావాలి. నాణ్యమైన వైద్యసేవలు అందాలన్న సదుద్దేశంతో కేసీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నియోజకవర్గ, జిల్లాస్థాయి దవాఖానలను బలోపేతం చేశారు. హైదరాబాద్‌కే పరిమితమైన డయాలసిస్ కేంద్రాలను ప్రతి డివిజన్ కేంద్రంలో ఏర్పాటుచేశారు. పేద ప్రజలు అప్పుచేసి మరీ ప్రైవేటు దవాఖానలకు కాన్పుల కోసం వెళ్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు యాజమాన్యాలు అవసరం లేని శస్త్రచికిత్సలు చేస్తూ వారినుంచి డబ్బు వసూలు చేస్తున్నాయి. ఆర్థికంగా నష్టపోతూ అనారోగ్యం పాలవుతున్న పేద ప్రజలను ప్రభు త్వ దవాఖానల వైపు ఆకర్షించేందుకు గర్భిణీలకు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలతో పాటు కేసీఆర్ కిట్ అందించే పథకానికి 2017 జూన్ 4న శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. నాటినుంచి ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నది.
ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలి. ప్రభు త్వ సేవలు ప్రజలకు అందాలని 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసి పరిపాలనను వికేంద్రీకరించారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలను ఏర్పాటుచేశారు. తండాలనన్నింటీని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న జిల్లాలతో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నది. పల్లెప్రగతిలో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రహదారుల నిర్మాణాలతో తెలంగాణ పల్లెలు నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటింది. అయినా ఈ దేశానికి ఏం కావాలి ? ఈ దేశ ప్రజలకు ఏం కావాలన్న ముందుచూపు కేంద్రంలోని పాలకులకు లేదు. తెలంగాణలో ప్రభుత్వ పథకాల నిధులు నేరుగా ప్రజల జేబుల్లోకి వెళ్తున్నాయి. 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడం మూలంగా గ్రామీణ ఆర్థికవ్యవస్థ కళకళలాడుతున్నది. కేసీఆర్ లాంటి పాలకుడి మూలంగానే ఇది సాధ్యమైంది. అందుకే దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను అమలు చేస్తుంటే, తెలంగాణ పథకాలను పేర్లు మార్చి కేంద్రం అమలు చేస్తున్నది. సామాన్యుల సంక్షేమానికి, రైతుల అభ్యున్నతికి వివిధ రాష్ర్టాలు అడుగులు వేస్తున్నాయంటే దానికి కారణం కేసీఆర్. అందుకే కేసీఆర్ సామాన్యుల స్వప్నాలు తీరుస్తున్న అసామాన్య పాలకుడే కాదు, ఆయన కారణజన్ముడు.
(వ్యాసకర్త: శేరి సుభాష్ రెడ్డి, శాసనమండలి సభ్యులు)