ప్రాంతీయ పక్షాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ఇందుకు అనుగుణంగా వారి చర్యలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశంలో బీజేపీ మాత్రమే ఉంటుంది. మిగిలిన అన్ని పార్టీలూ ధ్వంసమవుతాయి’ అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఎనిమిదేండ్లలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిన దుర్మార్గపు చరిత్ర బీజేపీకి ఉన్నది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడమే కాకుండా, శివసేన అస్తిత్వాన్ని రూపుమాపే రీతిలో తెగబడుతున్నది. సిక్కింతో పాటు పలు ఈశాన్య రాష్ర్టాల్లోనూ ప్రాంతీయ ఆకాంక్షలు దెబ్బ తినే రీతిలో కుట్రలు పన్ని అధికారాన్ని చేజిక్కించుకున్నది. దక్షిణాదిలోని ప్రజల ఆలోచనాతీరు బీజేపీ భావజాలానికి విరుద్ధం గా ఉంటుంది. అయినా కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసి, ఇప్పు డు తెలంగాణలో అధికారం గురించి పగటి కలలు కంటున్నది. ధనబలంతో ఏదైనా సాధించవచ్చనే దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నది.
మన దేశ రాజకీయ వ్యవస్థ ఎవరో ఒకరి కోరిక మేరకో, ఏదో ఒక పార్టీ అవసరాల కోసమో ఏర్పడింది కాదు. భారతీయ సమాజంలోనే భిన్నత్వం ఉన్నది, ఈ భిన్నత్వంలో ఏకత్వమూ ఉన్నది. భిన్న అస్తిత్వాలకు భరోసా కల్పిస్తూనే ఏకత్వాన్ని సాధించే రీతిలో ఏర్పడిన రాజకీయ వ్యవస్థ మనది. కేంద్రం-రాష్ర్టాలతో ఏర్పడిన సమాఖ్య వ్యవస్థ అయినా, భిన్న భాషలకు రాజ్యాంగ హోదా కల్పించడమైనా, భిన్న భావజాలాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షాలు మనగలగడమైనా ఈ బహుళత్వాన్ని గుర్తించడంలో భాగ మే. వామపక్ష రాజకీయమైనా, మితవాద భావజాలమైనా, మతవాద పక్షాలైనా, ప్రాంతీయ పార్టీలైనా ఎవరి వాదన వారు ప్రజల ముందు వివరించి తమకు కట్టబెట్టిన పాత్ర పోషించవచ్చు. ప్రజాస్వామికవేత్త వాల్టేర్ నుడివినట్టు ‘నీవు చెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రాయం చెప్పడానికి నీకున్న హక్కు కోసం నా ప్రాణమిచ్చి పోరాడతా’ అనే సూక్తి ప్రజాస్వామిక భావజాలాని కి, భిన్న సంస్కృతుల జాతుల శాంతియుత సహజీవనానికి పునాది.
ఏడు దశాబ్దాలుగా నేర్పుతో, ఓర్పుతో నిర్మించుకున్న ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలే తప్ప, బీటలు వార్చడానికి ప్రయత్నించకూడదు. మతవాద భావజాలం గల బీజేపీ అధికారానికి రాగలిగిందంటే ప్రజాస్వామిక వ్యవస్థ ఇచ్చిన వెసులుబాటు వల్లనే. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయపక్షాలను నిర్మూలిస్తామంటే అది నియంతృత్వమే అవుతుంది. భిన్నరకాల జీవన సరళి, భిన్న భాషలు, సంస్కృతులు, జాతులు, ఉపజాతులు, తెగలు, భావజాలాలు గల భారతీయ సమాజాన్ని ఏకశిలా స్వరూపంగా భావించి ఏక పార్టీ నియంతృత్వాన్ని నెలకొల్పుతామనుకుంటే అది భ్రమ మాత్రమే. బీజేపీ కుయుక్తులు ఫలించకపోగా, భిన్నవర్గాల నుంచి తీవ్ర ప్రతిస్పందన, ప్రతిఘటన వస్తుంది. బీజేపీ తన విధానాలు మార్చుకోకపోతే, ప్రజలే గుణపాఠం నేర్పుతారు.