21 ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతున్నదా? పురిటినొప్పులు పడుతున్న కాలం మరోసారి కొత్త ఉద్యమానికి నాంది పలుకనున్నదా? జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక ప్రకటనను చూస్తే అందరి మదిలో మెదిలే సందేహాలివి. 2001 ఏప్రిల్‌లో టీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటుచేసినప్పుడు కూడా నిరాశ, నిస్పృహలు, దశ దిశా లేని పరిస్థితులే తెలంగాణలో ఉండేవి. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి టీఆర్ఎస్ తన ఉనికిని యావత్ తెలుగు సమాజం గుర్తించేలా చేసింది. నాటికి 32 ఏండ్ల కిందటే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక మహా ఉద్యమం జరిగిందని, దారుణమైన అణచివేతకు గురైందని కూడా తెలియని తరం అప్పటిది. వారికి తెలంగాణ పాఠాలు చెప్పి, స్వరాష్ట్ర ఉద్యమ సైనికులుగా శిక్షణనిచ్చి, శాంతియుత పంథాలో ఉత్తుంగ తరంగం వంటి ఉద్యమాన్ని నిర్మించి 13 ఏండ్ల స్వల్ప వ్యవధిలో లక్ష్యాన్ని ముద్దాడింది కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్.
ఆ రోజు తెలంగాణ.. ఈ రోజు భారతదేశం! సరిహద్దుల మీదుగా పడగలెత్తిన ఉగ్రవాదం, దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న విధానాలు కొనసాగుతున్న నేపథ్యంలో-75 ఏండ్లలో భారత్ సాధించుకున్న గౌరవం, విలువలు మిగులుతాయా? బీజేపీ మరోసారి గెలిస్తే ఇక దేశ భవిష్యత్తు అంధకారమేనా? అనే భయం, ఆవేదన బుద్ధిజీవుల్లో, ప్రజల్లో, పార్టీల్లో, రాజకీయనేతల్లో గూడుకట్టుకొని ఉన్నది. ఏం చేయాలో ఎవరికీ తెలియని అనిశ్చితి. దేశం ఎదుర్కొంటున్న మహా సంక్షోభం ఇది. మతతత్వ, నిరంకుశ శక్తుల నుంచి తనకు విముక్తి కల్పించే బిడ్డడి కోసం భరతమాత ఎదురుచూస్తున్నది. ఆ పిలుపు కేసీఆర్ విన్నారు. దాని ఫలితమే నిన్నటి చరిత్రాత్మక ప్రకటన.
ఏ ఉద్యమమైనా సకల శక్తులను సమైక్యం చేసి నడిపించే నాయకుడు ఆవిర్భవించే వరకూ వేచి చూడక తప్పదు. అటువంటి నాయకత్వం లభించేవరకూ ఆ ఉద్యమం అనేక రూపాల్లో, చీలికలు పేలికలుగా వ్యక్తమవుతుందే గానీ ఒక బలమైన శక్తిగా ఎదగదు. గాంధీజీ వచ్చేవరకూ జాతీయోద్యమం అలాగే వేచి ఉంది. లోక్‌నాయక్ వచ్చే వరకూ ప్రజాస్వామికశక్తుల పోరాటం అలాగే సాగింది. కేసీఆర్ వచ్చే వరకూ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష అలాగే ఎదురుచూసింది. ఉద్యమంలోని అన్ని విలువలను, శక్తిసామర్థ్యాలను సమున్నతంగా ప్రతిబింబించే శిరస్సు వంటిదే ఉద్యమ నాయకత్వం. శిరస్సు లేకపోతే జీవి ఉనికి ఎలా అసాధ్యమో, నాయకుడు లేని ఉద్యమమూ అంతే. కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు అవసరం పడినప్పుడు మన దేశ ప్రజానీకం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. వలస, నిరంకుశ శక్తులను తుత్తునియలు చేసిన జాగృత జాతి మనది. ఆ మహోజ్వల వారసత్వాన్ని కేసీఆర్ సారథ్యంలో నిలబెట్టుకోవటం ఈనాటి చరిత్రాత్మక అవసరం.