2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు, త్వరలో జరగబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే దేశంలో ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రమే అయినా దాని జనాభా రీత్యా చూస్తే, ప్రపంచంలో 5వ పెద్ద దేశం కింద లెక్క. 80 పార్లమెంటు స్థానాలతో దేశ ప్రధాని ఎవరో నిర్ణయించే స్థితిలో యూపీ ఉంటుంది. అందుకే కొద్దిరోజుల్లో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికలకు అంత ప్రాముఖ్యం ఏర్పడింది.
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ర్టాల్లోని యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ర్టాలలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గత ఎన్నికల్లో మణిపూర్, గోవా రాష్ర్టాల్లో మొదట కాంగ్రెస్‌కే అధికారం దక్కే అవకాశాలుండగా, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపు ఫిరాయించేలా చేసి, ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చిన్న రాష్ర్టాల్లో ఎవరు గెలుస్తారో నికరంగా ఇప్పుడే తెలిసే అవకాశం లేదు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. 2017 కంటే ముందు యూపీలో సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉన్నది. అఖిలేష్‌యాదవ్, అతని బాబా య్ మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా ఆ పార్టీ బలహీనపడింది. మరో వైపు కేంద్రంలో 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉండటంతో యూపీ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో యూపీ నిత్యం వార్తల్లో నిలిచింది. గో సంరక్షణ పేరిట దాడులు, మహిళలపై అత్యాచారాలు, గో మాంసం తింటున్నారనే నెపంతో ముస్లింలపై దాడులు, హత్యలు జరిగాయి. దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యం లోంచే అఖిలేష్ యాదవ్ యూపీలో అధికారం చేపట్టే దిశగా సాగిపోతున్నారు. బీఎస్పీ బలహీనపడటంతో, అక్కడ బీజేపీ, ఎస్పీల మధ్యనే పోటీ అనేలా ప్రస్తుత పరిస్థితి ఉన్నది.
ఈ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకమైనవి. గతంలో గోవా, మణిపూర్ రాష్ర్టాల్లో సరైన వ్యూహం లేక అధికారాన్ని బీజేపీకి అప్పగించింది. అందుకే ఇప్పుడు ఈ రాష్ర్టాల్లో కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నది. గోవా పోటీలోకి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూ ల్ పార్టీలు కూడా దిగుతున్నాయి. ఆప్ గోదాలో ఉన్న మరో కీలక రాష్ట్రం పంజాబ్. ఇక్కడ గెలిచే అవకాశాలు కాంగ్రెస్ లేదా ఆప్లకే అంటున్నారు. పంజాబ్‌లో ఎంత ప్రయత్నించినా బీజేపీకి అవకాశాలు మృగ్యం. ఇక ఉత్తరాఖండ్‌కు వస్తే.. ఐదేండ్లలో అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. కాంగ్రెస్ అంతకుముందు అధికారంలో ఉంది కనుక, ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. ఈసారి ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో కాలుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేసినట్లే, యూపీలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కానీ రెండు పార్టీలకూ ఆశాభంగం తప్పదు. కరోనా కారణంగా ఈ ఎన్నికల్లో పార్టీలకు ప్రత్యక్ష ప్రచారం చేసుకునే వీలు తక్కువ. సామాజిక మాధ్యమాల ప్రచారం ఎవరికి ఎంత మేరకు మేలు చేస్తుందో చూడాలి. ఏదేమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 పార్లమెంటు ఎన్నికలను ప్రభావితం చేస్తాయనటంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: కర్ర ఎల్లారెడ్డి, సీనియర్ న్యాయవాది)