భారీ ఎగుమతుల కారణంగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతన మైతే.. ఎగుమతి అయ్యే బియ్యం పరిమాణం బాగా పెరిగినా కూడా వచ్చే ఆదాయం (విదేశీ మారకద్రవ్యం) మాత్రం పెరగదు. అటువంటప్పుడు, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటం కన్నా 5-10 శాతం సుంకం విధించటం మేలు. వరి ఉత్పత్తికి భారత ప్రభుత్వం భారీ ఎత్తున ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలకయ్యే భారాన్ని ఈ ఆదాయంతో తీర్చుకోవచ్చు. పలు రాష్ర్టాల్లో సాగుకు ఉచిత విద్యుత్తును, సబ్సిడీపై ఎరువులను అందించటం కారణంగా భారత్‌లో తక్కువ ఖర్చుతో బియ్యం ఉత్పత్తి అవుతున్నది. పోటీపరంగా ప్రపంచ మార్కెట్లో భారత్‌కు ఇది సానుకూలతను కల్పిస్తున్నది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచటానికి బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గోధుమల దిగుబడి తగ్గిన నేపథ్యంలో వాటి ధరను అదుపులో పెట్టడం కోసం.. మే 13న గోధుమల ఎగుమతులపైనా కేంద్రం నిషేధం విధించింది. ఈ విధంగా గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధం అనేది ఇదే తొలిసారి కాదు.
2007-08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలనే నాటి ప్రభుత్వం తీసుకున్నది. మళ్లీ ఇప్పుడదే చేసి దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని కొందరు ప్రభు త్వ పెద్దలు అనుకుంటున్నారు. ఇదేక్రమంలో బహుశా వారు వ్యాపారస్థుల వద్ద ఉండే పలురకాల సరుకుల నిల్వలపై నియంత్రణ విధించటం, ఆహారధాన్యాలలో ఫ్యూచర్ ట్రేడింగ్‌ను నిలిపివేయటం వంటి పనులకు కూడా దిగవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే పేరుతో ఇలాంటి చర్యలు తీసుకుంటే.. మార్కెట్ ఆర్థికవ్యవస్థలు ఎలా పని చేస్తాయో, ద్రవ్యోల్బణం వెనుక ఉన్న కారణాలేమిటో ప్రభుత్వ పెద్దలకు తెలియదని వెల్లడవుతుంది.
మొదట మనం బియ్యం సంగతి చూద్దాం. 2021-22లో మన దేశం 21 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) బియ్యం ఎగుమతి చేసింది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో (51.3 ఎంఎంటీ) ఇది 41 శాతం. మన దేశం నుంచి భారీ ఎగుమతుల కారణంగా ప్రపంచ మార్కెట్లో బియ్యం ధరలు మార్చిలో 23 శాతం మేర తగ్గాయి. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లో గోధుమలు 44 శాతం, మక్కజొన్నల ధరలు 27 శాతం పెరిగాయి. బియ్యం అంతర్జాతీయ మార్కెట్‌కు భారత్ నుంచే 25 శాతం కన్నా ఎక్కువ ఎగుమతి అయితే, బియ్యం ప్రపంచ ధరలపై గణనీయమైన ప్రభావం పడుతున్నది. 2022 ఆర్థిక సంవత్సరమే దీనికి స్పష్టమైన ఉదాహరణ. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బియ్యం 354 డాలర్లు మాత్రమే పలికింది. ఇది మన దేశంలో రైతులకు ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర కన్నా తక్కువ. అంటే.. భారత్‌లో బియ్యం ఎగుమతిదారులు రైస్ మిల్లుల నుంచి, రైతుల నుంచి కనీస మద్దతు ధర చెల్లించకుండానే కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారని స్పష్టమవుతున్నది. ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద ఉచితంగా అందించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఎగుమతి చేస్తున్నారనీ తేలుతుంది.
మన దేశంలో ఎరువులపై సబ్సిడీనే తీసుకుంటే.. ఏప్రిల్‌లో ప్రపంచ మార్కెట్లో టన్ను యూరియా ధర 900 డాలర్లు. కానీ, మన దేశంలో రైతులకు 72 డాలర్లకే లభిస్తున్నది. బహుశా ప్రపంచంలోనే యూరియా అతి తక్కువ ధరకు దొరుకుతున్నది మన వద్దే కావచ్చు. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎరువులపై సబ్సిడీల మొత్తం రూ.2 లక్షల కోట్లను దాటవచ్చు. ఈ భారీమొత్తంలో కొంత భాగాన్నైనా బియ్యం ఎగుమతులపై తగిన సుంకం విధించటం ద్వారా రాబట్టుకోవచ్చు. ఇది దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు ఉపకరిస్తుందా?.. లేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే, ద్రవ్యోల్బణానికి కారణాలేమిటో తెలుసుకోవాలి.
మే నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 7.04 శాతంగా నమోదైంది. దీంట్లో ఆహారధాన్యాల వాటా 6.6 శాతం మాత్రమే. ఇందులోనూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా కాని గోధుమలు, బియ్యం వరుసగా 3.11 శాతం, 1.59 శాతం మేర మాత్రమే ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయి. కాబట్టి బియ్యం, గోధుమల ఎగుమతులపై నిషేధం విధించటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టటం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే, ద్రవ్యోల్బణానికి 95 శాతం వరకూ కారణమవుతున్నవి ఇతర అంశాలు. ఉదాహరణకు, కూరగాయల ధరల్లో ద్రవ్యోల్బణం సీపీఐ ద్రవ్యోల్బణంలో 14 శాతానికి కారణమవుతున్నది. ఇది బియ్యం, గోధుమలతో ఏర్పడుతున్న ద్రవ్యోల్బణం కన్నా మూడు రెట్లు ఎక్కువ.
వీటిద్వారా తెలుస్తున్నదేమంటే.. వ్యవసాయ వాణిజ్య విధానాలు తక్షణ చర్యల్లాగా ఉండకుండా, స్థిరమైనవిగా, భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. కూరగాయల వంటి వాటి విషయానికొస్తే.. వాటిలో చాలావరకు త్వరగా పాడైపోతాయి. కాబట్టి మనం సమర్థవంతమైన మార్కెటింగ్ సదుపాయాలను, ప్రాసెసింగ్ సౌకర్యాలను నెలకొల్పి వాటిని అనుసంధానించాలి. కూరగాయల ధరలు పెరిగిపోయినప్పుడు వాటి ప్రాసెస్డ్ ఉత్పత్తులను (ఉదాహరణకు ఉల్లి ధర పెరిగినప్పుడు ఉల్లి పొడిని, ఫ్లేక్స్‌ను) ప్రజలు కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, వాటి ధరలు నిలకడగా ఉంటాయి. అయితే, మనదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ చాలా వెనుకబడి ఉంది.
దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించటం అనేది అంతర్జాతీయంగా చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆహార రంగంలో మనం చాలావరకూ స్వయంసమృద్ధిగా ఉన్నా.. వంటనూనెల్లో అవసరాలను 60 శాతం వరకూ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. వాటిని ఎగుమతి చేసే ఇండొనేషియా మనలాగే నిషేధం విధిస్తే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి, అంతర్జాతీయంగా బాధ్యతాయుతమైన దేశంగా కొనసాగాలనుకుంటే భారత్.. ఈ తరహా నిషేధాలను విధించవద్దు. దానికి బదులు ఎగుమతులపై సుంకాలు వేసి సబ్సిడీల భారాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలా ప్రయోజనం.
– అశోక్ గులాటి, రితికా జనేజా
(వ్యాసకర్తలు: వ్యవసాయశాస్త్రంలో ఇన్ఫోసిస్ చెయిర్ ప్రొఫెసర్, ICRIER రీసెర్చ్ ఫెలో)