దేశంలోని ప్రతి పౌరుడు కేంద్ర, రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు. దానిలో తప్పేం లేదు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏ మేరకు అమలు చేస్తున్నది? అమలు చేస్తే లక్షల దరఖాస్తులు ఎందుకు పెండింగులో ఉంటున్నాయి? అక్కడ పరిస్థితి అలా ఉండగా, రాష్ట్రంలో ఆర్టీఐ కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 88 దరఖాస్తులను దాఖలు చేయటం గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నది. దీనిపై ప్రజల్లోనే, స్వయంగానే బీజేపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
వివిధ రాష్ర్టాల పర్యటనలకు కేసీఆర్ చేసిన ఖర్చు ఎంత? అనే ప్రశ్నను ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్టీఐ ద్వారా సంధించారంటే అంతకంటే అవివేకమైన ప్రశ్న మరొకటి ఉండదు. ఆ మాటకొస్తే ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంత? ప్రధాని మోదీ వేసుకుంటున్న రోజువారీ బట్టలు, మేకప్, ఇతరత్రా ఆహార్యాల ఖర్చు నెలకు రూ.2 కోట్లు అవుతుందని ఓ పత్రిక రాసిం ది. ఈ ఎనిమిదేండ్లలో దేశంలో నిరుద్యోగిత రేటు ఎంతమేర పెరిగింది, కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలెన్ని, కోతపెట్టిన కొలువులెన్ని, ఆకలి సూచీలో మనమెక్కడ ఉన్నాం? ప్రజలపై ధరాభారం ఎందుకు పడుతున్నది? గ్యాస్ సిలండర్ ధర రూ.410 నుంచి రూ.1105కు ఎందుకు పెరిగినట్లు? మోదీ విదేశీ పర్యటనల వల్ల ఆదానీ గ్రూపుల కంపెనీలకు కలిగిన లాభమెంత? మోదీకి, ఆదానీకి మధ్య వ్యాపార మైత్రి ఏమిటి? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఓబీసీల జనగణన ఎప్పుడు? తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, ఓబీసీ గణన బిల్లు ఏమైంది? విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రభుత్వ డిస్కంలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ప్రైవేట్ బొగ్గును రాష్ర్టాలకు బలవంతంగా ఎందుకు కట్టబెడుతున్నారు? అని ఆర్టీఐ కింద ప్రతిపక్షాలు ఎందుకు సమాచారం కోరకూడదు?
దేశంలోని నాయకులతోపాటు, ప్రజలు కూడా సంధించాల్సిన ప్రశ్నలివి. తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్న బండి సంజయ్ కేవలం తెలంగాణ ప్రభుత్వంపై రాజకీయ అక్కసు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమం లో ఆయన వేస్తున్న తప్పటడుగులు, ఆయనకున్న ఆపారమైన అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయి. బీజేపీ జాతీ య కార్యవర్గ సమావేశాల తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తుందనే చర్చ జరగడం కోసమో, లేక చర్చంతా తనవైపే మళ్లాలనే ఉద్దేశంతోనే తప్ప, వివేకం ఉన్న ఏ ప్రజా నాయకుడూ ఈ విధంగా చేయడు. బండి సంజయ్ ఆర్టీఐ కింద దాఖలు చేసిన 88 దరఖాస్తులను చూసి రాజకీయ విశ్లేషకులే కాదు, సామాన్యులు సైతం నవ్వుకుంటున్నారు. నాయకుడికి ముందుచూపు, పార్టీకి వ్యూహం ఉండాలి. కానీ బీజేపీకి ఈ రెండూ లేవని తేటతెల్లమైంది. బండి సంజయ్‌ని చూసి మరో పొలిటికల్ జోకర్ దొరికాడంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.
బండి కోరినట్లుగా సమాచారం ఇవ్వడం పక్కనపెడితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యంపై ఎనిమిదేండ్లుగా వస్తున్న దరఖాస్తులకు కేంద్ర సమాచార హక్కు చట్టం ముందుగా సమాధానం చెప్పాలి. ఇప్పటికే కేంద్రం వద్ద ఆయా శాఖల్లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ‘అగ్నిపథ్’పై కూడా కేంద్ర ఆర్టీఐ కింద దరఖాస్తులు వేస్తే సమాధానం లేదు. ప్రజాహితం కోసం ఆర్టీఐ కింద సమాచారం కోరితే తప్పులేదు. కానీ, ఆ పేర బండి సంజయ్ కేవలం మీడియా ప్రచారం కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఆయన అసలు ఉద్దేశమేమిటో గుర్తిస్తున్నది.
-వెంకట్ గుంటిపల్లి
94949 41001