గణపతి దేవుని కుమార్తెగా
ఓరుగల్లును పాలించి
కాకతీయుల కీర్తి ప్రతిష్టలను
జగద్విఖ్యాతి గాంచిన ఆడబిడ్డ రుద్రమ్మ!
‘రుద్రదేవ మహారాజు’గా
భారతదేశ తొలి మహిళా పాలకురాలై
కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీరనారి!
అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరి
సమస్యలెన్నింటినో అధిగమించిన సమరశీలి
యుద్ధభూమిలో తన కరవాలాన్ని ఝళిపించి
తిరుగుబాటుదారుల అణచివేసిన రౌద్రమూర్తి!
ఒక స్త్రీకి రాజ్యమేల అన్న
పురుషాధిపత్య భావజాలాన్ని
ధిక్కరించిన ధీశాలి
స్వయంగా సైన్యాలను నడిపిస్తూ
భుజశక్తి సామర్థ్యాన్ని
నలుదిశలా చాటిన సాహసి!
దుర్భేద్యమైన కోటలను నిర్మించి
ప్రజారక్షణ కోసం పాటు పడిన ప్రజ్ఞాశాలి
సకల కళల కౌశల్యంతో
కాకతీయ సామ్రాజ్యాన్ని
శాంతి సౌభాగ్యాలతో
విలసిల్లేలా తీర్చిదిద్దిన ప్రతిభాశాలి!
తర తమ భేదం లేక
పరిపాలనా కర్తవ్యదీక్షతో
కదనాన నిలిచిన కార్యశీలి!
రాణీరుద్రమదేవి శౌర్యమే
ఓరుగల్లు ప్రజల అస్తిత్వం
సుపరిపాలనకు నిదర్శనం రుద్రమ్మ!
చరిత్రలో చిరస్థాయి ఘనకీర్తి రుద్రమ్మ!!
-డాక్టర్ కొమర్రాజు
రామలక్ష్మి