హెచ్చరిస్తున్నాను.. జాగ్రత్త
ప్రజాస్వామ్య పాలన అంటే..
అగ్నివంటి విషాన్ని గొంతులో ధరించటమే
51మంది ఓట్లతో గెలిచి
51+49= 100 మందిని సమదృష్టితో పరిపాలించాలె
‘వాకింగ్ ఆన్ ద రోప్’.. కింద నిప్పుల లోయ
చుట్టూ, పైనా కబళించే తుఫాన్
చేతిలో బ్యాలన్సింగ్ స్టిక్ ఉండదు.. ఆదమరిస్తే
శిక్ష కేవలం మరణమే.. రణం ఉండదు
గుర్రం అది.. విశ్వాసంతో రక్షిస్తూనే ఉంటుంది
నువ్వు అసమర్థుడివైతే పడేసి
పెక్క పెక్క తన్ని చంపడమూ చేస్తుంది
‘కిల్లింగ్ ద హార్స్ కాదు.. టు బి కిల్డ్ బై హార్స్’ ఔతావు
గుర్తుంచుకోవాలె.. గుర్రం శాఖాహారి
దాని కండ్లు చిన్నవి.., కాళ్లు సన్నవి..,
కాని యుద్ధాలను జయిస్తూంటుంది
ప్రేమతో స్వారీ చేయడం తెలియాలె వీరునికి-
దేశం.. ప్రజలు.. పరిపాలన.. సర్వజనహితం
అనేవి.. రాజకీయాత్మక దీర్ఘకాలిక వ్యూహరహస్యాలు
‘నీతో.. నీవు లేకుండా’కు
తేడా తెలియాలె నీకు
అరే..ఏడ్చే పిల్లవానికి చాక్లట్లిచ్చి ఎన్నాళ్లు జోకొడ్తావ్
వాడికి చిటికెడు ప్రేమను అందివ్వాలె తల్లిలా
వాడికి ‘ఫైవ్ స్టార్’ ఇండ్లొద్దు
ప్రశాంతమైన చింతచెట్టు గాలీ నీడా చాలు
నువ్వు మనిషిని ఒక ‘ఓటు’గా గుర్తిస్తున్నావని తెలిస్తే
వాడు గుర్రమై వెనక్కాళ్లతో జాడించి తంతాడు
ఇక బంగాళాఖాతమే నీ గతి
అన్నీ ఉపరితల ఆవర్తనాలూ,
సుడిగుండాలూ, హారికేన్లే-
ప్రజలు నీకు చదరంగ ప్రత్యర్థులు కారు
వాళ్లు వెంట నడచి వచ్చే సైనికులు
ఎప్పుడూ వీపు వెనుకే సాయుధులై ఉంటారు
మనుషుల్ని మభ్యపెట్టడం ఒక వ్యూహమనీ
భావించి నువ్వు తలను ఎగరేస్తూంటే
జనం రోడ్డు పక్కనున్న కంకర రాళ్లవైపు చూస్తారు-
చరిత్ర ఎప్పుడో వంచనతో, హింసతో కుళ్లిపోయింది
భ్రాంతీ.. మిథ్యా.. ఇవన్నీ మాయ
సత్యమొక్కటే సత్యం
నువ్వో గొప్ప ‘ఐకాన్’వే కావచ్చు.. కాని
ఒకనాటికి ‘డిలీట్’ చేయబడ్తావు తప్పక
పాలకుడెప్పుడూ గరళకంఠుడే కావాలె
లేకుంటే కాలప్రళయంలో కొట్టుకుపోతాడు.. పిపీలికమై-