త్యాగపూరితం.. నాంచారమ్మ చరితం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన గిరిజన తెగల ఆచార వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తున్నది. ఎరుకల తెగ శతాబ్దాలుగా జరుపుకొంటున్న పిలాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరను కూడా ఘనంగా నిర్వహించటం హర్షణీయం.
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రహదారిలో ఘట్కేసర్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో పిలాయిపల్లి ఉన్నది. ఈ గ్రామ సమీపంలో ఉన్న ‘ఎరుకల బండ’ ప్రదేశమే ఎరుకల నాంచారమ్మ దేవత నెలవు. ఈ దేవతకు సంబంధించి ప్రచారంలో ఉన్న జానపద గాథ ప్రకారం.. సుమారు మూడు శతాబ్దాలకు పూర్వం ఈ తెగ ప్రజలు ఇక్కడ నివసించేవారు. వారు అనేక సమస్యలతో సతమతమయ్యేవారు. అలాంటి సమయంలో ఎరుకల నాంచారమ్మ తన భర్తను, అత్త మామలను కూడా ఎదిరించి, తన వృత్తి ధర్మాన్ని ఎంచుకొని, ప్రజలకు సోది చెప్పడానికై దేశసంచారం చేశారు. ఆ క్రమంలోనే పిలాయిపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామ తెగ ప్రజలు తమ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుమని ఆమెను వేడుకున్నారు.
ఐదు నెలల గర్భిణిని అమ్మవారికి బలిస్తే వారి సమస్యలు తీరుతాయని నాంచారమ్మ చెప్పారు. ఆనాటికి ఎరుకల నాంచారమ్మ కూడా ఐదు నెలల గర్భిణిగా ఉండటం గమనించిన గ్రామస్థులు ఆమెనే బలి ఇచ్చి, తమ సమస్యల నుంచి బయటపడి భాగ్యవంతులయ్యారని ఈ గాథ చెబుతున్నది. ప్రాణాలను త్యాగం చేసి తమకు జీవితాన్నిచ్చిన నాంచారమ్మకు ఎరుకలు ఏటా జాతరలో పూజలు చేస్తూ వస్తున్నారు. నాంచారమ్మను బలి ఇచ్చిన ‘పరుపుబండ’కు ‘ఎరుకలబండ’ అనే పేరు వచ్చిందని ప్రతీతి.
నేడు ‘ఎరుకల నాంచారమ్మ’గా పూజలందుకుంటున్న విగ్రహం ఆదిలాబాద్ జిల్లా అవతల మహారాష్ట్రలో ఉన్న మాహూరమ్మను పోలి ఉంటుంది. ఈ విగ్రహం తల భాగం మాత్రమే కనిపిస్తున్నది. కాకతీయుల కాలం (12వశతాబ్దం) నాటి సాంఘిక పరిస్థితులను వర్ణించే వల్లభిరాయని ‘క్రీడాభిరామం’ వీధి నాటకంలో కూడా ఏకవీర, కాకతమ్మలతోపాటుగా మాహూరమ్మ పూజింపబడినట్లు ప్రస్తావనలున్నాయి. ఇదిలా ఉండగా, అమ్మవారికి కుడివైపు ఉన్న పురుష విగ్రహాన్ని ఎరుకల నాంచారమ్మ భర్త సోడలయ్యదిగా చెప్తారు.
నాంచారమ్మ దేవతకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎరుకలు మే నెలలో వైశాఖ పౌర్ణమినాడు జాతర జరుపుతారు. జాతర జరిగే మూడు రోజుల్లో మొదటి రోజు సాయంత్రం ఎరుకల పెద్దలు సమీప అడవిలో నుంచి పాల మొగురం, పుట్టమన్ను తెస్తారు. రెండవ రోజు ఎరుకలబండ వద్ద ఒక గద్దెను నిర్మించి దాని మీద మొగురం నిలుపుతారు. దాని చుట్టూ అలికి, పసుపు కుంకుమ బొట్లతో పూజించి రంగాన్ని సిద్ధం చేసుకుంటారు. మూడవ రోజు, అనగా వైశాఖ పౌర్ణమినాడు చుట్టుపక్కల గ్రామాల ఎరుకలు, ఇతర భక్తులు ఎరుకలబండ వద్దకు చేరుకొని పూజలు చేస్తారు. పిలాయిపల్లి ఎరుకలు సుమారు 50 బోనాలతో ఎరుకలబండ వద్దకు వాయిద్యాల చప్పుళ్ళు, కోలాటాల ప్రదర్శనలు, పోతురాజుల వీరంగాలతో సాయంత్రం ఊరేగింపుగా వెళ్తారు. నాంచారమ్మకు మొక్కి కోరికలు తీరిన వారు కూడా మరో 50 బోనాలతో, ఎరుకలతో కలిసి ఎరుకల నాంచారమ్మ తల్లిని కొలువడానికి వెళ్తారు.
బోనాలు అమ్మవారి దగ్గరికి చేరుకున్న తర్వాత ఎరుకల పూజారులు నాంచారమ్మకు ప్రత్యేక పూజలు చేస్తుండగా ఎరుకల కుల పెద్ద అమ్మవారికి బట్టలు, గాజులు, నగలు సమర్పించి తమ జాతిని చల్లగా చూడాలని వేడుకుంటారు. ఈ సమయంలోనే
ఎరుకలబండ గద్దె ముందు స్థలంలో రకరకాల వాయిద్యాల చప్పుళ్ళ మధ్య భక్తులు కోలాటాలు, పోతురాజుల వీరంగాల ప్రదర్శనలు నిర్వహిస్తారు.
వైశాఖ పౌర్ణమి నాడు ఎరుకల నాంచారమ్మ గద్దె వద్ద ఉన్న గుడిలోని అమ్మవారి విగ్రహం వద్ద పొద్దున్నుంచే వేలాదిమంది పూజలు నిర్వహిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థికసాయంతో నిర్వాహకులు భక్తులందరికీ ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాంచారమ్మ జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. వైశాఖ పౌర్ణమి మరునాడు మాత్రం కేవలం పిలాయిపల్లికి చెందిన వారు ‘వన భోజనం’ పేరిట విందులు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత, జానపద వీరగాథల నేపథ్యంగా జరుగుతున్న జాతరలకు ప్రభుత్వపరంగా మంచి ఆదరణ లభిస్తున్నది. ఇది ఆహ్వానించదగిన పరిణామం.
-డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ , 94909 57078
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

