రైతు ఆరుగాలం శ్రమను అపహాస్యం చేసి,
బక్కచిక్కిన బీదోడిపై ఉక్కుపాదమై
తొక్కనీకి జూస్తున్నరు..
నూకలు తినుడు మాకు కొత్త కాదు,
కొన్నేళ్ల దాకా అవే తిని బతికినం,
కలో, గంజో తాగి బతుకీడ్చినం,
ఇగో ఇప్పుడు
ఉడుకుడుకు బువ్వల నెయ్యేసి తింటున్న
మారిన మా బత్కులను చూసి ఓర్వలేక
కండ్లల్ల జిల్లేడు పాలు పోసుకుంటున్నరు,
మా బతుకుల్లో స్ట్రా వేసి రక్తాన్ని పీల్చుకుంట..
మధ్యలో మా మాంసాన్ని నంజుకొని తింటున్నరు,
ఆనక బిర్రుగ ఆవలించుకుంట కారుకూతలు కూస్తున్నరు.
అవమానాలు, అవహేళనలు,
అవరోధాలు, అడ్డంకులు మీరెన్ని సృష్టించినా..
కర్షకులం మేం తిరగబడితే తోకముడిచే మార్జాలాలు మీరు,
మా చిరుగాలికి సైతం వణికిపోయే చిగురుటాకులు మీరు..
గతం నిరూపితం ఖబడ్దార్….!
ఉగాది పచ్చడి, ఈద్ సేమ్యాలు ఒకరికొకరు
పంచుకుతిన్నోళ్లు, అలావా సుట్టూ కూడి,
అసైదులా దరువుకు గజ్జెకట్టి ఆడిపాడి,
పీర్ల తాపిచ్చుకున్నోళ్ళు,
మీ ముదనష్టపు ముచ్చట్లినుకుంట, కొట్టుకుంట
పిట్టలోలే రాలిపోతున్నరు.
ఐనా మీరు, మరణ మృదంగపు మోతను ఆపరు,
మారణ హోమపు జ్వాలను ఆర్పరు,
అల్పజీవి రుధిరానికి రుచి మరిగిన ద్వయమా…
మా బరిగీసి నిలవడి తెగించి కొట్లాడే తీరు
లోకానికి ఎరుక.
జర సైసు.. మీ నూకల లెక్కలు సుత జల్దే తేల్చుతం..
-జాబేర్ పాషా మస్కట్ (ఒమన్)