e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home ఎడిట్‌ పేజీ ఒమిక్రాన్‌.. బహుపరాక్‌!

ఒమిక్రాన్‌.. బహుపరాక్‌!

కరోనా పీడ ప్రపంచాన్ని వదిలేలా లేదు. దక్షిణాఫ్రికాలో ఈ నెల 24న బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రపంచం హడలిపోతున్నది. ఆరు రోజుల్లోనే బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయెల్‌ తదితర 13 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. యూరప్‌లో అధిక ప్రభావం ఉండటంతో అక్కడి దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. ఒమిక్రాన్‌తో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఎదురుకావచ్చని, ఇందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపం చ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇంతకుముందటి వేరియంట్లకన్నా ఒమిక్రాన్‌ ప్రమాదకరమైనదా? దాని బారినపడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కూడా ఇది సంక్రమించే అవకాశం ఉందనే అభిప్రాయం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. వారిలో సంక్రమణ రేటు తక్కువగా ఉంటున్నదనేది మాత్రం ఊరటనిస్తున్నది.

దేశంలో కరోనా వ్యాప్తి రెండు దశల్లోనూ మోదీ సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించింది. ప్రపంచ దేశాలను కరోనా చుట్టేస్తున్నా, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయటంలో జాప్యం చేసింది. మతపరమైన సమ్మేళనాలు జరగకుండా గట్టి ముందస్తు చర్యలు తీసుకోలేదు. కరీంనగర్‌లో కరోనా ఆచూకీని తెలంగాణ పోలీసులు కనిపెట్టి హెచ్చరించేవరకు విదేశీయుల నుంచి సోకుతున్నదని కేంద్రం పసిగట్టలేకపోయింది. అప్పటికే వైరస్‌ దేశంలోకి ప్రవేశించింది. లాక్‌డౌన్లు, ఆంక్షలతో ఉధృతి తగ్గిన తర్వాత, సెకండ్‌ వేవ్‌కు ముందు లభించిన వెసులుబాటును కూడా కేంద్రం ఉపయోగించుకోలేక పోయింది. కరోనా భయంలోనూ వ్యాక్సినేషన్‌ పట్ల అనేక మంది లో నిరాసక్తత వ్యక్తమైందీ అంటే కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత ఎంత దెబ్బతిన్నదో తెలుస్తున్నది.

- Advertisement -

గతంలో కరోనా వ్యాప్తి సందర్భంగా ఆరోగ్య సంరక్షణలోనూ, ఆర్థికరంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రశంసనీయమైనది. ప్రజలు భయభ్రాంతులు కాకుండా, ధైర్యం చెప్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వేగం గా వైద్య వ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల కరోనాను ఎదుర్కొన డం సులభమైంది. ఇంటింటి జ్వర సర్వే వంటి వినూత్న విధానాలకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు. వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మొదలుకొని అన్ని విభాగాలు అంకితభావంతో పనిచేశాయి. ప్రజలు కూడా కేసీఆర్‌ సూచనలను అర్థం చేసుకొని తదనుగుణంగా స్వీయ క్రమశిక్షణను పాటించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో శానిటైజేషన్‌, మాస్క్‌, భౌతికదూరం వంటి ముందు జాగ్రత్తలు పాటించాలి. ఒమిక్రాన్‌ ఎంత భీకరరూపంలో వచ్చినా సరే, తెలంగాణ సమాజం ధైర్యంగా ఎదుర్కొనగలదని నిరూపిద్దాం. ఆరోగ్యాన్ని, ఆర్థికవ్యవస్థను కాపాడుకుందాం.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement