e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home ఎడిట్‌ పేజీ విద్యుత్‌ సంస్కరణల బిల్లు వినాశనానికే..

విద్యుత్‌ సంస్కరణల బిల్లు వినాశనానికే..

ఏడాది కాలంగా ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతల అలుపెరుగని ఉద్యమానికి జడిసి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ, రైతు ఉద్యమకారులు ఒక్క వ్యవసాయ చట్టాలే కాదు, ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణల బిల్లును కూడా వెనుకకు తీసుకుంటే తప్ప పోరాటం విరమించేది లేదంటున్నారు.

ద్రం ప్రతిపాదించిన ‘విద్యుత్‌ చట్ట సవరణల బిల్లు’ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా ద్వారా రాష్ర్టాలకు సంక్రమించిన అధికారాలను కబళించబోతున్నది. ఇప్పటికే తెలంగాణ, బెంగాల్‌ సహా 13 రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆయా రాష్ర్టాల పేద మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయదారులకు జరిగే నష్టం గురించి కేంద్రానికి సవివరంగా లేఖలు రాశారు. ఇటువంటి బిల్లు తేవడమంటే రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్‌ స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ చట్ట సవరణల్లో ముఖ్యమైనది, రాష్ర్టాల్లోని విద్యుత్‌ పంపిణీ వ్యాపార వ్యవహారాలను నిర్వహించే ప్రభుత్వ రంగ డిస్కమ్‌లకు పోటీగా ప్రైవేటు సంస్థలను అనుమతించడం. దీంతో ఒక ప్రాంతం లో నివసించే వినియోగదారులు తనకు నచ్చిన విద్యుత్‌ పంపిణీ సంస్థ నుంచి కరెంటు తీసుకునే సౌలభ్యం ఏర్పడుతుందని కేంద్రం చెప్తున్నప్పటికీ, దీనివెనుక చీకటి కోణాలెన్నో… ఉదాహరణకు, లాభాలు వచ్చే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో విద్యుత్‌ పంపిణీ వ్యాపారం చేసుకుంటామని ఒక ప్రైవేటు సంస్థ ముందుకువచ్చిందనుకుందాం. ఇందుకు ఆ సంస్థ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ సంస్థ నుంచి అనుమతి పొందితే చాలు. కొత్త నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసుకోనవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వ డిస్కమ్‌ అభివృద్ధి చేసిన నెట్‌వర్క్‌కు కొంత సొమ్ము చెల్లించి వ్యాపారం చేసుకోవొచ్చు. వ్యవసాయరంగ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, పంపులు సహా మొత్తం రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కోసం నిర్మించిన విద్యుత్‌ ప్రాజెక్టుల పెట్టుబడులతో గానీ, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో గానీ ఆ ప్రైవేటు సంస్థకు బాధ్యత ఉండదు. దీంతో తెలంగాణ భారీ విద్యుత్‌ అవసరాల కోసం కుదుర్చుకున్న అనేక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాని స్థితి.

ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ప్రభుత్వ డిస్కమ్‌లు, పారిశ్రామిక వ్యాపారవర్గాల విద్యుత్‌ వినియోగదారుల నుంచి కొంత ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నాయి. వ్యవసాయ, దిగువ తరగతి గృహ వినియోగదారుల నుంచి తక్కువ చార్జీలు వసూలు చేసి, మిగిలిన లోటును కొంతమేర ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో, బడ్జెట్‌ నుంచి తీసుకుని సంస్థలను నడిపిస్తున్నాయి. కేంద్రం కొత్త చట్టాన్ని అమలులోకి తెస్తే ఇది సాధ్యం కాదు.

ఈ బిల్లు ప్రతిపాదించిన చట్ట సవరణల్లో మరొ క హానికరమైన సవరణ పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు లక్ష్యం. దేశంలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను బట్టి డిస్కమ్‌లు జరిపే మొత్తం విద్యుత్‌ కొనుగోళ్లలో ఎంతమేర ఈ పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు ఉండవచ్చన్న అంశం ఇప్పటిదాకా రాష్ర్టాల విద్యుత్‌ రెగ్యులేటరీలు నిర్ణయిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే, దేశం మొత్తానికీ కలిపి ఆయా రాష్ర్టాల స్థానిక వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా కేంద్రమే నిర్ణయించి లక్ష్యాలు పెడుతుంది. రాష్ర్టా లు విఫలమైతే భారీ మొత్తంలో పెనాలిటీ వేస్తుంది.

ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో ఉన్న విద్యుత్‌రంగాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కేంద్రం ఈ బిల్లులో మరికొన్ని సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలోని సభ్యుల ను కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. అంటే, ఆయా రాష్ర్టాల్లో అమలుకావలసిన విద్యుత్‌ ధరలను, సంబంధిత ఆదేశాలను కేంద్ర ప్రతినిధులే నిర్ణయిస్తారు. అంతేకాదు, రాష్ట్రంలోని వివిధరంగాల విద్యుత్‌ వినియోగదారుల అవసరాల మేరకు రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరాను నియంత్రించే రాష్ట్ర లోడ్‌ డిస్పా చ్‌ సెంటర్‌ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ చేతుల్లోకి వెళ్లిపోతాయి. పర్యవసానంగా, రాష్ట్రంలోని ఏ ప్రాం తానికి ఎప్పుడు ఎలా విద్యుత్‌ సరఫరా చేయాలో కేంద్ర ప్రభు త్వ సంస్థలే నిర్ణయిస్తాయి.

విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఒక్కసారి ప్రైవేటీకరణ మొదలైతే, ఉద్యోగుల తొలగింపు కూడా మొదలవుతుంది. రాష్ట్రంలో దీని పర్యవసానాలు మరింత దారుణంగా ఉంటాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ సంస్థల్లో వందలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసింది. కేంద్ర విధానాలతో మొత్తంగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలోని వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఈ శీతాకాలం పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్న విద్యుత్‌ సవరణ చట్టం-2021ని రద్దుచేయించడానికి రైతులకు తోడుగా విద్యుత్‌ కార్మికులు, పేద విద్యుత్‌ వినియోగదారులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలి. కేంద్రానికి విద్యుత్‌ అనే అంశం అధికారానికి సంబంధించినదేమో కానీ తెలంగాణకు మాత్రం జీవనర్మణ సమస్య.

(వ్యాసకర్త: తుల్జారాం సింగ్‌ ఠాకూర్‌ , 78930 05313 తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement