సమాజంలోని ‘అందరికీ విద్య’ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటైంది. గత 43 ఏండ్లుగా వివిధ కారణాల వల్ల రెగ్యులర్ చదువుకు దూరమైన ఎందరినో ఈ విశ్వవిద్యాలయం అమ్మ ఒడిలా ఆదరించింది. కాగా, ఈ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవం సెప్టెంబర్ 30న జరిగింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ విశ్వవిద్యాలయం ఎందరో ఐఏఎస్ అధికారులను తయారు చేసింది. ఆదివాసీ బిడ్డలకు విద్యను చేరువ చేసింది. అంతేకాదు, విద్యార్థులకు మూడు భాషల ద్వారా డిగ్రీ విద్యను అందిస్తున్న యూనివర్సిటీ ఇదే కావడం విశేషం. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యతోపాటు సేవలు అందుతున్నాయి. దేశంలోనే మొట్టమొదట హెడ్‌క్వార్టర్స్ క్యాంపస్‌లో సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి బీఎస్సీ లాంటి సైన్స్ కోర్సులను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకమైన రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 6 ప్రత్యేక మహిళా అధ్యయన సెంటర్లను విద్యాలయం నిర్వహిస్తున్నది. విద్య ప్రైవేటీకరణ జరగడంతో చాలామంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక భారం భరించలేక చదువు మానేసిండ్రు. అట్లా చదువు ఆపేసినవారికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండగా నిలబడింది. వారిని విద్యావంతులుగా, ఉద్యోగస్థులుగా తీర్చిదిద్దింది.
సామాజిక న్యాయం చేయాలనే బాధ్యతతో జైళ్లలోని ఖైదీలకు ఉచితంగా విద్యను అందిస్తున్నది. తెలంగాణలోని చర్లపల్లి కారాగారంలో ఖైదీలకు డిగ్రీ, పీజీ కోర్సుల ద్వారా విద్యనందిస్తున్నది. దేశ రక్షణ కోసం త్యాగాలు చేసే సైనికుల కోసం సికింద్రాబాద్‌లోని ఏవోసీ సెంటర్లో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి వారికి ఉచిత విద్య అందిస్తున్నది. సైనికులతోపాటు వారి కుటుంబ సభ్యులూ డిగ్రీ, పీజీలు చేసే అవకాశం కల్పించింది. గ్రూప్-1, గ్రూప్-2, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం తక్కువ వ్యయంతో పోటీ పరీక్షల మెటీరియల్‌ని వేలాది మంది నిరుద్యోగులకు అందిస్తున్నది.
ఆధునిక అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి దూరప్రాంతాల్లోని వారు సైతం చదువుకోవడానికి వీలుగా వెబ్ రేడియో, టీ-శాట్, విద్య నిపుణ ఛానెల్, యూట్యూబ్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. ప్రింట్ మెటీరియల్ అందించడమే గాకుండా కౌన్సెలింగ్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు నిరంతరం అందుబాటులో బోధకులు ఉండేలా యూనివర్సిటీ చూస్తున్నది.
సమకాలీన పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సవాళ్ల గురించి బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులకు విభిన్నమైన జనరిక్ కోర్సుల ద్వారా దేశాభివృద్ధికి అవసరమైన సమకాలీన అంశాలను బోధిస్తున్నది. సాంకేతికతను ఉపయోగించి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై సర్టిఫికెట్లు అందుకునే వరకు ఆన్లైన్ ద్వారానే విద్యార్థులకు సేవలందిస్తున్నది. గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్నది. 2025-2026 సంవత్సరంలో ప్రివెంటివ్ ట్రైబ్స్ చెంచు, గోండు, కొల్లాం, తౌటి కొండారెడ్డి, కోయ జాతులైన ఆదిమ తెగలకు, దివ్యాంగులకు ఉచితంగా విద్యను అందిస్తున్నది. ఉట్నూరు, ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లో సైతం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థుల వద్దకే విద్యను తీసుకొచ్చిన ఘనత అంబేద్కర్ యూనివర్సిటీకి దక్కుతుంది.
ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. వారిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉండటం విశ్వవిద్యాలయ ఘనతకు నిదర్శనం. ఇక్కడ చదువుకున్నవారిలో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి తదితరులున్నారు. వీళ్లేగాకుండా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేస్తున్నవారిలో అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు ఎందరో ఉన్నారు.
ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలందుకున్నారు. ఇంత వరకు జరిగిన 25 స్నాతకోత్సవాల్లో అనేక మంది నిపుణులకు డాక్టరేట్ ఇచ్చి యూనివర్సిటీ సత్కరించింది. అట్లా డాక్టరేట్ పొందినవారిలో ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి రామానుజరావు లాంటి తెలుగు సాహితీవేత్తలున్నారు. వర్సిటీ 26వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా వాగ్గేయకారులు గోరటి వెంకన్న, సుప్రసిద్ధ విద్యావేత్త ప్రేమ్ రావత్‌లు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
– డాక్టర్ వెంకటేశ్వర్లు