కాయ చెట్టుకే ఉంటే
ఆకలి తీరట కల్ల..!
కడుపుల సల్ల కదలని నేతుంటే
కడుపు సల్లబడుట ఎల్లా..?
‘చేతి’కిచ్చిన రాతను చేజేతులా చెరిపి
‘గీత’ మార్పుల కోసం గోడ దూకిన తీరు
కొత్త కండువా నీడన ‘చెత్త’ పోగేసేటి ఆట
మధ్యలోన మలిపేస్తూ మురిపించెనటా..
ఎన్నికైన నేత పదవెందుకొదిలెనో…
మల్లిన్ని ఖర్చులతో బరిలెందుకు నిలిచెనో
ఓట్లేసి గెలిపిస్తే కుర్చీనే తన్నెగా
గెలిపించినోళ్ల కళ్లల్ల కారం ముద్ద పెట్టెగా
గాసమిచ్చేటోడు లేక ప్రజలు గోస పడగ
గోపాలు జాడలేక దీనంగా చూడగా
పండుగల నాడేమో పస్తులతో పండబెట్టే
ఓట్ల పండుగకు మాత్రం ఉరికురికి రాబట్టే
ముట్టినా ముడుపులు నట్టింటికే రాగా
పెట్టిపుట్టిన బతుకులు నాట్యమాడుతూ తీరగా
ఎన్ని మారిన మారని తలరాతల జనులు
మళ్లేమి జరుగుద్దో తెలియక బిత్తర చూపులు
మునిగేది తేలేది ఇప్పటికెవ్వరో గానీ
అన్ని దారులు మాత్రం ఇంటింటికీ రాగా
గోడు వెల్లబోసుకునేటి మునుగోడు తీరిది
మళ్లోమారు మునుగకుండా
చూసుకోవాల్సింది జనాలే మరి.
ఆర్సీహెచ్: 93466 20095