ప్రచారపర్వం ముగిసింది. రణగొణి ఆగిపోయింది. ఇక అంతా మౌనం. అటు ఓటరులో విచికిత్స. ఇటు లీడరులో ఉత్కంఠ. ఇది అందరి విషయం. లేనిది ఉన్నట్టు ఊహించుకొని ఏవేవో ఆశలు పెంచుకున్నోళ్ల, ఉన్నది తెలుసుకోలేక ఉరుకులాడే వాళ్ల సంగతి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అలా కాదు. మిగతావారి ప్రచారమంతా ఒకెత్తు. ఆయన ప్రచారం ఒకెత్తు. 70 ఏండ్ల వయసులో అంతా తానై చేసిన ప్రచారమది. సుడిగాలిలా రాష్ట్రమంతా చుట్టివచ్చారు. మూలమూలనా తన సందేశం వినిపించారు. ఒక బాధ్యత గల తండ్రి తన బిడ్డలకు ఎలా ప్రపంచం లోతుపాతులను వివరిస్తారో అచ్చం అలాగే అనునయంగా విప్పి చెప్పారు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు? ఒక్కమాటలో చెప్పాలంటే అప్రమత్తంగా లేకపోతే ఇన్నాళ్లుగా సాధించిన విజయాలు ఈనగాచి నక్కలపాలు చేసినట్టవుతుందని హెచ్చరించారు. ఎందుకంటే పచ్చబడ్డ తెలంగాణ చూసి కొందరు దురాశాపరులకు నోరూరుతున్నది. వారు కట్టగట్టుకుని వస్తున్నారు. వారందరికీ దీటైన సమాధానం చెప్పేది, చెప్పింది, చెప్పబోయేది సీఎం కేసీఆర్ ఒక్కరే. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించుకున్నం. గత పదేండ్లలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచాం. మోసపోతే గోసపడుతం. ఇదీ ఆయన మాటల సారాంశం. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరబాటోయి’ అనే సినీగేయ పంక్తి ప్రస్తుత తెలంగాణ సందర్భానికి సరిగా సరిపోతుంది. చేసింది ఎంతో ఉన్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అనేదే ఆయన ప్రచారానికి మూలాధారమైంది.
బూటకపు ప్రచారాలతో ఊదరగట్టే మాయగాళ్లొస్తున్నారు. చేతకాని హమీలతో టోకరా ఇచ్చే దగుల్బాజీలు ఓటు మీద కన్నేసి తిరుగుతున్నారు. ధరణిని లేకుండా చేసి భూ యజమాన్యాన్ని మళ్లీ గందరగోళ పర్చాలని చూస్తున్నారు. మూడు పంటల కరెంటును మూడు గంటలకు కుదించి కరెంటు షాట్ల, పాము కాట్ల రోజులకు మళ్లీ తెర తీస్తామంటున్నారు. రైతుబంధు దుబారా అంటూ పంట సాయానికి మంటపెట్టాలని చూస్తున్నారు. నమ్మితే అమ్మేస్తరు. పబ్బం గడుపుకొని అవతల పడుతరు. తెలంగాణ కోసం ఎన్నడూ కాలు కదపనివారు, ఉద్యమంపై తూటాలు ఎక్కుపెట్టినవారు, తెలంగాణ లోపలి శత్రువులు, బయటి శత్రువులు అనైతికంగా చేతులు కలిపి ఒక్కటై దండెత్తి వస్తున్నారు. ఇది దీక్షా సమయం. పరీక్షా సమయం. మేలుకొని ఉండాల్సిన గడియలు. శత్రువును ఓటుపోటుతో తరిమికొట్టాల్సిన తరుణం. మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించి ప్రగతి ప్రస్థానాన్ని మున్ముందుకు నడిపించాల్సి ఉంది. లేకపోతే రైతులే కాదు మొత్తంగా తెలంగాణే ఆగమవుతుంది.
ఢిల్లీ గులాములు వస్తున్నారు. వంగి సలాములు చేస్తున్నారు. ఒక్కచాన్స్ అంటూ దీనంగా దేబిరిస్తున్నారు. అధికార దాహంతో, పదవీ విరహంతో ప్రేలాపనలకు దిగజారుతున్నారు. చిన్నా, పెద్దా తేడా తెలియకుండా మాటలు తూలుతున్నారు. అర్థంపర్థం లేని ఆరోపణలతో గందరగోళపర్చి అధికారం కొట్టేద్దామని ఎగబడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ పరిస్థితిని కుటుంబసభ్యులతో ఇరుగుపొరుగుతో బేరీజు వేసుకొని సంయమనంతో ఓటు వేసి ముచ్చటగా మూడోసారి గెలిపించమని సవినయంగా మనవి చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఓటరుకు తనవారెవరో, పరవారెవరో తెలుసు. తెలంగాణ కోసం నిలిచింది ఎవరో, తెలంగాణను నిలువునా ముంచింది ఎవరో అర్థం చేసుకునే తెలివిడి వారికి ఉంది.