వాన వెలిశాక మట్టి వాసన, ఆరుద్ర పురుగుల సర్కస్ ఫీట్లు, పిచ్చుకల మట్టి స్నానాలు, వెన్నెల్లో ఆడిన ఆటలు, ఎండకాలం బావుల్లో ఈతలు ఈనాడేవి? మన చిన్నతనం మనకు చిన్నతనం కాదు. బాల్యం మళ్లీ రమ్మంటే వస్తుందా? ‘అనుభూతులను పోగొట్టుకున్న గుండె ఎడారి. అనుభూతులను పదిలపరచుకున్న గుండె సతత హరితారణ్యం’. ఇటువంటి మధురమైన భావాల సుమమాల డాక్టర్ నలిమెల భాస్కర్ ‘సుద్దముక్క’.
ఈ పుస్తకంలో శ్రామిక జనజీవన చిత్రణం ఆర్ద్రంగా ఉంటుంది. శ్రామికుల రుణం తీర్చుకోవాలనిపించేలా చేస్తుంది. తమ బతుకులను బండలకేసి బాదుకుంటూ మన బట్టలను గట్టున ఆరేస్తారు రజకులు. మన బట్టలను పిండి వాళ్లు తోలు బొమ్మలవుతారు. వాళ్లుతికిన దుస్తులతో మనం మన లోపలి ముఖాన్నీ, మురికినీ చాటు చేసుకొని రోజూ నాగరికులమవుతాం. ఎవరి బట్టలను వారికి, తప్పిపోకుండా అందించే అమోఘమైన జ్ఞాపకశక్తి వారిది. ‘సమాజ కల్మషాన్ని కడిగివేయడానికి/ కంకణధారులైన వ్యక్తులు సంస్కర్తలైనప్పుడు/ తరతరాలుగా మైలబట్టల్ని/ మల్లెపూలు ఉల్లిపొరలూ చేసేందుకు/ కటి బద్ధులైన వీళ్ళూ సంస్కర్తలే’.
ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే.. ఉపాధ్యాయుని గురించి, సుద్దముక్క గురించి రాసిన ఆరు కవితలు మరొకెత్తు. ఆ ఆరు కవితలలో ఉపాధ్యాయున్ని ప్రపంచాన అగ్రభాగాన నిలిపారు నలిమెల. అధ్యాపకునికి అక్షరాభిషేకం చేశారు. ‘అతడు కాలుమోపడం తోటే అణువణువూ అక్షరమవుతుంది/ అతని మాటల రెక్కల మీద/ పిల్లలు అత్యంత సురక్షితంగా/ జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు’ అని ఉపాధ్యాయుడి ఔన్నత్యాన్నీ, ‘క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారీ/ అతని కుడిచేతికి ఆరో వేలు/ అదనంగా మొలుస్తుంది/ అది కచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే’ అని చాక్‌పీస్ ప్రాధాన్యాన్ని వెల్లడిస్తారు.
సుద్దముక్క సూర్యగోళం నుంచి కోసుకొచ్చిన రశ్మి శకలం. చందమామ నుంచి తీసుకొచ్చిన వెన్నెలగడ్డ అన్నప్పుడు భాస్కర్ కవిత్వం తారస్థాయికి చేరుతుంది. సౌందర్యోపేతం అవుతుంది. చాక్‌పీస్ విద్యార్థులకు ‘సమస్తమైన దిక్కులను నిర్దేశించగల చుక్కాని/ తరగతికి వెళ్లే ఉపాధ్యాయునికి ఊపిరి గుళిక/ ఉపన్యాసకులకు ఊతకర్ర’.
భాస్కర్ దృష్టిలో ఈ భూమండలం మీద ఏకైక లోకైక దర్శనీయ స్థలం ‘బడి’. ‘సుద్దముక్క’ తెలుగు కవిత్వంలో ఓ వజ్రపు తునక. ఇందులో అడుగడుగునా కవిత్వం, అణువణువునా నవత్వం, ప్రతివాక్యం ఆస్వాదయోగ్యం, అనుభవైకవేద్యం.