నాయకత్వం కోసం చాలామంది ఆరాటపడుతుంటారు, తాపత్రయ పడుతుంటారు, ఆశ పడుతుంటారు. అయితే నాయకత్వంపై ఆశ ఉన్నంత మాత్రాన నాయకుడు కాలేరు. ‘పుట్టుకతో ఎవరూ నాయకుడు కాలేరు, నాయకుడు తయారవుతాడు’ అని ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విన్సి లంబార్డి ఎప్పుడో చెప్పారు. లీడర్ అంటే ఇన్స్పిరేషన్, లీడర్ అంటే మోటివేషన్. లీడర్ అంటే విజన్. ఈ లక్షణాలన్నీ కలగలిసినవాడే అసలుసిసలు లీడర్. అలాంటి నాయకత్వ లక్షణాలను పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్న యువ తేజం కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్).
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయినా అంతిమ లక్ష్యాన్ని ఎవరూ ముద్దాడలేకపోయారు. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమ బాధ్యతలను కేసీఆర్ తన భుజాన వేసుకున్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు 2004 నుంచి ఆయనకు తోడయ్యారు కేటీఆర్. కేసీఆర్ కుమారుడిగా కాకుండా ఒక సాధారణ కార్యకర్తలా ప్రత్యక్ష ఉద్యమంలో అడుగుపెట్టారు. ఎందరో యువ విద్యార్థి నాయకులను భుజం తట్టి ముందుకు నడిపి రామన్నగా పేరొందారు. కేసీఆర్ అనే మూడక్షరాలు దేశంలో ఎంత పాపులరో.. కేటీఆర్ అనే మూడక్షరాలు అంతే పాపులర్.
దూరదృష్టితో పనిచేసే వాళ్లు, మార్పు కోసం పరితపించేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవలో ముందుండేది కేటీఆర్ మాత్రమే. ఆయన వ్యక్తిత్వం, పనిచేసే విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే వేగం ముందు ఎవరూ సాటిరారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలోని యువ నాయకులకు స్ఫూర్తి కేటీఆర్. తన నైపుణ్యాన్ని సానపెట్టుకొని, శక్తియుక్తులను ఉపయోగించుకొని, బలహీనతలను అధిగమించి, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని నాయకుడిగా ఎదిగారాయన. అంతేతప్ప తండ్రి పేరు చెప్పుకొని కాదు. కేటీఆర్‌లో ఉన్నటువంటి బహుముఖ వ్యక్తిత్వం ఏమిటంటే.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం తన జీవితాన్నే ప్రజా పోరాటంగా మలుచుకోవడం. కేటీఆర్ ఆలోచనలు వైవిధ్యం. ఆచరణ వినూత్నం. టెక్నాలజీ మీద ఆయనకున్న పరిజ్ఞానం అచంచలమైనది. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన వేసిన అడుగులు విప్లవాత్మకం. వెరసి చూస్తే రాజకీయాల్లో ఆయనొక అపర చాణక్యుడు. ఎన్నో జయాపజయాలు చూసినా సడలని సంకల్పం ఆయనది. సేవాతత్పరతకు నిలువెత్తు నిదర్శనం కేటీఆర్. ఒక్కమాటలో చెప్పాలంటే.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్.

కేటీఆర్ తన తండ్రి వారసత్వాన్ని అడ్డుపెట్టుకొని వచ్చిన నాయకుడు కాదు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాన్ని, అమెరికా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం పనిచేయాలనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో సాధారణ కార్యకర్తగా ఆయ న అడుగుపెట్టారు. అనేక ఉద్యమాలకు ఊపిరై, అగ్గిబావుటాగా ఎగిసిన పోరు కెరటం కేటీఆర్. తెలంగాణ సమస్యలను సమగ్రంగా తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారం కోసం తనకున్న పరిపూర్ణమైన ఆలోచనా విధానాలతో అనతికాలంలోనే ప్రజలకు చేరువయ్యారు. ఆప్యాయత, అనురాగాలతో పాటు స్పందించే మంచి మనసున్న మారాజుగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రజల ఆశీస్సులతో మొదటి మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనతికాలంలోనే ఐటీ రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. ఐటీ దిగ్గజాలు, ప్రముఖ సంస్థ ల నుంచి మన్ననలు పొందారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశారు. లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. తద్వారా అనేక దేశాలకు దిక్సూచిగా మారారు. ఆయన అకుంఠిత దీక్షను చూసి ఐటీ దిగ్గజాలు మంత్రముగ్ధులయ్యారు. ఆయనతో కలిసి పని చేసేందుకు ముందుకువచ్చారు. ఇది కేటీఆర్ పనితనానికి నిలువెత్తు నిదర్శనం.
హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాలనే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రిగా ఆయన అహర్నిశలు శ్రమించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంలో డైనమిక్ లీడర్‌గానే కాదు, పార్టీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ప్రజల మన్ననలు పొంది రామన్నగా పేరుగాంచారు. యువ నాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం సబ్బండ వర్గాల దీవెనలతో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు సాగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన క్రమశిక్షణ కలిగిన 60 లక్షల మందికి పైగా కార్యకర్తలను గులాబీ సైన్యంలో చేర్పించారు. నవతరం నాయకుడిగా పారిశ్రామికవేత్తలు, మీడియా, సెలబ్రెటీలు, వివిధ పార్టీ నాయకుల మన్ననలు పొందుతూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు.
ఈ ప్రాంత అభివృద్ది కాంక్షించే నాయకుల్లో అరుదైన నాయకుడు కేటీఆర్. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే గుణం, వినూత్నమైన ఆలోచనలు ఆయన సొంతం. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో, వాటికి పరిష్కార మార్గం చూపడంలో ఆయనకు ఆయనే సాటి. హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆయన కృషి అనిర్వచనీయం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, క్వాల్కమ్, ఫాక్స్‌కాన్ తదితర ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు రావడం వెనుక కేటీఆర్ కృషి ఎంతగానో ఉన్నది. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన సేవలను గతంలో ఐటీ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు కొనియాడారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు కేటీఆర్. ఆపదలో ఉంటే అదుకునే గుణం, పార్టీ నాయకులకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడాయన. ఇలాంటి వర్సటైల్ లక్షణాలు ఉన్న కేటీఆర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు.
హైదరాబాద్‌లోని టీ హబ్‌లో చేరినందుకు ఆనందంతో పొంగిపోయాను. నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు టీ హబ్ అంటే ట్యాంక్‌బండ్ వద్ద టీ కార్నర్ అని ఉండేది. కానీ, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి పట్ల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపడం వల్లే టీ హబ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
– సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో
కేటీఆర్ మంత్రిగానే కాకుండా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తున్నారు. నిత్యం 24 గంటలూ తెలంగాణ అభివృద్ధి గురించి ఆయన ఆలోచిస్తారు. కేటీఆర్ చేసిన నాలుగేండ్ల నిరంతర ప్రయత్నాల ఫలితంగానే మనం ఇప్పుడు హైదరాబాద్‌లో అమెజాన్‌ను చూస్తున్నాం.
– జెఫ్ బెజోస్, అమెజాన్ ఫౌండర్
అరుదైన నాయకత్వ లక్షణాలు, అసాధారణ సంభాషణ నైపుణ్యం, రాజకీయ చతురతతో అనతికాలంలోనే పరిణతి చెందిన యువ నాయకుడు కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడు, చైతన్య శీలుడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన చూపే చొరవ మానవతా దృక్పథానికి నిదర్శనం. కార్యకుశలతలో కేటీఆర్‌కు సాటి రాగల యువనాయకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. దేశానికి కేటీఆర్ లాంటి నవతరం నాయకులు అవసరం.
– రామోజీరావు, రామోజీ గ్రూప్స్ వ్యవస్థాపకుడు
టీ హబ్ అనేది తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం. నేను ఎక్కడా ఇటువంటి దాని గురించి వినలేదు. ఇది అత్యుత్తమమైనది.
– రతన్ టాటా, టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్
కేటీఆర్ నిజమైన జెంటిల్మెన్. ఎక్కడ విజయం సాధించాలో, ఎక్కడ రాజీపడాలో ఆయనకు బాగా తెలుసు.
– సీపీ గుర్నాణి, టెక్ మహీంద్రా మాజీ సీఈవో
ప్రజా సేవలను మెరుగుపరచడానికి తెలంగాణ అత్యాధునిక ఐటీ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంది. కేటీఆర్ తన అచంచలమైన దూరదృష్టితో 2020 స్కోచ్ ర్యాంకింగ్‌లో ఎగబాకారు. అంతకుముందు 2016లోనూ స్కోచ్ ర్యాంకింగ్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచి దేశంలోనే నెంబర్.1 మంత్రిగా ఎంపికయ్యారు. తద్వారా రెండుసార్లు స్కోచ్ అవార్డు పొందిన ఏకైక రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ నిలిచారు.
– సమీర్ కొచ్చర్, స్కోచ్ గ్రూప్ చైర్మన్
– రాజేష్ నాయక్.జి
96035 79115