రాష్ట్రవ్యాప్తంగా రాజముద్రలపై రాజకీయ రచ్చ సాగుతున్న తరుణంలో కాకతీయ విశ్వవిద్యాలయం ‘లోగో’ సృష్టికర్త గురించిన చర్చ ఆసక్తిదాయకమే. కాకతీయ విశ్వవిద్యాలయం లోగోను మాత్రమే కాదు, తెలుగునాట తొట్టతొలి ధిక్కారాన్ని ప్రకటించిన మహాకవి పోతనకు ‘దృశ్య’రూపాన్నిచ్చిన తొలి వ్యక్తి దెందుకూరి సోమేశ్వరరావు.
సోమేశ్వరరావు వృత్తిరీత్యా ఆంగ్ల బోధకుడే అయినా ప్రవృత్తి రీత్యా చరిత్ర కారుడు. కాకతీయుల వైభవోజ్వల చరితను వెలికితీయటంలో ఎంతో కృషిచేసిన దెందుకూరి సోమేశ్వరావు 1924 మే 31న జన్మించారు. కాకతీయుల చరిత్రపై సోమేశ్వరరావు చేసినంతగా అధ్యయనం, పరిశోధన ఎవరూ చేయలేదని అకాడమిక్‌గా పేరున్న చరిత్రకారులు ఎంతోమంది చెప్తుంటారు. హన్మకొండలోని లష్కర్బజారులో ఉన్న ట్రైనింగ్ స్కూల్లో సోమేశ్వరరావు పాఠశాల విద్యనభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ చదివిన ఆయన అనతికాలంలోనే ప్రొఫెసర్ అయ్యారు. ఆ క్రమంలోనే ఏవీవీ కాలేజీ మొదటి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. డాక్టర్ విశ్వనాథంతో కలిసి ‘వరంగల్ ఆర్ట్స్ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. దానికి కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 1962 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘మన శిల్ప కళా సంపద’ అన్న పుస్తకాన్ని తెచ్చారు. ఇంటాక్ వరంగల్ ఛాప్టర్‌కు శాశ్వత సభ్యుడిగా, భారత్ స్కౌట్స్‌కు లైఫ్‌టైం మెంబర్‌గానూ కొనసాగారు.
కాకతీయుల మొదటి రాజధాని హన్మకొండ. రెండో రాజధాని వరంగల్. దీన్నే మనం ఇవ్వాళ ఖిలా వరంగల్ అని అంటున్నాం. వరంగల్ కోటలో ప్రవేశించగానే నాలుగు వైపులా ఉన్న తోరణ స్తంభాలను కాకతీయ కళాతోరణం, విజయతోరణం.. ఇలా పలు పేర్లతో పిలుస్తున్నాం. కోటలో ఏ ప్రదేశం ఎకడ ఉన్నది? రాతి కోట, మట్టికోట ఇలా ఏడు కోటల ప్రహరీలు.. గుడి, ఖుష్‌మహల్ వగైరా.. వగైరా ఎక్కడున్నాయో సూచించే ఒక పెద్దబోర్డు ఒకటి (పురావస్తు శాఖ సూచిక బోర్డు) కనిపిస్తుంది. దాని రూపకర్త కూడా దెందుకూరి సోమేశ్వరరావే. ఆ సూచిక బోర్డు సందర్శకులకు ఒక గైడ్‌లాగా ఉపయోగపడుతుంది. కాకతీయుల చరిత్రకు సంబంధించి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని సోమేశ్వరరావు చదివారు. తను చదివిన వాటిని డైరీలో రాసుకోవటం, క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లినప్పుడు వాటికి స్కెచ్‌లు గీసుకోవటం దెందుకూరి సోమేశ్వరరావుకు నిత్యకృత్యమని ఆయన డైరీలను చూస్తే తెలుస్తుంది. కోట గోడలు, వాటిపై ఉన్న ఆకృతులు తోరణాలు, దర్వాజలు, నిర్మాణ విభేదాలు, క్రీడాభిరామంలో అభివర్ణించిన వరంగల్ మహా నగర రూపురేఖలు.. ఇండ్ల నమూనాలను తన డైరీల్లో సోమేశ్వరరావు నిక్షిప్తం చేసేవారు.
వేయిస్తంభాల గుడి నిర్మాణంలోని శాండ్ టెక్నాలజీని మొదట గుర్తించింది సోమేశ్వరరావే. గుడిలోని నాట్యమండపం ఒక పక ఒరిగిపోతున్నప్పుడు దాన్ని తొలగించి తిరిగి నిలబెట్టాలని భావించారు. ఇందుకు ఇంటాక్, వరంగల్ ఆర్ఈసీ (ఇప్పుడు నిట్) ఇంజనీర్లను సంప్రదించి ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఉన్న నిర్మాణాన్ని పూర్తిగా పడిపోకుండా ఇతర ప్రయత్నాలు మాత్రమే చేయాలని సోమేశ్వరరావు సూచించారు. ఆయన సూచనలను పట్టించుకోకుండానే 2006లో ప్రభుత్వం నాట్యమండపం స్తంభాలన్నీ విప్పి కుప్పపోసింది. 2008లోగా మంటపాన్ని పూర్తిచేస్తామని అప్పటి ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కేంద్ర పురావస్తు శాఖ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ, ఏండ్లకేండ్లు సాగదీసి 2024లో పూర్తిచేసింది.
వరంగల్ చుట్టుపకల ఉన్న దాదాపు వందలాది దేవాలయాలను సోమేశ్వరరావు సమగ్రంగా అధ్యయనం చేశారు. రామప్ప దేవాలయానికి సంబంధించి రెండు అడుగుల పొడవైన తేలికపాటి ఇటుకలను సేకరించి వాటి ప్రాధాన్యాన్నిగుర్తించి, నీటిమీద తేలియాడేంత తేలికైన ఇటుకల సాంకేతికత గురించి సోమేశ్వరరావు అధ్యయనం చేశారు. మహాకవి బమ్మెర పోతనకు తొలి రూపాన్ని ఇచ్చింది సోమేశ్వరరావే. ఆ తర్వాత ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు ఆ చిత్రాన్ని మెరుగుపరిచారు. సోమేశ్వరరావు వేసిన మొదటి చిత్రం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో ఇంకా ఉన్నది. అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ అధికారిక ముద్ర (లోగో)ను రూపొందించింది కూడా సోమేశ్వరరావే. అందుకు తనకు యూనివర్సిటీ రూ.750 ఇచ్చిందని కూడా చెప్పుకొన్న నిజాయితీపరుడు సోమేశ్వరరావు.
– నూర శ్రీనివాస్