Sathi Leelavathi | వివాహం తర్వాత కొన్నేళ్ళు విరామం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు ‘సతీ లీలావతి’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేం తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. భార్య భర్తల కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? రివ్యూలో చూద్దాం!
కథ
అగ్ర దర్శకురాలు లీలావతి (లావణ్య త్రిపాఠి) కొన్ని కారణాలు వలన మానసిక భయాలతో పెరుగుతుంది. సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) సహాయంతో ఆ భయాల నుంచి బయటపడి అతడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే మూడేళ్ల తర్వాత సేతు మరో అమ్మాయి (మడోన్నా సెబాస్టియన్)తో ప్రేమలో ఉన్నానని చెప్పి విడాకులు కోరుతాడు. దీంతో లీలా అతడిని ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత వారి సంబంధం ఏ మలుపు తిరిగింది? చివరికి ఇద్దరూ విడిపోయారా లేదా కలిశారా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
సతీ లీలావతి ఈ తరం వైవాహిక జీవితాల్లో పెరుగుతున్న దూరాలు, ఈగోలు, అపార్థాల చుట్టూ తిరిగే కథ. విడాకులు ఇప్పుడు చాలా సాధారణమైపోయిన కాలంలో… బంధాన్ని కాపాడుకోవడం కూడా ఒక బాధ్యత అనే పాయింట్‌తో దర్శకుడు తాతినేని సత్య కథను తీర్చిదిద్దారు. ఆ ఉద్దేశం మంచిదే. కానీ ఆ ఎమోషన్ ని తెరపై ఆసక్తికరంగా మలచడంలో మాత్రం సినిమా పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. లీలావతి, రామ్ సేతు మధ్య జరిగే గొడవలు, విభేదాలు కథలో ప్రధానాంశం. అయితే సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఫ్యామిలీ డ్రామాగా మొదలైన కథలో అవసరం లేని ట్రాక్స్ మధ్యలోకి రావడంతో అసలు ఎమోషన్ డైవర్ట్ అయిపోతుంది. వీటీవీ గణేష్, సప్తగిరి ట్రాక్స్ నవ్వించకపోగా ఇంపాక్ట్ ని తగ్గించాయి. ఫస్ట్ హాఫ్‌లో కథ కొంతమేర ముందుకు కదిలినా… సెకండ్ హాఫ్ పూర్తిగా గందరగోళంగా మారుతుంది. కిడ్నాప్ డ్రామా, సిల్లీ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ కథలో సహజత్వాన్ని తగ్గించాయి. క్లైమాక్స్‌ని థ్రిల్లింగ్‌గా ముగించాలనుకున్నా ఆ ఎమోషనల్ కనెక్ట్ రాలేదు.
నటీనటుల నటన:
నటన పరంగా లావణ్య త్రిపాఠి సినిమాకి ప్రధాన బలం. అన్నీ ఎమోషన్స్ ని ఆమె చాలా సహజంగా పలికించారు. మోడ్రన్ వైఫ్ పాత్రలో కుదిరారు. దేవ్ మోహన్ కుర్చీ కి పరిమితమైన పాత్రగా మిగిలింది. నరేష్, పవిత్ర లోకేష్, సప్తగిరి, మిగతా నటీనటులు పరిధి మేర కనిపించారు.
టెక్నికల్: మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకి రిలీఫ్‌లా అనిపిస్తుంది. కొన్ని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. బినేంద్ర మీనన్ కెమెరా పనితనం సినిమాకి మంచి విజువల్ ఫీల్ ఇచ్చింది. నిర్మాణ విలువలు కూడా కథ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
లావణ్య నటన
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని సన్నివేశాలు
సెకండ్ హాఫ్
‘సతీ లీలావతి’ మంచి ఉద్దేశంతో తీసిన సినిమా, బలమైన రచన, ఎంగేజ్ చేసే స్క్రీన్‌ప్లే, వినోదం ఉంటే ఫలితం ఇంకా బెటర్ గా వుండేది.
రేటింగ్: 2.5/5