ఈస్టిండియా పాలకులు భారతదేశాన్ని నాడు తమ వలస (బానిస) దేశంగా రూపొందించుకున్నారు. అంటే పాలిచ్చే పాడి ఆవుగా తమ గాటన కట్టేసుకున్నారు. భారతీయులనే లేగదూడల గొంతు తడుపుతూ కడవల కొద్దీ పాలు పితికి తమ దేశానికి కబళించుకువెళ్లారు. నేడు దక్షిణ భారతాన్ని తమ పాడి పశువుగా రూపొందించుకొని ‘ఒక దేశం -ఒకే భాష -ఒకే జీఎస్టీ -ఒకే ఎన్నిక -ఒకే జాతీయ విద్యా విధానం -డీ లిమిటేషన్’ అనే లింకుల గొలుసుతో నార్త్ ఇండియా పాలకులు తమ గాటన కట్టేసుకోబోతున్నారని వాపోతున్నారు దక్షిణ భారతీయులు.
‘జనాభాను నియంత్రించండి! దేశాభివృద్ధికి తోడ్పడండి!’ అన్న నాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం, కుటుంబ నియంత్రణను పాటించటమే కాదు, గణనీయ ఆర్థికాభివృద్ధినీ సాధించాయి దక్షిణ భారత రాష్ర్టాలు. కానీ, అవిద్య, అంధ విశ్వాసాలలో కూరుకుపోయి, జనాభా నియంత్రణను పాటించని కారణంగా అత్యధిక జనాభాకు, పేదరికానికి నిలయాలయ్యాయి ఉత్తర భారత రాష్ర్టాలు.
నేడు ‘ఆదాయం కొద్దీ జీఎస్టీ- జనాభా కొద్దీ ఆదాయం పంపిణీ’ అంటూ… 1.రూపాయి జీఎస్టీని అందిస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు అందులోనుంచి సగటున 0-30 పైసలు విదిల్చుతున్నారు. అదే రూపాయినందిస్తున్న ఉత్తరాది రా ష్ర్టాలకు వారిచ్చిన రూపాయికి అదనంగా 3 రూపాయలు కలిపి, సగటున 4 రూపాయలు కట్టబెడుతున్నారు నార్తిండియా పాలకులు. నాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని పాటించినందుకు, దక్షిణాది రాష్ర్టాలకు వారు విధిస్తున్న కఠి న శిక్ష అని వాపోతున్నయి దక్షిణ భారత రాష్ర్టా లు. 2.ఒకే జాతీయ విద్యావిధానం పేరిట, హిందీ భాషా సంస్కృతులతో దక్షిణాది భాషా సంస్కృతులపై దాడి పూనుకోవటం మరో శిక్ష. 3.తమ చేతి రిమోట్ లాంటి గవర్నర్ల నియామకం ద్వారా దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాలను శాసించటం, ఇంకో శిక్ష. 4.రేపో, మాపో ‘డీ లిమిటేషన్’ అంటే, జనాభా ప్రాతిపదికన ‘ఎంపీ’ సీట్ల పెంపు పేరిట, అధిక జనాభా గల ఉత్తరాది హిందీ రాష్ర్టాలలో భారీగా ఎంపీ సీట్లను పెంచుకొని, తద్వారా ఎ.దక్షిణ భారత ఎంపీలతో పనిలేకుండానే అధికారాన్ని చేయటం. బీ.దక్షిణ భారత గొంతును పార్లమెంట్లో వినపడకుండా చేయటం. సీ.దక్షిణ భారతాన్ని అణచివేసే చట్టాలను, సంఖ్యాబలం, లేమితో వాటిని అడ్డుకోలేని బలహీన రాష్ర్టాలుగా రూపొందించి, దక్షిణ భారతాన్ని తమ పాడి పశువుగా రూపొందించుకోవాలనుకోవటం అతి పెద్ద శిక్ష.
ఇప్పటికే 1.కడివెడు జీఎస్టీని ఇస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు ముంతెడు విదిల్చటమే కాదు, 2.దక్షిణ భారత జల వనరులు, ఖనిజాల మీద వారి అజమాయిషీయే. 3.దక్షిణ భారత సాగర తీర భూములను ఖనిజాలను నార్తిండియా పాలకులు తెగనమ్ముకునే చట్టాలూ చేశారు. 4.ఇంకా దయనీయమేమంటే, గంపెడు ఆదాయాన్నిస్తున్న దక్షిణ భారత రైల్వే జోన్‌కు బుట్టెడు నిధులు విదిల్చి – బుట్టెడు ఆదాయాన్నిస్తున్న ఉత్తర భారత రైల్వే జోన్‌కు గంపెడు నిధులు కుమ్మరించటం. 5.అంతేకాదు, ‘నవరత్న’ హోదాను, ప్రపంచఖ్యాతిని పొంది, వేలాది ఎకరాలలో విశాఖ సాగరతీరాన విస్తరించి ఉన్న అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం, దానికి గనులు కేటాయించకుండా, ఉద్దేశపూర్వకంగా అప్పుల్లోకి నెట్టి, దాన్ని ఆశ్రిత కార్పొరేట్లకు కట్టబెట్టజూస్తున్న అడ్డుకోలేని, కనీసం ప్రశ్నించలేని అసహాయులను చేశారు దక్షిణ భారతీయులను.
దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, జనాభా నియంత్రణ వల్ల ఎంపీ సీట్లు తగ్గి నార్తిండియా పాలకులను కనీసం ప్రశ్నించలేని, బలహీన స్థితిలో ఉన్నయి దక్షిణాది రాష్ర్టాలు. డీ లిమిటేషన్‌తో ఉనికినే కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తుందన్న వాస్తవాన్ని గుర్తించి, దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను ముందుగానే హెచ్చరించిన దీర్ఘదర్శి తమిళనాడు సీఎం స్టాలిన్.
డీలిమిటేషన్ ప్రమాదం స్టాలిన్ ఊహ కాదు, ఈపాటికే నార్తిండియా పాలకులు రూపొందించుకున్న ప్రణాళిక అది! ఇప్పుడున్న 543 ఎంపీలకు అదనంగా 300 ఎంపీలను, ఉత్తరాది హిందీ రాష్ర్టాలలోనే పెంచుకోవాలన్నది వారి ప్రణాళిక. ‘దక్షిణాది రాష్ర్టాల ఎంపీ సీట్లు తగ్గవు’ అన్న అమిత్ షా ప్రకటనకు అర్థం పెరగవు అనే కదా! 888 ఎంపీలు కూర్చునేంత సువిశాల పార్లమెంట్ భవన నిర్మాణం, వారి ముందస్తు ప్రణాళికకు నిలువెత్తు నిదర్శనం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
దక్షిణ భారతాన్ని కాంగ్రెస్ వాళ్లు రబ్బరు సుత్తితో మోదితే బీజేపీ వారు ఇనుప సుత్తితో మోదుతున్నారు. ఈ విషయంలో రెండు పార్టీలకు గల తేడా అంతే. ఇప్పటి నార్తిండియా పాలకుల ఎత్తుగడలు, ఒకప్పటి ఈస్టిండియా వారి ఎత్తుగడలను గుర్తుకుతెస్తున్నాయంటూ వాపోతున్నారు దక్షిణ భారతీయులు.
ఈస్టిండియా పాలకుల ఎత్తుగడలు: 1.హిందూ, ముస్లిం రాజ్యాల మధ్య మత విద్వేష వ్యాప్తి ద్వారా, మెజారిటీ హిందూ రాజుల సమీకరణతో ముస్లిం రాజులను హతమార్చి వారి రాజ్యాలనాక్రమించారు. 2.హిందూ రాజులలో ఒకరికి మద్దతిస్తూ మరొకరిని హతమార్చుతూ అంతిమంగా హిందూ రాజ్యాలనూ దురాక్రమించారు. 3.ఆంగ్లభాష నేర్చినవారికీ ప్రభుత్వోద్యోగాలనూ -పదవులనూ కట్టబెడుతూ తమ భాషా, సంస్కృతులను విస్తరింపజేసుకున్నారు. 4.భారతదేశ ఖనిజ సంపదను తమ కార్పొరేట్లకు కట్టబెట్టుకున్నారు. 5.తమను ప్రశ్నించే పత్రికలను నిషేధించి, తాము చెప్పింది రాసే మీడియాను ప్రోత్సహించారు. ఆ ఎత్తుగడలతోనే భారతదేశాన్ని 200 ఏండ్ల పాటు తమ పాడి పశువుగా వాడుకున్నారు.
నేటి నార్తిండియా పాలకులు గూడ 1.‘హిందూత్వ’ నినాదంతో మెజారిటీ హిందూ ఓటర్ల సమీకరణతో అధికారాన్ని దక్కించుకున్నారు. 2.‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదంతో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి, మరో ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేయటం ద్వారా ‘ప్రాంతీయ పార్టీల ముక్త భారత్’ లక్ష్యంతో దూసుకువెళ్తున్నారు. 4.హిందీ నేర్చిన వారికి ప్రవేశ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఇస్తూ తమ భాషా సంస్కృతులను విస్తరింపజేసుకుంటున్నారు. 5.తమను నిలదీసే మీడియాను, జర్నలిస్టులను అణచివేస్తూ, తమను ఆకాశానికెత్తే మీడియాను ప్రోత్సహిస్తున్నారు.
అందుకే, నాటి ఈస్టిండియా పాలకుల లాగే నేటి నార్తిండియా పాలకులు గూడ దక్షిణ భారతాన్ని తమ పాడి పశువుగా చేసుకుంటారన్న భయాందోళనలో మునిగి తేలుతున్నారు దక్షిణ భారతీయులు. అందుకే కాంగ్రెస్, బీజేపీల నార్తిండియా పాలకులారా..
ఇప్పటికైనా దయచేసి మీ విధానాలను మార్చుకొని, దక్షిణ భారతీయుల భయాన్ని తొలగించండి. ముఖ్యంగా ‘డీ లిమిటేషన్ ప్రక్రియను’ జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రతి రాష్ర్టానికి మినిమం 20 ఎంపీలు మాగ్జిమమ్ 50 ఎంపీలుండేలా, అఖిల పక్షాల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించండి.
తద్వారా, ప్రతి రాష్ర్టానికీ మేము భారతదేశ భాగస్వాములమేనన్న భరోసాను కల్పించండి. అలా జాతీయ సమైక్యతను కాపాడండి, లేకుంటే.. పాక్ పాలకుల నిరంకుశ, అణచివేత, దోపిడీ విధానాలకు విసిగి నాడు బంగ్లాదేశ్ విడిపోయింది. ఐనా సరే, పాక్ పాలకులు తమ విధానాలను మార్చుకోని కారణంగా నేడు ‘బలూచిస్థాన్’ విడిపోయేందుకు ఉద్యమించింది. పాక్ పరిణామాలను చూసైనా నార్తిండియా పాలకులు, తమ విధానాలను మార్చుకుంటారని, ఇటు దక్షిణ భారత, అటు ఈశాన్య రాష్ర్టాల ఉద్యమాలకు బీజాలు పడకుండా, భారత జాతీయ సమైక్యతను కాపాడుతారని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.