ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచ లనాలు నమోదయ్యే అవకా శాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. ఈ ఎన్నికలు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజే పీ, కాంగ్రెస్ మధ్య జరుగుతు న్నాయి. అయితే పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే. అయితే, ఆప్‌కు వెళ్లాల్సిన ఓట్లను మాత్రం కాంగ్రెస్ తప్పకుండా చీలుస్తుంది. దీనివల్ల లబ్ధి పొందేది బీజేపీ నే. అయితే, గాలి ఏ పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ ఓటర్లు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఎన్నికల సమరాంగణంలో ఉన్న అభ్యర్థులు పరస్ప రం చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలను ఢిల్లీ వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆప్ గురించి చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆ పార్టీకి చావో రేవో లాంటివి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆప్ ఆ తర్వాత ఢిల్లీని తన కంచుకోటగా మార్చుకున్నది. అంతేకాదు, పంజాబ్‌కూ విస్తరించింది. గుజరాత్, గోవాలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నది. సమీప భవిష్యత్తులో ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాలని పగటి కలలు కంటున్న కేజ్రీవాల్‌కు ఇది సుదీర్ఘ ప్రయాణం.
ఆప్ 2013లో తమది సామాన్యుల పార్టీ అని ప్రకటించింది. స్వచ్ఛమైన పాలన అందిస్తామని, రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తామని ప్రకటించి కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. కేజ్రీవాల్ ఆహార్యం అత్యంత సామాన్య వ్యక్తిలా ఉండటంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అయి తే, మెట్రోలో ప్రయాణించడం, మారుతి కారులో కార్యాలయానికి వెళ్ల డం చూసి చాలామంది దీన్ని పొలిటికల్ స్టంట్‌గా కొట్టిపడేశారు. కేజ్రీవాల్ ఆ తర్వాత సీఎం నివాసానికి రూ.80 కోట్లు ఖర్చుచేసి శీష్మహల్లో నివసిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు ఢిల్లీ లిక్కర్ కుం భకోణంలో కేజ్రీవాల్, ఆయన క్యాబినెట్ సహచరులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా ఇతర నేతలు జైలుకు వెళ్లొచ్చారు.
అయితే, ఆప్ ప్రకటించిన ఉచితాలు ఆ పార్టీకి కొంత ఫేవర్‌గా కనిపిస్తున్నాయి. విద్యుత్తు చార్జీలను తగ్గించడం, విద్యావ్యవస్థలో నాణ్యత, అనారోగ్య పీడితుల కోసం మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు వంటివి ఆప్‌పై ప్రజల ఆదరణకు కారణమయ్యాయి. గతంలో వీటిని విమర్శించినవారు ఇంచుమించు అలాంటి పథకాలే ప్రకటిస్తూ ఆప్‌ను ఆనుకరించే ప్రయత్నం చేస్తున్నా రు. అయితే, పెరుగుతున్న పన్నులపై మధ్యతరగతి ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ వాసులు మౌలిక సదుపాయాలు, పక్కా రోడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన గాలి, నీరు కోసం ఎదురుచూస్తున్నా రు. అయితే, మూడు ప్రధాన పార్టీలు కూడా కనీస సౌకర్యాల గురించి ఆలోచించకుండా పేదలు, మహిళలు, వృద్ధులకు ఉచితాల విషయంలో పోటీ పడుతున్నాయి.
ఢిల్లీ నాయకులు గత ఐదేండ్లుగా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంలో బిజీగా ఉన్నారు తప్పితే ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యానికి పరిష్కారం వెతికేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గాలిలో నాణ్యత ఏకంగా 400 పీఎంకు పడిపోయింది. రాజధాని ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించలేకపోతున్నందుకు ఆప్, బీజేపీలను నిందించడం మాని కలుషిత గాలిని శుభ్రం చేసే చర్యలు చేపట్టాలి. ప్రత్యర్థిపై వాదనలో విజయం సాధించడం కంటే సానుకూల దృక్పథం ప్రజలను ఆకట్టుకుంటుంది.
‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’ అనే ట్యాగ్ ఇప్పుడు బీజేపీకి సంబంధించినది కాదు. మోదీ సారథ్యంలోని బీజేపీప్రభుత్వం ఆప్ ప్రభుత్వానికి పనిచేసే స్వేచ్ఛ ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యం. లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత అధికారులను కూడా నియమించుకోకుండా గవర్నర్ చేతు లు కట్టేయడంతో న్యాయం కోసం ప్రతిసారి ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తున్నది. ప్రస్తుతం మూడు పార్టీలు ఒకేలా కనిపిస్తున్నాయి. మూడూ ‘బ్లేమ్ గేమ్’నే ఎంచుకున్నాయి. ఇవి కొంతమంది ఓటర్లను ‘నోటా’ను ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి.
బీజేపీ ఇప్పటివరకు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతున్నది. ఇక, ఆప్ ఇమేజ్ బాగా దెబ్బతిన్నది. ఇక, కాంగ్రెస్ పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నది. కాంగ్రెస్ అనుసరిస్తున్న అలసత్వ వైఖరి ఓటర్లను ఆకట్టుకునేలా లేదు. తమ గెలుపుపై తమకే నమ్మకం లేనప్పుడు ఇక వారు ఓటర్లను ఎలా ఒప్పిస్తారు. హై కమాండ్ నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో పార్టీ సీనియర్లు ఎవరికి వారే సొంతంగా పోటీ చేస్తున్నారు.
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతున్నది. కల్కాజీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు అల్కా లాంబా బరిలో ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ బరిలో ఉన్నారు. ఇక్కడ బరిలో ఉన్న మూడు పార్టీల అభ్యర్థులు బలమైన నేతలే. ఈసారి కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కనిపిస్తున్నప్పటికీ అది గెలుపు రూపంలోకి ఎంతవరకు మారుతుందన్నది చూడాలి.
ఆప్‌లోని పెద్ద నాయకులందరూ తమ సొంత ఎన్నికల పోరులో బిజీగా ఉండగా, కేంద్రంలోని బీజేపీ మాత్రం తమ 70 మంది అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నది. యూపీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని మోదీ కేజ్రీవాల్, ఆయన బృందానికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆప్ నేతలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఢిల్లీ వాసులు ఆ పార్టీ నేతలను తిరస్కరిస్తారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే, అవినీతి అక్రమాలు, ఆరోపణలు, ప్రత్యారోపణ లు ఢిల్లీ వాసులను ఆకట్టుకునే అంశాలు కాదు. ఈ మూడు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటీ కల్పిస్తామని హామీ ఇవ్వని కనీస సౌకర్యాలను ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు. అయితే, ఫలితం ఎలా ఉండబోతున్నదని అంచనా వేయడం మాత్రం చాలా కష్టం.
(వ్యాసకర్త: ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్)
-అనిత సలుజా