ఢిల్లీలోని బొటిక్ సేవల స్టార్టప్ కంపెనీ ‘యెస్ మేడమ్’ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నది. పని ఒత్తిడికి గురవుతున్నట్టు అభ్యర్థించిన కొందరు ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వ్యాపించాయి. దీంతో ఆ వివాదం ముదిరిందని గమనించిన సదరు కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ‘ఎవరినీ తొలగించలేదని, కొంతకాలం పాటు విరామం మాత్రమే’ అని వివరణ ఇచ్చింది. దీంతో, ప్రైవేటు ఉద్యోగుల పని పరిస్థితులు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. నేడు పని ఒత్తిడి అనే సమస్య ప్రపంచవ్యాప్త మహమ్మారిలా మారిపోయింది. ఉద్యోగులు ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యలకు పని ఒత్తిడే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నిరంతరం అందుబాటులో ఉండటం’ అనే సూత్రం ఈ రోజుల్లో తప్పనిస రైంది.
ఒక సర్వే ప్రకారం ప్రతి పది మందిలో తొమ్మండుగురికి పనిగంటల వెలుపల ఆఫీసు ఫోన్లు వస్తున్నాయి. ఆ కాల్స్ ఎత్తకపోతే ప్రమోషన్లు నిలిపివేయడం వంటి సమస్యలు ఎదురైనట్టు 79 శాతం మంది చెప్పారు. దీని పర్యవసానంగా వ్యకిగతమనేది కుంచించుకుపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు పని ఒత్తిడి వల్ల చతికిలపడుతుంటే ఆసియాలో మాత్రం వారి సంఖ్య ప్రతి ముగ్గురిలో ఒకరుగా ఉండటం బాధాకరం. పని చేసే వయసులో ఉన్న 15 శాతం మంది వయోజనులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియజేసింది.
ఉద్యోగుల్లో మానసిక సమస్యల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల పనిదినాలు వ్యర్థమవుతున్నాయి. తద్వారా రూ.80 లక్షల కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లుతున్నది. ఆర్థిక సరళీకరణల అనంతర కాలంలో హక్కులు, యూనియన్లు బలహీనపడిపోవడం ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం. ఉద్యోగ భద్రత అనేది ఉల్లిపొరలా పలుచనైంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ భారం ఉసురు తీస్తున్నది. లక్ష్యాలు అందుకోవడం కోసం తీసే పరుగుల్లో అలసిసొలసి అసువులు బాసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. బహుళజాతి దిగ్గజ సంస్థ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’లో పనిచేస్తున్న 26 ఏండ్ల యువతి పని ఒత్తిడి కారణంగా ఇటీవల మరణించిందన్న వార్త సంచలనమైంది. నిజానికి ఈ తరహా మరణాలు లెక్కల్లోకి ఎక్కవన్నది తెలిసిందే.
ఓ వైపు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడంపై ఆరోగ్య, సామాజికరంగ నిపుణులు బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాత్రం పనిగంటలు పెంచాలని బాంబు పేలుస్తున్నారు. వారానికి 48 గంటల పని సమయంతోనే తిప్పలు పడుతుంటే ఆయ న ఏకంగా 70 గంటలకు పెంచాలని సూచించడం విడ్డూరం. ఈ ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనల మాట అలా ఉంచితే తక్షణం కావాల్సింది ఉద్యోగుల సంక్షేమం. ఉద్యోగం చేయడానికి బతుకుతున్నామో లేక బతికేందుకు ఉద్యోగం చేస్తున్నామో తెలియని విషమ వలయంలో వారు ఊగిసలాడుతున్నారు. వీలైనంత త్వరలో పని పరిస్థితులు చక్కదిద్ది బతుకుపై భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలోనే కాదు, ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అభిలషణీయమే.